ఘటనాస్థలంలో డ్వాగ్ స్కాడ్ తనిఖీ,ఇన్‌సెట్లో సుజిత్‌కుమార్ మృతదేహం,
సాక్షి, పెంటపాడు(పశ్చిమగోదావరి) : ప్రత్తిపాడు వద్ద రైల్వే ఫోన్ కేబుల్ లైన్ మరమ్మతుల కోసం వచ్చి తిరిగి వెళుతుండగా ఓ రైల్వే సర్వీసు ఇంజినీర్‌ని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ప్రత్తిపాడులోని రైల్వే ట్రాక్, ఏలూరు కాలువ మధ్య దారిలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కాళ్లు చేతులు కట్టివేసి, ముఖంపై బ్యాగ్‌ను ముసుగుగా వేసి బిగించి ఊపిరాడకుండా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు బిహార్‌కు చెందిన సుజిత్ కుమార్ (42)గా పోలీసులు గుర్తించారు. పదేళ్లుగా తాడేపల్లిగూడెం కేంద్రంగా పనిచేస్తున్నాడు.
మరమ్మతుల కోసం వచ్చి..
ప్రత్తిపాడు రైల్వే సిగ్నల్ వద్ద ఫోన్ కేబుల్ మరమ్మతు చేసేందుకు ఆదివారం రాత్రి సుజిత్‌కుమార్ వచ్చాడు. మరమ్మతులు పూర్తి చేసి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఆకుల గోపయ్య ఇంజినీరింగ్ కళాశాల వెనుక, ఏలూరు కాలువ మధ్య దారిలో వస్తుండగా కొందరు దుండగులు అతనిని అటకాయించి అర్ధరాత్రి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని గడ్డిలో వేసి పరారయ్యారు. సోమవారం ఉదయం స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ద్విచక్రవాహనం స్పార్క్ ప్లగ్ తీసి ఉండటం, మృతుని ఫ్యాంట్ విప్పి దానిని మోకాళ్లకు, పాదాలకు మధ్య కట్టి ఉండటం, తాళ్లతో చేతులను కట్టి ఉండటం గమనించారు.
బ్యాగ్‌లో తలను పెట్టి ఊపిరాడకుండా చేసి పాశవికంగా హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు. ఏలూరు నుంచి డాగ్ స్వాడ్, వేలిముద్రల కోసం క్లూస్‌టీంను రప్పించారు. డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, గూడెం, రూరల్, టౌన్ సీఐలు రవికుమార్, రఘు, పెంటపాడు ఎస్సై కె.శ్రీనివాసరావు, రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు డాగ్ సంఘటనా స్థలం నుంచి ప్రత్తిపాడులోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వరకు వెళ్లి తచ్చాడింది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, రూరల్ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో పెంటపాడు ఎస్సై కె.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లిగూడెం పోస్టాఫీస్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మృతుడు సుజిత్‌కు భార్య పూనం కుమారి, కుమార్తె అనుష్కారాణి, కుమారుడు ఆయుష్మాన్‌రాజ్ ఉన్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment