వెలమల నారాయణరావు
పశ్చిమగోదావరి, తణుకు: అతను ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చదివాడు.. సర్జికల్ వస్తువులు హోల్‌సేల్‌గా విక్రయిస్తుంటాడు.. అయితే అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని వచ్చిన ఆలోచనను అమల్లో పెట్టాడు.. శాఖా పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వారికి ఫోన్ చేసి మీకు సాయం చేస్తాను.. ఇబ్బందులు లేకుండా గట్టెక్కిస్తానంటూ నమ్మబలికి వారి నుంచి డబ్బు లాగుతాడు.. అతనే శ్రీకాకుళం జిల్లా ఎడ్చర్ల మండలం కుసిలేపురం గ్రామానికి చెందిన వెలమల నారాయణరావు అలియాస్ నాయుడు. పెట్టుబడి కేవలం నెట్‌లో దినపత్రికలు చదవడం.. వాటిలో వచ్చిన వార్తల ఆధారంగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులకు ఫోన్‌చేసి బెదిరించడం ఇతని ప్రవృత్తి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో మద్యం తాగి ఇద్దరు మృతి చెందిన ఘటనను ఆధారం చేసుకుని ఒక ఎక్సైజ్ ఎస్సై నుంచి రూ.1.50 లక్షలు గుంజాడు. మరో ఎక్సైజ్ సీఐ నుంచి డబ్బు గుంజే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు.
ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని..
వెలమ నారాయణరావుకు ఇంటర్నెట్‌లో దినపత్రికలు(ఈ పేపర్) చదవటం అలవాటు. గత నెల 17న దినపత్రికల్లో సత్యవాడ ఘటనకు సంబం ధించిన వార్తలు అతడు చదివాడు. వాటిని ఆధారం చేసుకుని ఎక్సైజ్ అధికారుల నుంచి డబ్బు గుంజాలని పన్నాగం పన్నాడు. ఎక్సైజ్‌శాఖకు సంబంధించిన వెబ్‌సైట్ ఓపెన్ చేసి తణుకు సర్కిల్ పరిధిలోని ఎక్సైజ్ అధికారుల ఫోన్ నంబర్లు సేకరించాడు. సత్యవాడ ఘటనకు సంబంధించి ఆ ప్రాంత పరిధిలోని మహిళా ఎక్సై జ్ ఎస్సైకు ఫోన్ చేసి మీరు శాఖాపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తాను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజయవాడ కమిషనరేట్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని, తన పేరు నాయుడని చెప్పి పరిచయం చేసుకున్నాడు. తన బ్యాంకు ఖాతాకు రూ.2 లక్షలు జమ చేయాలన్నాడు. ఇబ్బందుల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తానని చెప్పడంతో నిజమని నమ్మిన ఆమె రూ.1.50 లక్షలు ఇస్తానని చెప్పింది. దీంతో సరే అని చెప్పిన నాయుడు ఒక బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చాడు. దీంతో నాలుగు దఫాలుగా ఆమె రూ.1.50 లక్షలు జమ చేసింది. ఇదే అదునుగా మరుసటి రోజు ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావుకు ఫోన్ చేసి ఇదే తరహాలో బెదిరించాడు. దీంతో అనుమానం వచ్చిన సీఐ సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు కాల్ వచ్చిన ఫోన్ నంబరు, నాయుడు ఇచ్చిన బ్యాంకు ఖాతా నంబరు ఆధారంగా తణుకు సీఐ కేఏ స్వామి, పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అడ్వకేట్ బ్యాంకు ఖాతా నంబరువాడుకున్న మోసగాడు
ప్రభుత్వాధికారులను మోసంచేసి వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న వెలమల నారాయణరావు అలియాస్ నాయుడు బండారం అతని స్నేహితుడు, న్యాయవాది నామా బలరాంశేఖర్ ద్వారా బయటపడింది. నారాయణరావు ప్రభుత్వాధికారులకు బలరాంశేఖర్ బ్యాంకు ఖాతా నంబరు ఇచ్చేవాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శేఖర్‌కు ఓసారి మార్నింగ్ వాక్‌లో పరిచయమైన నారాయణరావు తనకు కొందరు డబ్బు ఇవ్వాలని, మీ బ్యాంకు ఖాతా నంబర్ చెబితే వినియోగించుకుంటానని చెప్పడంతో నమ్మిన ఆయన బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చాడు. ఇలా ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇచ్చిన బ్యాంకు ఖాతా నంబర్ ఆధారంగా చిరునామా సేకరించిన పోలీసులు బలరాంశేఖర్‌ను తణుకు తీసుకువచ్చి విచారించగా మొత్తం మోసం బయటపడింది. అడ్వకేట్ శేఖర్ ద్వారా నారాయణరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని ఫోన్ కాల్ డేటాను పరిశీలించి నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడు నారాయణరావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.
Comments
Please login to add a commentAdd a comment