కాళ్ల పారాణి ఆరక ముందే.. | New Married Couple Deceased in Road Accident West Godavari | Sakshi
Sakshi News home page

కాళ్ల పారాణి ఆరక ముందే..

Published Fri, Jun 19 2020 6:18 AM | Last Updated on Fri, Jun 19 2020 4:56 PM

New Married Couple Deceased in Road Accident West Godavari - Sakshi

భీమడోలు సమీపంలోని పూళ్ల గ్రామం వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలోనవ జంట దుర్మరణం పాలైంది. కారు డ్రైవరూ అసువులు బాశాడు. ఇటీవలే వివాహమైన గుంటూరు జిల్లా
తెనాలి సమీపంలోని గోవాడ గ్రామానికి చెందిన మానస నవ్య భర్త వెంకటేష్‌తో కలిసి అత్తవారింటికి విశాఖ జిల్లా సబ్బవరానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈనెల 14న జరిగిన నవ్య పెళ్లినాటి ఫొటో ఇది..
  

ఏలూరు టౌన్‌/భీమడోలు: కాళ్ల పారాణి ఆరకముందే నవ వధూవరులు ఘోర రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. కొత్త ఆశలతో భవిష్యత్తును ఊహించుకుంటూ... నాలుగు రోజుల క్రితం ఎంతో వైభవంగా వివాహ వేడుకలు చేసుకున్న నవ జంటను చూసి కాలానికి కన్నుకుట్టిందో ఏమో గానీ... గురువారం మధ్యాహ్నం మృత్యుపాశం విసిరింది. సంతోషంగా అత్తారింటికి బయలుదేరిన నవ్యను, ఆమె భర్త వెంకటేష్‌ను విగత జీవులను చేసింది. నవ జంట కాళ్ళకు వేసిన పారాణి ఇంకా ఆరలేదు... కానీ ఇద్దరినీ మృత్యువు కబళించింది. ఈహఠాత్తు సంఘటన కుటుంబ సభ్యులు, బంధువులకు పుట్టెడు దుఃఖాన్ని మిగి ల్చింది. వధువు ఇంటి వద్ద వివాహ వేడుకలు పూర్తి చేసుకుని, వరుడి స్వస్థలం విశాఖపట్నం జిల్లా సబ్బవరంలోని ఇంటికి కారులో వెళుతుండగా గురువారం మధ్యాహ్నం భీమడోలు సమీపంలోని పూళ్ళ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నవజంటతోపాటు డ్రైవర్‌ కూడా మృతిచెందగా, వధువు సోదరుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.

కంటతడి పెట్టిస్తున్న వైనం   
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ యడ్లపల్లి వెంకటేష్, ఆలపాటి మానస నవ్య ఇద్దరూ.. ఈనెల 14న ఎంతో సంతోషంగా వివాహం చేసుకున్నారు. తెనాలి సమీపంలోని గోవాడ గ్రామంలో నవ్య ఇంటివద్దనే మూడు రోజులు ఆనందంగా గడిపారు. తమ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలో ప్రణాళిక వేసుకున్నారు. భర్త వెంకటేష్‌ ఇంటికి విశాఖపట్నం జిల్లా సబ్బవరానికి కారులో బయలుదేరారు. కారు డివైడర్‌ను ఢీకొట్టి ఆవలి వైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయింది. నవ దంపతుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్‌ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన తెలిసి ఇరు కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. తమ బిడ్డల భవిష్యత్తు బంగారుమయం కావాలని ఆశపడితే ఇలా తిరిగిరాని లోకాలకు చేరటం తట్టుకోలేకపోతున్నామని వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్‌
ప్రమాదం ఎలా జరిగింది ?  
కారు ప్రమాదం ఎలా జరిగిందనేది ప్రశ్నార్థకంగా మారింది. కారు డ్రైవర్‌ కునుకుతీయడంతో అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుందా, లేక మరేదైనా కారణమా అనేది నిర్ధారణ కావలసి ఉంది. పెళ్ళి కుమార్తె నవ్య సోదరుడు భరత్‌ చెప్పే విషయాలను బట్టి.. ఏదో లారీ తమ కారును పక్కనుంచి బలంగా ఢీకొట్టటంతో తమ కారు గాలిలో ఎగురుతూ డివైడర్‌ దాటి అటువైపు దూసుకుపోయిందని చెబుతున్నాడు. కారు టైర్‌ పంక్చర్‌ కావటంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఆవలి వైపుకు వెళ్లి లారీని ఢీకొట్టి ఉంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసును పోలీసులు విచారణ చేస్తున్నారు. 

క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించిన డీఎస్పీ 
పూళ్ళ గ్రామం వద్ద జరిగిన ఈ కారు ప్రమాదాన్ని అటుగా వెళుతున్న ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్‌ చూడడంతో వెంటనే ఆయన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వచ్చే సరికే ముగ్గురు మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. ప్రమాదం జరిగిన తీరును డీఎస్పీ పరి శీలించి, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement