వారికీ ఈ అఘాయిత్యంలో పాత్ర ఉందా? | Man Arrst in Sri Dharani Murder Case West Godavari | Sakshi
Sakshi News home page

శ్రీధరణి హత్య కేసు దర్యాప్తు ముమ్మరం

Published Tue, Feb 26 2019 8:28 AM | Last Updated on Tue, Feb 26 2019 8:28 AM

Man Arrst in Sri Dharani Murder Case West Godavari - Sakshi

దౌలూరి నవీన్, మృతి చెందిన తెర్రి శ్రీధరణి

పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం/కామవరపుకోట: శ్రీధరణి హత్య కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలీసు అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సోమవారం పకడ్బందీ పోలీసు బందోబస్తుతో శ్రీధరణి మృతదేహానికి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.  ఘటనా స్థలమైన కామవరపుకోట మండలం జీలకర్రగూడెం బౌద్ధ గుహల ప్రాంతంలో పోలీసులు ఆధారాల కోసం  జల్లెడపట్టారు. శ్రీధరణి, నవీన్‌లకు చెందిన సెల్‌ ఫోన్ల సిగ్నల్స్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయో పోలీసులు కనుగొన్నట్టు విశ్వసనీయ సమాచారం. బౌద్ధ గుహల సందర్శన కోసం వచ్చిన ప్రేమజంటపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దీనికి సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఆధారాలు సేకరించిన క్లూస్‌టీమ్‌
బౌద్ధ గుహల ప్రాంతంలో ఏఎస్పీ ఈశ్వరరావు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్‌ మురళీకృష్ణ, సీఐ చవాన్, టి.నరసాపురం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం ఎస్సైలు రాంబాబు, రామకృష్ణ, ఎ.దుర్గారావు క్లూస్‌ కోసం జల్లెడ పట్టారు. క్లూస్‌ టీమ్‌ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. వేలిముద్ర నిపుణులు ఘటనా ప్రాంతంలో వేలిముద్రలను సేకరించారు. పోలీసు జాగిలం (డాన్‌)తో ఆ ప్రాంత మంతా పరిశీలన జరిపారు. భీముని పాదం ప్రాంతం అంతా ముళ్ల పొదలతో నిండిన నిర్జన ప్రదేశం. ఫొరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌ ఇన్‌స్పెక్టర్‌ నరసింహమూర్తి నలుగురు సభ్యుల బృందం, వీఆర్వోలు జి.నాగరాణి, ఎం.ఆంజనేయులు ఆధ్వర్యంలో రక్త నమూనాలు, తలవెంట్రుకలు సేకరించారు. ఘటనా స్థలంలో పురుషులకు సంబంధించిన నాలుగు రకాల తల వెంట్రుకలను సేకరించారు. అంటే ఈ వెంట్రుకలు నలుగురివిగా భావిస్తున్నారు.

పోలీసుల అదుపులో నిందితులు?
ఈ కేసులో ఇప్పటికే పోలీసులు కొంత పురోగతి సాధించినట్టు సమాచారం. ఆదివారం ఆ ప్రాం తాల్లో సంచరించిన వ్యక్తుల మొబైల్‌ నెంబర్ల ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలిసింది. మొబైల్‌ డంప్‌ టెక్నాలజీ ద్వారా ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎన్ని నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ ఉన్నాయి. ఎంత మంది సెల్‌ఫోన్లు ఉపయోగించారు అనేది ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మొబైల్‌ డంప్‌ టెక్నాలజీలో నిపుణుడైన తడికలపూడి ఎస్సై సతీష్‌కుమార్‌ ద్వారా నిందితుల అన్వేషణ కొనసాగిస్తున్నారు. భీమడోలు, ద్వారకాతిరుమల పరిసర ప్రాంతాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వీరిలో ఒంటిమీద గాయాలతో ఉన్న ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆ యువకుడు ఒక సెల్‌ఫోన్‌ మెకానిక్‌ అని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో కేసును పూర్తిగా ఛేదిస్తామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్‌ మురళీకృష్ణ పేర్కొన్నారు.

