రక్తపు మడుగులో పడి ఉన్న రాంబాబు మృతదేహం, హంతకుడు కోటేశ్వరరావును గుంజకు కట్టేసిన స్థానికులు
పశ్చిమగోదావరి, పెదవేగి రూరల్: కన్న కొడుకే తండ్రి పాలిట కాలయముడైన ఘటన పెదవేగి మండలం రామశింగవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామశింగవరం దుర్గమ్మకాలనీకి చెందిన దొండపాటి రాంబాబు (45) 13 ఏళ్ల క్రితం మొదటి భార్య సరోజినిని విడిచి లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. సరోజినికి కుమారుడు కోటేశ్వరరావు ఉన్నాడు. ప్రస్తుతం సరోజిని దూరప్రాంతంలో ఉండగా కోటేశ్వరరావు తాత అంకాలు (రాంబాబు తండ్రి), మేనత్త దుక్కిపాటి సరోజినితో కలిసి గ్రామంలోని దళితవాడలో ఉంటున్నాడు.
ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం అక్క సరోజిని ఇంటికి వచ్చిన రాంబాబు తండ్రి అంకాలుతో గొడవపడి కొట్టాడు. అదేసమయంలో బయట నుంచి ఇంటికి వస్తున్న కోటేశ్వరరావు మద్యం మత్తులో భావోద్వేగానికి గురై చిన్నపాటి పలుగుతో తండ్రి రాంబాబుపై దాడి చేశాడు. తలపై తీవ్రగాయమైన రాంబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు కోటేశ్వరరావును ఇంటిలోని ఓ గుంజకు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. ఏలూరు రూరల్ సీఐ కె.వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ఇదిలా ఉండగా తన భర్త రాంబాబు నెల రోజుల క్రితం కామవరపుకోట మండలం దొండపాటవారిగూడెంలో ఉన్న 20 సెంట్ల భూమి అమ్మగా రూ.2.30 లక్షల నగదు వచ్చిందన్నారు. దీనిలో తన పెద్ద కుమార్తె పుష్పవతి కార్యక్రమానికి కొంత ఖర్చుచేశామని, మిగిలిన సొమ్ము ఇవ్వలేదని కోటేశ్వరరావు కక్ష పెంచుకుని హత్య చేశాడని ఆరోపించారు. పెదవేగి ఎస్సై వి.క్రాంతిప్రియ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment