ఛండీగఢ్: చిన్న వివాదం పంజాబ్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి ప్రాణం పోయేందుకు కారణమైంది. ఓ ఆటోడ్రైవర్‌తో గొడవ కారణంగానే ఆయన ప్రాణం పోయింది. అయితే.. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి 48 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు జలంధర్ పోలీసులు.
అర్జున అవార్డు గ్రహీత, పంజాబ్ పోలీస్ ఉన్నతాధికారి(డీఎస్పీ స్థాయి) దల్బీర్ సింగ్ డియోల్ (54)హత్యకు గురికావడం పంజాబ్‌లో అలజడి రేపింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఓ ఆటో డ్రైవర్ అని, అతనితో దల్బీర్ వాగ్వాదానికి దిగడమే హత్యకు కారణమైందని చివరకు పోలీసులు నిర్ధారించారు.
ఏం జరిగిందంటే..
దల్బీర్ సింగ్ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా స్నేహితులతో కలిసి సాయంత్రం వేళ బయటకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో తనను ఇంటి దగ్గర దింపాలని సదరు ఆటో డ్రైవర్‌ను కోరారు. అందుకు డ్రైవర్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. అది కాస్త ఘర్షణగా మారే క్రమంలో.. దల్బీర్ దగ్గర ఉన్న సర్వీస్ తుపాకీని లాక్కుని ఆ డ్రైవర్ కాల్పులు జరిపాడు. దాంతో దల్బీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఆపై జలంధర్ నగర శివారులో ఓ కాలువ సమీపంలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు. మరుసటిరోజు జుగల్ కిషోర్ అనే పోలీసాధికారి ఆ మృతదేహాన్ని మొదటగా గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో దర్యాప్తు మొదలైంది.
ఛేదించారిలా..
ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. ఓ ఆటోను గుర్తించారు. దాని నెంబర్ ప్లేట్ ఆధారంగా.. అక్కడి నుంచి ఉన్న మూడు దారుల్లో ట్రేస్ చేసే యత్నం చేశారు. అదే సమయంలో ఆ కాలువకు దగ్గర్లోని టవర్‌కు వచ్చిన మొబైల్ సిగ్నల్స్ ఆధారంగానూ సమాంతరంగా దర్యాప్తు కొనసాగించారు. చివరకు నిందితుడిని ఆటో డ్రైవర్ విజయ్ కుమార్‌గా గుర్తించి అరెస్టు చేశారు. అతడిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
గతంలో ఆసియా క్రీడల్లో దల్బీర్ వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు పతకాన్ని సాధించారు. అందుకే 2000లో ఆయనను కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. అనంతరం ఆయన పోలీసుశాఖలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment