దౌలూరి నవీన్, మృతి చెందిన తెర్రి శ్రీధరణి
పశ్చిమగోదావరి, కామవరపుకోట: రాజధాని ప్రాంతంలో జరిగిన జ్యోతి హత్యకేసు మరువక ముందే జిల్లాలోని గుంటుపల్లి వద్ద మరో ఘటన చోటుచేసుకుంది. వేరే ప్రాంతం నుంచి వచ్చిన యువతీ యువకుల్లో యువతి తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందగా, యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలోని గుంటుపల్లి బౌద్ధారామాలు చూసేందుకు ఆదివారం కావడంతో సందర్శకులు భారీగా వచ్చారు. ఈ ప్రాంతంలో ఎక్కువ నిర్జన ప్రాంతాలు ఉండటంతో సెక్యూరిటీ తనిఖీలు నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో బౌద్ధారామాల దిగువ ప్రాంతంలోని భీముడి పాదాల సమీపంలో రక్తపు మడుగులో ఉన్న యువతీ యువకులను సెక్యూరిటీ గార్డ్ సతీష్ చూశాడు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న చింతలపూడి సీఐ విల్సన్ యువతీ యువకులను పరిశీలించగా, యువతి మృతి చెందినట్లు గుర్తించగా, యువకుడు తీవ్రగాయాతో ఉన్నాడు. మొహం, తలపై బలమైన గాయాలతోపాటు శరీరమంతా తీవ్రగాయాలతో ఉన్న యువకుడిని సీఐ ప్రశ్నించగా పేరు నవీన్ చెప్పాడు. దీంతో అతడిని స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని యువతి మృతదేహాన్ని పరిశీలించారు.
యువతి తల వెనుకభాగంలో బలమైన గాయం ఉన్నట్టు గుర్తించారు. అలాగే మృతదేహం పక్కనే రక్తం అంటిన దుడ్డుకర్ర ఉండటంతో దానితో ఆ యువతిని హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దౌలూరి నవీన్‌ది భీమడోలు మండలం అర్జావారిగూడెం కాగా తెర్రి శ్రీధరణి(18)ది ఉంగుటూరు మండలం ఎంఎం పురం. వీరిద్దరూ ఉదయం 11.30 గంటల సమయంలో మోటార్ సైకిల్‌పై బౌద్ధారామానికి వచ్చారు. ఆదివారం కావడంతో 85 మంది పర్యాటకులు వచ్చినట్టు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు.
యువతి మృతిపై అనుమానాలు
ఇంటి వద్ద నుంచి బయలుదేరిని వీరిని బంధువులు ఎవరైనా అనుసరిస్తూ వచ్చి ఈ ప్రాంతంలో హతమార్చడానికి ప్రయత్నించారా? వీరి మధ్య గొడవ జరిగి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారా? ప్రేమ జంటను వేరే ఎవరైనా బెదిరించి వారిపై దాడికి పాల్పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతిపై అత్యాచారం జరిగినట్టు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఒంటిపై దుస్తులు చిందరవందరగా ఉన్నాయి. ఘటనా ప్రాంతానికి సమీపంలో నవీన్, శ్రీ అనే పేర్లను ఒక బండరాయిపై సుద్దతో రాశారు. మృతురాలి వద్దగాని, గాయాలైన యువకుడి వద్ద గానీ సెల్‌ఫోన్ లేకపోవడమూ అనుమానాలకు తావిస్తోంది. ఘటనా స్థలాన్ని అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు, డీఎస్పీ మురళీకృష్ణ, చింతలపూడి సీఐ విల్సన్, తడికలపూడి, చింతలపూడి, టి.నరసాపురం ఎస్సైలు కె.సతీష్‌కుమార్, రామకృష్ణ, రాంబాబు పరిశీలించారు.
రాజధాని ఘటనకు దగ్గరగా..
రాజధాని ప్రాంతంలో సంచలనం సృష్టించిన జ్యోతి హత్య కేసుకు , గుంటుపల్లిలో ఆదివారం జరిగిన ఘటనకు కొద్దిగా పోలికలు ఉండటంతో పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. రాజధాని ఘటనలో నిర్జన ప్రదేశంలో జ్యోతి హత్య గావించబడటం, శ్రీనివాసరావు తీవ్ర గాయాల పాలవడం తెలిసిందే. శ్రీనివాస్‌ని ప్రశ్నించినప్పుడు పొంతనలేని సమాధానం ఇవ్వడం, ఆ తరువాత లోతుగా విచారిస్తే అతనే జ్యోతిని హత్య చేశాడని బలయపడటం తెలిసిందే. ఇదే రీతిలో గుంటుపల్లిలో శ్రీధరణి మృతి చెందడం, నవీన్‌కు తీవ్ర గాయాలవటం, అలాగే పోలీసులు ప్రశ్నించినప్పుడు పేరు తప్పితే ఇతర విషయాలు చెప్పకపోవడం, ఘటనా ప్రాంతం అనుమానించదగ్గదిగా ఉండటంతో పోలీసులు అత్యాచార యత్నం, హత్య కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
మృతి చెందిన తెర్రి శ్రీధరణి
హతాశులైన శ్రీధరణి తల్లిదండ్రులు
భీమడోలు: శ్రీధరణిది ఉంగుటూరు మండలం పూళ్ల పంచాయతీ శివారు ఎంఎం పురం. పోలసానిపల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రథమ సంవత్సరం బీఎస్సీ (ఎంపీసీ గ్రూప్) చదువుతోంది. భీమడోలు మండలం ఆర్జావారిగూడెంకు చెందిన దౌలూరి నవీన్ బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతూ ఈ ఏడాది మానేశాడు. తండ్రి పెయింటర్ కావటంతో అతని వృత్తిలో సహాయపడుతున్నాడు. వీరిద్దరు ఈ కళాశాలలోనే ఇంటర్ నుంచి చదువుకున్నారు. వీరి పరిచయం ప్రేమగా మారింది.
ధరణి మరణంతో ఆమె తల్లిదండ్రులు తెర్రి అప్పారావు, అలివేలుమంగ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. “ఆదివారం కదమ్మా ఎక్కడికీ వెళ్లవద్దు.. ఇంటి వద్దనే ఉండు’.. అని తల్లిదండ్రులు మొత్తుకున్నారు.. వీరిద్దరూ వ్యవసాయ కూలీలు. తల్లిదండ్రులు బయటకు వెళ్లగా ఆమె ఇంటి నుంచి వెళ్లింది. కళాశాలకని వెళ్లి మాకు కడుపుకోత మిగిల్చింది అంటూ వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా ఇద్దరికి వివాహాలు చేసేశారు. ప్రతి ఆదివారం కళాశాలకు వెళ్లే తమ కుమార్తె సాయంత్రానికి ఇంటికి వస్తుందని భావించిన వారిని ఆమె మరణం వార్త దుఃఖ సాగరంలో ముంచేసింది. చదువులో బాగా రాణిస్తున్న శ్రీధరణిపై ఎన్నో ఆశలు పెట్టుకుని వారు జీవిస్తున్నారు.
బస్‌పాస్‌తో ధరణిని గుర్తించిన పోలీసులు
శ్రీధరణి ఎంఎం పురం గ్రామం నుంచి పూళ్ల వచ్చింది. అక్కడ బస్ ఎక్కింది. భీమడోలులో దిగి అక్కడ నవీన్ బైక్‌పై వారిద్దరు వెళ్లి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వద్ద గల బస్‌పాస్‌ల ఆధారంగా ఆమెను గుర్తు పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment