![Married Woman suspicious death in West Godavari - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/24/woman-murder.jpg.webp?itok=uQvScuY9)
దొండపాడు దత్తాశ్రమం వద్ద బోదెలో మృతదేహాన్ని పరిశీలిస్తున్న త్రీటౌన్ సీఐ మూర్తి (అంతరచిత్రం) మృతురాలు నాగమణి (ఫైల్)
ఏలూరు టౌన్: అదృశ్యమైన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో ఓ చిన్న బోదెలో శవమై తేలింది. ఈ ఘటన ఏలూరులో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు త్రీటౌన్ పరిధిలోని శనివారపుపేట ప్రాంతానికి చెందిన గుళ్ళమిల్లి శివాజీకి, నాగమణికి కొంతకాలం క్రితం వివాహమైంది. నాగమణి (34) ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త శివాజీ మానసిక వికలాంగుడు. దీంతో అతను ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వరుసకు మేనల్లుడైన సంతోష్ అనే వ్యక్తితో నాగమణి సన్నిహితంగా ఉంటోంది. అది కాస్తా వివాహేతర సంబంధంగా బలపడింది. ఈ నేపథ్యంలోనే సంతోష్ కొద్దిరోజులుగా నాగమణిపై అనుమానం పెంచుకున్నాడు.
ఆమె పనుల కోసం ఎక్కడికి వెళ్లినా వెంబడిస్తూ ఉన్నాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి నాగమణి అతనికి దూరంగా ఉంటోంది. నాగమణికి కంటి సమస్య రావటంతో ఈనెల 20న ఏలూరు ఆర్‌ఆర్‌పేటలో శంకర్ నేత్రాలయ ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు ఆమె సోదరుడు తీసుకువెళ్లాడు. ఈ సమయంలోనూ సంతోష్ వారిని వెంబడించినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం ఆమె ఇంటికి వెళ్ళి పోయింది. ఈనెల 21న యథావిధిగా ఆటోలో సత్రంపాడులోని ఒక ఇంటికి పని చేసేందుకు వెళ్ళింది. అప్పుడు కూడా సంతోష్ ఆమెను వెంబడించాడు. అప్పటి నుంచి నాగమణి అదృశ్యమైంది. బంధువులు ఆమె కోసం పలు ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. సోమవారం ఏలూరు దొండపాడు దత్తాశ్రమం సమీపంలోని ఒక బోదెలో నాగమణి శవమై కనిపించింది. స్థానికుల సమాచారంతో త్రీటౌన్ సీఐ మూర్తి ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. హత్యగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సంతోష్ పరారీలో ఉన్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment