స్కూల్ ఆఫీస్‌లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేసిన బంధువులు, అన్నాబత్తుల నాగవెంకట సాయిప్రసాద్ మృతదేహం (ఇన్‌సెట్‌లో)
పశ్చిమగోదావరి, తణుకు: పట్టణంలోని ఒక ప్రైవేటు స్కూలులో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూలు డైరెక్టర్ తీవ్రంగా కొట్టడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఎదుటే కొట్టిన స్కూలు డైరెక్టర్ టీసీ ఇచ్చేస్తానని బెదిరించడంతో పైఅంతస్తులోని హాస్టల్ గదికి వెళ్లి ఉరి వేసుకుని తనువు చాలించాడు. దీంతో ఆగ్రహంతోఊగిపోయిన మృతుడి బంధువులు స్కూలులో విధ్వంసం సృష్టించారు. ఫర్నిచర్, స్కూలు బస్సులను ధ్వంసం చేసిన ఆందోళనకారులు ఒక బస్సుకు నిప్పు పెట్టారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, తణుకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.ఎ.స్వామి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తండ్రి ఎదుటే కొట్టడంతో...
తణుకు పట్టణంలోని బ్యాంకు కాలనీలో మాంటిస్సోరి స్కూలులో ఇరగవరం మండలం గోటేరు గ్రామానికి చెందిన అన్నాబత్తుల నాగవెంకటసాయిప్రసాద్ (17) పదో తరగతి చదువుతున్నాడు. ఇతని తండ్రి పేరు శ్రీనివాసరావు. తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. అప్పటి నుంచి పెదనాన్న వెంకటేశ్వరరావు పెంచుకుంటున్నాడు. ఆయనే సాయిప్రసాద్‌ను దత్తత తీసుకుని చదివించుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం స్కూలు నుంచి యాజమాన్యం ఫోన్ చేసి తండ్రి వెంకటేశ్వరరావును స్కూలుకు రప్పించారు. సాయిప్రసాద్ సరిగ్గా చదవడంలేదని, చెప్పిన మాట వినడంలేదని, చిరుతిళ్లు తెచ్చుకుని తరగతి గదిలో తింటున్నాడని పేర్కొంటూ స్కూలు డైరెక్టర్ ఉమామహేశ్వరరావు విద్యార్థి తండ్రి వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఎదురుగానే సాయిప్రసాద్‌ను చితకబాదిన డైరెక్టర్ టీసీ ఇచ్చేస్తానని బెదిరించారు. దీంతో సాయంత్రం 6 గంటలకు వచ్చి తీసికెళ్లిపోతానని తండ్రి సమా«ధానం చెప్పి వెళ్లిపోయాడు. తండ్రి వెళ్లిపోయిన కొద్దిసేపటికి తరగతి గదికి వెళ్లకుండా నేరుగా పైఅంతస్తులోని హాస్టల్ గదికి వెళ్లిన సాయిప్రసాద్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్కూలు యాజమాన్యం కారులో స్థానికంగా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చి మృతదేహాన్ని ఉంచి వెళ్లిపోయారు. అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సాయిప్రసాద్‌కు ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చేర్పించినట్లు తండ్రి వెంకటేశ్వరరావుకు స్కూలు నుంచి ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఆసుపత్రికి వచ్చిన తండ్రికి విగతజీవిగా మారిన కుమారుణ్ని చూసి కుప్పకూలిపోయారు. అయితే డైరెక్టర్ కొట్టిన దెబ్బలకే చనిపోయాడని పక్కదోవ పట్టించడానికే ఉరి వేసుకున్నాడని యాజమాన్యం చెబుతోందని బంధువులు ఆరోపిస్తున్నారు.
స్కూలులో విధ్వంసం...
స్కూలు యాజమాన్యం వేధింపులతో విద్యార్థి సాయిప్రసాద్ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్కూలు ఆవరణలోని హాస్టల్ వద్ద ఉంచి ఆందోళనకు దిగారు. యాజమాన్యం స్పందించకపోడంతో మృతుడి బంధువులు, గ్రామస్తులు సుమారు గంటపాటు విధ్వంసం సృష్టించారు. స్కూలు కార్యాలయం ధ్వంసం చేసి ఆవరణలో నిలిపి ఉంచిన స్కూలు బస్సులపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. ఒక బస్సుకు నిప్పు పెట్టడంతో అప్రమత్తమైన కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు మంటలను అదుపు చేశారు. అయితే హాస్టల్ భవనంలోని కింది అంతస్తు మొత్తం ధ్వంసం చేసిన ఆందోళనకారులు పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పై రెండు అంతస్తుల్లో విద్యార్థులు ఉండటంతో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తు నిర్వహించారు. హాస్టల్ గదిలోని విద్యార్థులు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో హాస్టల్ వద్దకు చేరుకున్నారు.
కారుమూరి పరామర్శ
విద్యార్థి సాయిప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నసంఘటనతో బ్యాంకు కాలనీలోని మాంటిస్సోరి స్కూలు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కారుమూరి వెంకటనాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. పార్టీ నాయకులు చీర్ల రాధయ్య, జనసేన నాయకులు విడివాడ రామచంద్రరావు, మున్సిపల్ ఛైర్మన్ పరిమి వెంకటేశ్వరావు, వైస్ ఛైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం తదితరులు వచ్చి యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఈ సంఘటనతో స్కూలు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, తణుకు సీఐ కె.ఎ.స్వామి ఆధ్వర్యంలో భారీబందోబస్తు నిర్వహించారు. సోమవారం రాత్రి వరకు మృతదేహాన్ని హాస్టల్ ఆవరణలోనే ఉంచి ఆందోళన కొనసాగిస్తున్నారు.దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులుమోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment