
నిందితుడిని అరెస్ట్ చేసి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి
తణుకు : తన భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన ఇది. మద్యం తాగుదామని పిలిచి మద్యం షాపులోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. తణుకు మండలం దువ్వలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో అదే గ్రామానికి చెందిన కామన బాలాజీ (24) అక్కడికక్కడే మృతి చెందాడు. కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మొగల్తూరు గ్రామానికి చెందిన గుడాల శివరామకృష్ణ తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన రోజారమణితో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. వీరికి ఆరేళ్ల వయసున్న పాప ఉంది. రోజారమణి ద్వారా దువ్వకు చెందిన బాలాజీ అనే యువకుడు శివరామకృష్ణకు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో బాలాజీతో తన భార్య సన్నిహితంగా ఉంటోందని శివరామకృష్ణ అనుమానం పెంచుకున్నాడు.
ఈ విషయంలో గతంలోనే బాలాజీని హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోవడంతో రెండు నెలల క్రితం శివరామకృష్ణ రోజారమణిని ఉపాధి నిమిత్తం విదేశాలకు పంపించాడు. అయినప్పటికీ బాలాజీ ఆమెతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు శివరామకృష్ణ గమనించాడు. దీనిపై ఇటీవల రెండు పర్యాయాలు గట్టిగా అతడిని హెచ్చరించాడు. నెలరోజుల క్రితం శివరామకృష్ణ బాలాజీ ఇంటికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులకు సైతం విషయాన్ని తెలిపాడు. ఇదిలా ఉంటే బాలాజీ శుక్రవారం రాత్రి శివరామకృష్ణకు ఫోన్ చేసి దువ్వ రావాలని మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకుందామని చెప్పాడు. దీంతో దువ్వ గ్రామానికి వచ్చిన శివరామకృష్ణ.. మద్యం తాగేందుకు బాలాజీని తీసుకుని గ్రామంలోని సూర్య వైన్స్‌కు చేరుకున్నారు.
అక్కడ ఇద్దరూ మద్యం తాగుతుండగా వారి మధ్య రోజారమణి విషయంపై మరోసారి ఘర్షణ తలెత్తింది. ఇదే సమయంలో బాలాజీ శివరామకృష్ణ భార్యకు ఫోన్ చేసి ఆమెతో మాట్లాడాడు. దీన్ని అవమానంగా భావించిన శివరామకృష్ణ తనతోపాటు తెచ్చుకున్న కత్తితో బాలాజీ గొంతులో పొడిచాడు. తీవ్ర గాయమైన బాలాజీ తనను కాపాడాలని పరిసర ప్రాంతాల్లో కలియతిరిగాడు. మద్యం షాపులోనే పనిచేస్తున్న బాలాజీ చిన్నాన్న కామన ఆంజనేయులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. శివరామకృష్ణ తన మోటారు సైకిల్‌ను అక్కడే వదిలి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాలాజీ కొద్దిసేపటికే ప్రాణాలు వదిలాడు. సమాచారం తెలుసుకున్న తణుకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణ, రూరల్ ఎస్సై ఎన్.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
హత్యకు ముందు ఫొటో..
బాలాజీని హత్య చేయడానికి ముందు శివరామకృష్ణ అతడితో కలిసి ఫొటో తీసుకున్నాడు. మద్యం తాగుతున్న స్థలంలోనే ఫొటో తీయించుకున్న శివరామకృష్ణ హత్య చేసిన అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అతడిని వెంబడించి హైవేపై పట్టుకున్నారు. శివరామకృష్ణకు దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. మృతుడు బాలాజీ తండ్రి కామన రాముడు రెండేళ్ల క్రితం మృతి చెందగా ప్రస్తుతం తల్లి సత్యవతితో కలిసి ఉంటున్నాడు. ఇతనికి సోదరి ఉండగా ఆమెకు వివాహం చేశారు. బాలాజీ స్థానికంగా రాడ్‌బెండింగ్ పని చేస్తుంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిందితుడు శివరామకృష్ణ కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బం«ధువులకు అప్పగించారు. నిందితుణ్ని అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.

హత్యకు ముందు బాలాజీతో ఫొటో తీసుకున్న శివరామకృష్ణ (ఎడమవైపు)
Comments
Please login to add a commentAdd a comment