వివరాలు తెలుపుతున్న సీసీఎస్ డీఎస్పీ టి.సత్యనారాయణ, చిత్రంలో వన్‌టౌన్ ఇన్‌ఛార్జ్ సీఐ జి.మధుబాబు
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : ఒరిజినల్ రూ.2 వేల నోట్లను స్కాన్ చేసి .. అదేరీతిలో ఫేక్ రూ.2 వేల నోట్లను జిరాక్స్ తీసి మార్కెట్లోకి చలామణి చేస్తోన్న ఒక వ్యక్తిని ఏలూరు పోలీసులు చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం ఏలూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు, సీసీఎల్ డీఎస్పీ టీ.సత్యనారాయణ వివరాలను వెల్లడించగా వన్‌టౌన్ ఇన్‌ఛార్జ్ సీఐ జి.మధుబాబు సమావేశంలో ఉన్నారు. ఏలూరు వన్‌టౌన్ చిరంజీవి బస్టాండ్ దక్షిణపువీధి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతోన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీసీఎస్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ మధుబాబు, వన్‌టౌన్ ఎస్‌ఐ కిషోర్‌బాబు, సిబ్బంది అతనిని అరెస్టు చేశారు. అతని వద్ద రూ.2 వేల ఫేక్ నోట్లు 50 స్వాధీనం చేసుకున్నారు. రూ.లక్ష విలువ చేసే ఫేక్ నోట్లు పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.
జిరాక్స్ తీసి చలామణి
మెదక్ జిల్లాకు చెందిన ఉప్పరి రాజు ప్రసాద్ అలియాస్ రాజు హైదరాబాద్ పటాన్‌చెరువు ప్రాంతంలోని శ్రీరామ్‌నగర్, దుర్గగుడి వద్ద నివాసం ఉంటున్నాడు. రాజు గత కొంతకాలంగా రూ.2 వేల నోట్లను జిరాక్స్ మెషిన్‌పై కలర్ జిరాక్స్ తీసి ఫేక్ రూ.2 వేల నోటును తీస్తున్నాడు. చిన్నచిన్న తేడాలు మినహా ఒరిజినల్ నోటు మాదిరిగానే కలర్ జిరాక్స్ తీస్తూ మార్కెట్లో చలామణి చేస్తున్నాడు. గతంలో హైదరాబాద్‌లోనూ కృష్ణా జిల్లా కైకలూరులోనూ రూ.2 వేల ఫేక్ నోట్లను మార్కెట్లోకి చలామణి చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ రాజుపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో అధికంగా ఆక్వా, చేపల రైతులు అధిక మొత్తంలో డబ్బులు చేతులు మారుతూ ఉండడం, ఫేక్ కరెన్సీ సులువుగా మార్చుకునే అవకాశం ఉండడంతో రాజు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కైకలూరులో చేపల రైతుల వద్ద ఫేక్ నోట్లు మార్పు చేసే క్రమంలో దొరికిపోవటంతో ఏలూరు కేంద్రంగా మరోసారి ఫేక్ నోట్లు చలామణి చేసేందుకు ప్రయత్నం చేశాడు. రూ.50 వేలు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే రూ.2 లక్షల వరకూ ఫేక్ కరెన్సీ ఇచ్చేలా కొందరు వ్యక్తులతో మంతనాలు సైతం చేసినట్టు తెలుస్తోంది. కైకలూరు నుంచి ఏలూరుకు మకాం మార్చటంతో పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ సమాచారంతో పోలీసులు రాజును అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.2 వేల ఫేక్ నోట్లు, జిరాక్స్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై 266/18 489 (సీ) (డీ) ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. రాజు ఇప్పటి వరకూ సుమారు రూ.3 లక్షల వరకూ ఫేక్‌నోట్లు మార్పిడి చేసి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు.
నకిలీ నోట్లతో మోసపోవద్దు
ఈ ఫేక్ నోట్లు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. రూ.500, రూ.2,000 నోట్లు విషయంలో జాగ్రత్తలు పాటించకుంటే నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. అధికంగా డబ్బు చలామణి అయ్యే బార్లు, మద్యం దుకాణాలు, హోటల్స్, మాల్స్, చేపల వ్యాపారాల వద్ద ఫేక్ నోట్లు చలామణి చేసేందుకు ఇలాంటి ముఠాలు ప్రయత్నాలు చేస్తుంటాయని తెలిపారు. రూ.2 వేల నోటు వైట్‌స్పాట్‌లో గాంధీ బొమ్మ ఉంటుందని, లోపల రూ.2,000 అని అడ్డంగా రాసి ఉంటుందని, ఈ రెండు లేకుంటే ఫేక్‌నోటుగా భావించాల్సి ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఫేక్ నోట్లలో రెండు, మూడు నోట్లు ఒకే సీరీస్‌తో ఉంటున్నాయని, ఇలా ఒకే సీరిస్‌తో ఏవైనా నోట్లు ఉన్నట్లు గమనిస్తే దొంగనోట్లుగా గుర్తించాలని కోరారు. అధికమొత్తంలో డబ్బులు ఆశచూపించి మోసం చేసేందుకు ప్రయత్నిస్తారని, అటువంటి మోసాలకు, ప్రలోభాలకు లొంగిపోవద్దని సీసీఎస్ డీఎస్పీ సత్యనారాయణ ప్రజలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment