సాక్షి, ఏలూరు టౌన్(పశ్చిమ గోదావరి): ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైన లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు.. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడో గానీ.. కంటికి కనరాడు!’ అంటూ ఓ కవి సమాజంలో అమానుషాలను ఎలుగెత్తిచాటాడు. మానవత్వపు ఛాయలు మరుగునపడిపోతూ.. ఆధునిక పోకడలతో క్రూరత్వాన్ని నింపుకుంటున్న మృగాళ్లు సమాజంలో పెరిగిపోతున్నారు. చిన్నారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థినులపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. మహిళలను దేవతలుగా కొలిచే పవిత్ర భారతంతో మానవమృగాలు అపవిత్ర కార్యాలకు పాల్పడుతున్నాయి. తల్లిగా.. చెల్లిగా.. చెలియగా.. సగభాగంగా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచాల్సిన వేళ కర్కశత్వంతో నిండు జీవితాలను బలితీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
అభం శుభం తెలియని పసితనం.. ముద్దులొలికే మాటలతో మురిపిస్తూ మైమరపించిన చిన్నారుల నుంచి బాలికలు, యువతులు, మహిళలు ఇలా ఎవరికీ రక్షణ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళితే తిరిగి వస్తారా? అనే భయం వెంటాడుతోంది. ఆడపిల్లలుగా పుట్టటమే శాపమా అనే బాధ వారి మనసులను కలచివేస్తోంది. పసిపిల్లలపైనా లైంగిక దాడులు పెరిగిపోవటం సమాజంలో నైతిక విలువలు ఎలా మంటకలిసిపోతున్నాయో అద్దంపడుతున్నాయి. వావీవరసలు మరచి మృగాల్లా మారుతూ మానవ సంస్కృతికే మాయని మచ్చలా చెలరేగిపోతున్నారు. చిన్నారులపై అత్యంత పాశవికంగా అఘాయిత్యాలకు పాల్పడుతూ తల్లిదండ్రుల గుండెల్లో తీరని విషాదాన్ని నింపుతున్నారు.
పేగు బంధాన్ని మరిచి..
పేగు బంధాన్ని మరిచాడు.. సభ్య సమాజం సిగ్గుపడేలా కన్నకూతురినే కాటేశాడు.. తల్లికి చెబితే చంపేస్తానని బెదిరించాడు.. కొంతకాలం తన కామవాంచను తీర్చుకుంటూ తనలోని కర్కశత్వాన్ని చూపించాడు. 12 ఏళ్ల చిన్నారిపై ఓ మృగాడు అఘాయిత్యానికి పాల్పడుతున్న సంఘటన బుట్టాయగూడెంలో చోటుచేసుకుంది. బాలిక నుంచి భయంకరమైన చేదు నిజాన్ని తెలుసుకున్న తల్లి తల్లడిల్లిపోయింది.. ఇలాంటి నీచుడిని కటకటాల వెనక్కి నెట్టాలని నిర్ణయించుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మనుమరాలి వయసున్న బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి యత్నించాడు. నైతిక విలువలకు తిలోదకాలిస్తూ ఇలాంటి కీచకపర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. పుస్తకాల కోసం తన స్నేహితురాలి ఇంటికి సైకిల్‌పై వెళుతున్న బాలికను 60 ఏళ్ల వృద్ధుడు అటకాయించాడు. ఆ బాలికపై అఘాయిత్యం చేసేందుకు నిర్జన ప్రదేశంలో షెడ్డులోకి లాక్కెళ్లాడు. బాలిక గట్టిగా కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు వస్తున్నారనే భయంతో శివయ్య అనే వృద్ధుడు ఉడాయించాడు. పోలవరం మండలం కొత్త పట్టిసీమ గ్రామంలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి యత్నించిన అతడిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
2015 జూన్ 18న
ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం పంచాయతీ ఇందిరాకాలనీలో ఘోరం జరిగింది. ఏడేళ్ల చిన్నారి తన తల్లి గుడ్లు తీసుకురామ్మా అంటే కిరాణా కొట్టుకు వెళ్ళి రాక్షసుడి కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ముక్కుపచ్చలారని చిన్నారి పసిమొగ్గను చిదిమేసిన మృగాడు ఇంట్లోని ట్రంకు పెట్టెలో కుక్కేశాడు. తల్లి గుండెలు అవిసేలా రోధిస్తూ ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ దొరకలేదు. ఇంటి పక్కన ఉన్న కిరాణా కొట్టు సురేష్‌పై అనుమానం ఉన్నా బాలిక ఆచూకీ మాత్రం లభించలేదు. చివరికి సురేష్ తండ్రే వచ్చి మీ పాప మృతదేహం మా ఇంటిలోని ట్రంకు పెట్టెలో ఉంది.. బట్టల కోసం వెతుకుతుంటే కన్పించిందని చిన్నారి తల్లి్లదండ్రులకు చెప్పడంతో ఓ రాక్షసుడి అకృత్యం బయటపడింది.
2015 అక్టోబర్ 23న
అభం శుభం తెలియని చిన్నారిపైన, ఆమె తల్లిపైన అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ మృగాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఈ ఉన్మాది వీరిని, అడ్డువచ్చిన బాలిక తండ్రిని హతమార్చేందుకు విఫలయత్నం చేశాడు. ఇంటి వెనుక ఉన్న గడ్డివాముకు నిప్పుపెట్టి అందులో బాలికను పడవేసి సజీవదహనం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన ద్వారకాతిరుమల మండలం హనుమాన్‌గూడెం గ్రామంలో 2015 అక్టోబర్ 23న జరిగింది.
2017 మేలో నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామ శివారున చెరకుతోటలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. తెల్లవారితే ఇంట్లో ఆయువతికి పెళ్లి జరగాల్సి ఉండగా అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. యువతి బహిర్భూమికి వెళ్లగా ఐదుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా చెరకు తోటలోకి లాక్కుపోయారు. వారిలో ఒక యువకుడు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బంధువులు గ్రామశివారున ఉన్న పొలాల వెంట యువత కోసం వెతకగా ఓ చెరకు తోటలో యువతి అపస్మారక స్థితిలో పడి కనిపించింది.
2017లో నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామంలో 7వ తరగతి చదువుతున్న బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్కూల్ ఆవరణలో ఆధ్యాత్మిక సభలకు వచ్చిన బాలికను యువకుడు మాయమాటలు చెప్పి పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు గ్రామ పెద్దలతో పంచాయతీ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండిపోయారు.
2017 జూలై 30న బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెం గ్రామంలో 13 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన తాడిచర్ల పోతురాజు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
2018 ఏప్రిల్ 29న పోలవరం మండలం గాజులగొంది గ్రామంలో 5 ఏళ్ల మైనర్ గిరిజన బాలికపై అదే గ్రామానికి చెందిన నేరం శేఖర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
మానసిక, శారీరక అసమతుల్యత
మనిషిలో టెస్టోస్టిరాన్, మెదడులో హార్మోన్ల అసమతుల్యత కారణంగా విపరీతమైన లైంగిక కోరికలు ఉంటాయి. ఇటువంటి వ్యక్తులు వావీవరసలు, నైతిక విలువలు, పరిసరాలు ఇవేమీ పట్టించుకోకుండా లైంగిక దాడులకు తెగబడుతూ ఉంటారు. వీటిని మానసిక రుగ్మతగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇక వ్యక్తి చిన్ననాటి నుంచీ పెరిగిన పరిస్థితులు, వాటి ప్రభావం కూడా మానసిక స్థితిపై ఆధార పడుతుంది. ఎదుటివారి ఇష్టాలతో ప్రమేయం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. బాలికలను ఒంటరిగా వదిలివెళ్లకూడదు, ఎప్పుడూ చిన్నారులను పర్యవేక్షిస్తూ ఉండాలి. ఎప్పుడైనా బాలలు డిప్రెషన్, అనాలోచితంగా, మౌనంగా ఉంటే వెంటనే వారితో ప్రేమగా మాట్లాడుతూ వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సున్నితమైన మనస్తత్వంతో పిల్లలను పెంచటం సరికాదు, సమాజం పట్ల అవగాహన కల్పించేలా తల్లిదండ్రి బాధ్యత వహించాలి.
–అక్కిశెట్టి రాంబాబు, సైకాలజిస్ట్, తణుకు
లైంగిక విద్యపై అవగాహన కల్పించాలి
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చెడు ప్రభావాలకు లోనవుతూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటారు. వెబ్‌సైట్లు, సోషల్‌మీడియా ప్రభావం ప్రస్తుతం అధికంగా ఉంది. విద్యార్థి దశ నుంచే లైంగిక విద్యపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. బాలికలు, యువతులు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. యువతులకు రక్షణ కల్పించేందుకు శక్తి టీమ్‌లను ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ ఏర్పాటుచేశారు. ఎక్కడైనా ఆకతాయిలు ఈవ్‌టీజింగ్, ఇతరత్రా ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే శక్తి టీమ్‌లకు సమాచారం ఇవ్వచ్చు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు అవగాహన సదస్సులు సైతం నిర్వహించేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుంది. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలి. వారు ఏదైనా దారితప్పితే ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది.
–పైడేశ్వరరావు, మహిళా స్టేషన్ డీఎస్పీ, ఏలూరు
జీవనశైలిలో విపరీత మార్పులు
సమాజంలో మారుతున్న ఆధునిక పరిస్థితుల ప్రభావం ప్రజలపై తీవ్రంగా పడుతుంది. జీవన శైలిలోనూ మార్పులు వస్తున్నాయి. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడటం మానసిక రుగ్మతగానే చూడాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలు, ఆధునిక పోకడలు, యువతను పెడదారి పట్టిస్తున్నాయి. వారిలో మానసిక పరివర్తన తీసుకురావడంతోనే మార్పు వస్తుంది. అవసరమైతే అటువంటి వారికి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది. కొందరిలో శారీరకంగా వచ్చే మార్పులు కాగా, కొందరిలో సామాజికంగా వారు పెరిగిన వాతావరణం కూడా కారణం కావచ్చు. కొందరు పెద్ద వయసున్న వ్యక్తులు కూడా ఇటువంటి మానసిక వ్యాధితో బాధపడుతూ ఉంటారు.
–డాక్టర్ హరికృష్ణ, మానసిక వైద్యనిపుణులు
Comments
Please login to add a commentAdd a comment