శ్రీధరణి హత్య కేసులో ఘటనా ప్రాంతాలు పరిశీలిస్తున్న పోలీసు అధికారులు క్లూస్‌ టీమ్‌ సేకరించిన తలవెంట్రుకలు

గతంలో కూడా.....?
గతంలో కూడా ఈ ప్రాంతంలో పలు ఘటనలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. పలు ప్రేమ జంటలపై దాడులు జరిగినా వెలుగులోని రాలేదు. తాము అల్లరవుతామనే భయంతో బాధితులు ఎవరికీ చెప్పుకోలేక పోవడంతో ఆ ఘటనలు వెలుగులోకి రాలేదు. బౌద్ధ గుహల విస్తీర్ణం ఎక్కువ కావడం,  దీనిని ఆనుకుని నిర్జన ప్రదేశం ఉండటంతో ఇటువంటి ఘటనలకు దుండగులు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. సెక్యూరిటీకి కూడా తలకు మించిన భారంగా మారుతోంది.

న్యాయం చేయండి: శ్రీధరణి తల్లిదండ్రులు
ఏలూరు (టూటౌన్‌): శ్రీధరణి మృతదేహానికి సోమవారం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆస్పత్రికి ఆమె  తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో  చేరుకున్నారు. బం«ధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంతం దద్దరిల్లింది.  బాధితులను వైఎస్సార్‌ సీపీ నాయకుడు రెడ్డి అప్పలనాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీధరణి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెలలో నిశ్చితార్థం కానున్న తమ కుమార్తెను భీమడోలు మండలం అర్జావారిగూడెంకు చెందిన దవులూరి నవీన్‌ హత్య చేశాడని ధరణి తల్లిదండ్రులు ఆరోపించారు. మరో వైపు మృతురాలి కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే నవీన్‌పై దాడి చేశారంటూ అతని కుటుంబ సభ్యులు పరస్పర ఆరోపణ చేశారు.  

పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు
ద్వారకాతిరుమల: శ్రీధరణి హత్య  కేసులో ప్రధాన నిందితుడ్ని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కృష్ణాజిల్లా  మైదుకూరు మండలం చంద్రాల గ్రామానికి చెం దిన పొట్లూరి రాజును  ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలిసింది.

ఏం జరిగుంటుంది..
జి.కొత్తపల్లికి చెందిన తుపాకుల లక్ష్మి కుమార్తెను కృష్ణాజిల్లా నూజివీడు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నెల నుంచి అతను జి.కొత్తపల్లిలోని అత్తవారి ఇంటి వద్దే ఉంటున్నాడు. పక్షులు, అడవి పందులు వంటివి వేటాడేందుకు అతడు రోజూ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళుతున్నాడు. అయితే శ్రీధరణి హత్య కేసుకు సంబంధించి అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. వేటకని వెళ్లిన అతడికి బౌద్ధారామాల వద్ద శ్రీధరణి,  భీమడోలు మండలం అర్జావారిగూడెంకు చెందిన దౌలూరి నవీన్‌ తారసపడి ఉండవచ్చని, ఆ సమయంలో అతడు శ్రీధరణిపై అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీన్ని ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన నవీన్‌పై అతడు దాడిచేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దాడి తరువాత శ్రీధరణి, నవీన్‌ మృతిచెంది ఉంటారని భావించి, ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడని భావిస్తున్నారు. దాడిచేసిన వ్యక్తి పక్కన మరెవరైనా ఉన్నారా? వారికీ ఈ అఘాయిత్యంలో పాత్ర ఉందా? అన్నదానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దాడి జరిగిన రోజున 108లో నవీన్‌ను పోలీసులు ప్రశ్నించగా, శ్రీధరణి తనతో రాలేదని చెప్పాడు. అందరూ తనపై దాడిచేశారని.. వారు మావాళ్లేనని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత మళ్లీ దాడిచేసిన వారెవరో తనకు తెలియదని చెప్పడం పోలీసులను తికమక పెట్టింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement