
నల్లజర్ల మండలం పోతవరంలోని ఒక వ్యవసాయ భూమిలో దుర్గ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
పశ్చిమగోదావరి, నల్లజర్ల(ద్వారకాతిరుమల): బంగారు నగల కోసం ఆటో డ్రైవర్ ఒక మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని అక్కడ ఒక వ్యవసాయ భూమిలోని కంచెలో పడవేశాడు. అయితే దుర్వాసన రావడంతో అనుమానం కలిగిన స్థానిక రైతులు విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటన నల్లజర్ల మండలం పోతవరంలోని ఒక వ్యవసాయ పొలంలో బుధవారం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం. మండలంలోని పుల్లలపాడుకు చెందిన నాయుడు దుర్గ(45) అదే గ్రామ శివారులో మద్యం బెల్టు షాపు నిర్వహిస్తోంది. రోజూ ఆమె నల్లజర్లకు చెందిన ఆటో డ్రైవర్ అల్లే వెంకన్నబాబు ఆటోలో దుకాణానికి వెళ్తుండేది. ఇదిలా ఉంటే నాలుగు రోజుల క్రితం ఆమె జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న వారి బంధువుల ఇంట్లోని ఒక శుభకార్యానికని వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లోను, అలాగే బంధువుల ఇళ్ల వద్ద వెదికారు. ఎంతకీ ఆమె ఆచూకీ తెలియకపోవడంతో మృతురాలి భర్త ప్రసాద్ నల్లజర్ల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే పోతవరంలోని ఒక వ్యవసాయ భూమిలో దుర్వాసన వస్తుందన్న సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రూరల్ సీఐ పి.శ్రీను, నల్లజర్ల ఎస్సై వి.చంద్రశేఖర్ హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని వ్యవసాయ భూమి కంచెలో మృతదేహాన్ని గుర్తించారు.
అసలేం జరిగిందంటే..
శుభకార్యం నిమిత్తం నాలుగు రోజుల క్రితం జంగారెడ్డిగూడెంకు వెళ్లిన దుర్గ అదే రోజు సాయంత్రం ఇంటికి తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో కొయ్యలగూడెంకు చేరుకున్న ఆమె బస్సు కోసం ఎదురు చూస్తోంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వెంకన్నబాబును ఆమె గుర్తించి, తెలిసిన వాడే కథ అన్న ధైర్యంతో ఆటో ఎక్కింది. అయితే పోతవరం శివారులోకి వచ్చేసరికి వెంకన్నబాబు ఆటోను పక్కకు ఆపి, దుర్గపై దాడిచేశాడు. ఆమె వద్ద ఉన్న సుమారు కాసున్నర బంగారు వస్తువులు, అలాగే రూ. 10 వేల నగదును లాక్కుని, తన వద్ద ఉన్న టవల్‌ను ఆమె మెడకు వేసి, ఉరిలాగి కిరాతకంగా హత్యచేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని సమీపంలోని ఒక వ్యవసాయ భూమిలోకి తీసుకెళ్లి పడవేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అతి తక్కువ సమయంలోనే నిందితుడిని గుర్తించారు. ఆటో డ్రైవర్ వెంకన్నబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీను తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment