![Woman Murder In West Godavari - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/27/woman.jpg.webp?itok=KpXhn4pC)
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: హత్యకు గురైన ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం కనుగొన్నారు. మండలంలోని గుణ్ణంపల్లి శివారులో పోలవరం కాలువ వద్ద పొదల్లో ఈ మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని, పరిసరాలను పరిశీలించారు. సుమారు 30 సంవత్సరాలు వయసు కలిగిన మహిళ మృతదేహం ఉన్న పరిస్థితిని బట్టి, ఆమె హత్యకు గురై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఆమె కాళ్లు తాళ్లతో కట్టేసి ఉండటం, అలాగే మెడ చుట్టూ ఉన్న గాయాలను పరిశీలించిన పోలీసులు ఇది కచ్చితంగా హత్యే అయి ఉంటుందని నిర్ధారించారు. ఆమెను వేరే ప్రాంతంలో మూడు నాలుగు రోజుల క్రితం హత్యచేసి, మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తుపట్టలేని స్థితిలో ఉబ్బిపోయి ఉన్న ఈ మృతదేహానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. భీమడోలు సీఐ బీఎన్.నాయక్ పర్యవేక్షణలో ద్వారకాతిరుమల ఎస్సై ఐ.వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment