సాక్షి, భీమడోలు: అనుమానం పెనుభూతమైంది. చంపితే గానీ కథ కొలిక్కిరాదని పక్కా ప్లాన్ వేశారు. ఎలా చంపాలని, ఎలా చంపితే తమ పేర్లు బయటకు రావని ప్రయోగం కూడా చేశారు. అంతా బాగానే ఉంది. సరిగ్గా టైమ్ వచ్చే సరికి కథ అడ్డం తిరిగింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లిలో చోటుచేసుకుంది. భర్తకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కట్టుకున్న భార్యే అతడిని హతమార్చేందుకు పథకం రచించింది. అందుకోసం కన్న కొడుకుతో పాటు మరో ఇద్దరి సాయం తీసుకుంది. అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగినా...చివరి నిమిషంలో బాధితుడికి అనుమానం రావడంతో సీన్ రివర్స్ అయింది. బాధితుడి ఫిర్యాదుతో భీమడోలు పోలీసులు అయిదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.... పోలసానిపల్లి గ్రామానికి చెందిన గోవింద్ గురునాథ్ పాల వ్యాపారం చేస్తుంటాడు. అతని భార్య రాణి కిళ్లీ కొట్టు నిర్వహిస్తోంది. భర్త గురునాథ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో భార్య రాణి, కుమారుడు..గురునాథ్‌తో గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భార్య, కుమారుడు కలిసి గురునాథ్‌ను చంపాయాలని భావించారు. అదే గ్రామానికి చెందిన ఎ.ధనలక్ష్మి, శ్రీనివాసరావుల సహకారం కోరారు. దీంతో సైనేడ్‌తో చంపేయాలని నిర్ణయించి ద్వారకాతిరుమల మండలం జాజులకుంటకు చెందిన గంటా మోజెస్ సహకారంతో సైనేడ్ తెచ్చారు.
సైనైడ్‌ను పరీక్షించేందుకు మొదట ఇంట్లోని కోడిపుంజుపై ప్రయోగించారు. సైనైడ్ తిన్న కోడిపుంజు రంగుమారి చనిపోయింది. దీంతో తమ పథకం ఫలిస్తుందని ఆశించారు. కోడిపుంజు వైరస్ తెగులు సోకి చనిపోయిందని గురునాథ్‌ను నమ్మించారు. పక్కాప్లాన్ వేసి ఆదివారం మటన్ కూరలో సైనేడ్ కలిపి పెట్టారు. మొదటి ముద్ద తిన్న గురునాథ్‌కు ఆహారం రుచిలో తేడా ఉన్నట్టు అనుమానం వచ్చింది. అక్కడితో ఆహారాన్ని వదిలేశాడు. తనపై జరుగుతున్న కుట్ర ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు.
అయితే పథకం వేసిన వాళ్లంతా ఇంటి ఆవరణలో మాట్లాడుకుంటుండగా గురునాథ్ గమనించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను చంపేందుకు కుట్రపన్నిన ఐదుగురిని కఠినంగా శిక్షించాలని గురునాధ్ కోరుతున్నాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.... గోవింద్ గురునాథ్ ఇంటిలోని మటన్ కర్రీ, సైనైడ్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఐదుగురిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment