35 Years Old Woman Murdered Due To Financial Dispute In Prakasam - Sakshi
Sakshi News home page

వివాహిత హత్యపై ‘ఈనాడు’ తప్పుడు కథనం.. అసలేం జరిగిందంటే..?

Published Sat, May 20 2023 9:25 AM | Last Updated on Sun, May 21 2023 8:27 AM

35 Years Old Woman Murdered At Prakasham For Financial dispute - Sakshi

హతురాలు కె.రాధ (ఫైల్‌), ఘటనను పరిశీలిస్తున్న పోలీసులు

సాక్షి, కనిగిరి రూరల్‌ : ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెల్లపాడుకు చెందిన వివాహిత కోటా రాధ (35) బుధవారం రాత్రి హత్యకు గురైంది. ఈ కేసులో మృతురాలి స్నేహితుడు కేతిరెడ్డి కాశయ్య అలియాస్‌ కా శీరెడ్డి కీలక నిందితుడిగా పోలీసులు అనుమాని స్తున్నారు. ఆర్థికపరమైన అంశాలే హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మృతురాలి తల్లిదండ్రులు కూడా కాశయ్యపైనే ఫిర్యాదు చేశారు.  

వివరాలివీ..
రాధ, కాశయ్యలు స్నేహితులు. ఒకే పాఠశాలలో చదువుకున్నారు. జిల్లెల్లపాడుకు చెందిన కె. రాధకు, నల్గొండ జిల్లా కోదాడకు చెందిన మోహన్‌రెడ్డితో వివాహమైంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. మోహన్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, రాధ గృహిణి. అప్పటికే హైదరాబాద్‌లోనే నివాసముంటున్న కాశయ్య తాను సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెడుతున్నానని, దానికి నగదు కావాలంటూ వీరి వద్ద నుంచి సుమారు రూ.51 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు.

కంపెనీలో నష్టంరావడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. అప్పుగా తీసుకున్న నగదు వడ్డీతో కలిపి సుమారు రూ.80 లక్షలు అయింది. అయితే, రెండేళ్ల నుంచి డబ్బులు చెల్లించకపోవడంతో తరచూ రాధ, మోహన్‌రెడ్డి ఒత్తిడి చేస్తుండటంవల్లే రాధను కాశయ్య హత్యచేశాడనే ప్రచారం సాగుతోంది. 

అసలేం జరిగిందంటే..
ఈనెల 11న జిల్లెలపాడులోని చౌడేశ్వరమ్మ తిరు నాళ్లకు రాధ కుటుంబీకులు హైదరాబాద్‌ నుంచి పుట్టింటికి వచ్చారు. అది తెలుసుకున్న కాశయ్య.. తాను ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నానని, తండ్రికి, భర్తకు ఎవరికీ చెప్పకుండా కనిగిరికి వస్తే రూ.2 లక్షలు చెల్లిస్తానని ఐదురోజుల క్రితం మెసేజ్‌ పెట్టాడు. అయితే, రాధ వెళ్లలేదు. తిరిగి బుధవారం మరో మెసేజ్‌ పెట్టాడు. దీంతో రాధ అదేరోజు తన చిన్న కుమారుడిని తీసుకుని తండ్రికి చెప్పకుండా, ఇంట్లో అమ్మకు చెప్పి కనిగిరి వెళ్లింది. అక్కడ చిన్నాన్న ఇంట్లో పిల్లవాడ్ని వదిలిపెట్టింది.

తర్వాత బాబాయ్‌తో వచ్చి పిల్లవాడికి దుస్తులు షాపింగ్‌ చేసింది. సా.6.47 గంటల సమయంలో పామూరు బస్టాండ్‌లో గల సీసీ ఫుటేజీల్లో కనిపించింది. రా.8.30 గంటల నుంచి రాధ ఫోన్‌ పనిచేయలేదు. నాగిరెడ్డి మృతురాలి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి అన్నిచోట్ల వెతికారు. ఫలితం లేకపోవడంతో అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 12.50 గంటలకు ఫోన్‌ లొకేషన్‌ కనిపెట్టారు. అది జిల్లెల్లపాడు వద్ద కన్పించడంతో అక్కడికి వెళ్లి చూడగా రాధ విగతజీవిగా పడి ఉంది.
చదవండి: సరదాగా తిరిగొద్దామనుకుంటే.. కబళించిన మృత్యువు 

రాధను ఒక చోటికి తీసుకెళ్లి హత్యచేసి ఆ తర్వాత మరో ప్రదేశానికి తీసుకెళ్లి పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాధను హంతకులు కారులోకి ఎక్కించుకుని మత్తు మందు ఇచ్చి ఎవరూ లేని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి చున్నీతో గొంతు నులిమి, తలపై బలంగా కొట్టి హత్యచేసి ఉంటారని ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. ఆ తర్వాత ఆమెను జిల్లెల్లపాడు క్రాస్‌ రోడ్డు వద్ద పడేసి దాన్ని రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. 

ఈనాడు కథనం అవాస్తం : డీఎస్పీ 
ఈ హత్యకు సంబంధించి ఈనాడు కథనం పూర్తిగా అవాస్తమని కనిగిరి డీఎస్పీ ఆర్‌ రామరాజు అన్నారు. పోలీసులు జాప్యం చేశారని, సకాలంలో స్పందించలేదని రాయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో అత్యాచారం జరిగినట్లు వెల్లడికాలేదన్నారు. మృతురాలి తల్లిదండ్రులు కాశయ్యపై ఫిర్యాదు చేశారని, ఆ కోణంలో దర్యాప్తు జరుపుతున్నామన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement