కుమార్తె వివాహమైన యువకుడిని ప్రేమించడంతో.. | Husband Killed Wife In West Godavari | Sakshi
Sakshi News home page

కిరాతక హత్య

Published Tue, Sep 11 2018 7:10 AM | Last Updated on Tue, Sep 11 2018 7:10 AM

Husband Killed Wife In West Godavari - Sakshi

తిమ్మరాజుపాలెంలో ప్రణయత మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ బాలకృష్ణ, ఎస్సై సతీష్‌ ,బొబ్బిలి ప్రణయత

పశ్చిమగోదావరి, నిడదవోలు రూరల్‌:  భార్యభర్తల మధ్య తగాదాల నేపథ్యంలో నిద్రపోతున్న భార్య తలపై రాడ్డుతో కొట్టి రక్తం మడుగులో ఉన్న ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్యచేశాడు ఓ కిరాతక భర్త. ఈ ఘటన నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మరాజుపాలెంకు చెందిన బొబ్బిలి వెంకటరామారావు అదే గ్రామానికి చెందిన ప్రణయత(33) 2000 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ప్రణయత ఐదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశానికి వెళ్లింది. దీంతో వెంకటరామారావు దేవరపల్లి మండలం గౌరీపట్నానికి చెందిన ఒక మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆమె తరచు తిమ్మరాజుపాలెం వస్తూండేది.

నాలుగు నెలలు క్రితం ప్రణయత గల్ఫ్‌దేశం నుంచి ఇంటికి రావడంతో భర్తకు వేరే మహిళతో లైంగిక సంబంధం ఉన్నట్టు తెలిసింది. దీంతో భార్యాభర్తలు తరచు తగాదాలు పడేవారు. వారికి పెద్దలు నచ్చజెప్పారు. అయితే వారి పెద్ద కుమార్తె ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్లు తల్లికి తెలియడంతో  ఇటీవల కుమార్తెను మందలించింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య ఆదివారం రాత్రి తగాదా జరగటంతో  ప్రణయతను తలపై రాడ్డుతో బలంగా కొట్టగా తీవ్రంగా రక్తస్రావమై ఉన్న ఆమెపై పెట్రోల్‌ పోసి వెంకటరామారావు నిప్పంటించాడు. మృతురాలి తల్లి కొండేపూడి లక్ష్మి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై జి.సతీష్‌ కేసు నమోదు చేశారు. నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు.

కుమార్తె ప్రేమ వ్యవహారమే కారణమా?
ప్రణయత పెద్దకుమార్తె (18) నిడదవోలులోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. కొంతకాలంగా పట్టణ శివారు లింగంపల్లికి చెందిన వివాహితుడైన యువకుడి ప్రేమలో పడింది. వీరిద్దరూ చాలాచోట్ల కలిసి కనిపిస్తున్నారని బంధువులు తల్లికి చెప్పడంతో కుమార్తెను నిలదీసింది. దీంతో కొన్నిరోజులుగా తల్లీకూతురు మధ్య సరిగా మాటలు లేవు.  ప్రణయత గల్ఫ్‌ దేశానికి రెండుసార్లు వెళ్లి ఐదేళ్లపాటు పనిచేసింది. ఆ సమయంలో ఆమె పంపిన డబ్బులో సుమారు రూ.2 లక్షలు భర్త వృథాగా ఖర్చుపెట్టడంతో పాటు గౌరీపట్నానికి చెందిన మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు.

ఆ మహిళను కొన్నిసార్లు నేరుగా ఇంటికి తీసుకురావడంతో ఈ విషయం పెద్దకుమార్తెకు తెలిసినా తల్లికి చెప్పలేదు. తండ్రి, కుమార్తెలిద్దరూ ఒకేమాట మీద ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. కుమార్తె వివాహమైన యువకుడిని ప్రేమించడంతో భార్యభర్తల మధ్య ఆదివారం రాత్రి తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం నిద్రిస్తున్న భార్యను కోపంతో రగిలిపోతున్న భర్త రాడ్డుతో కొట్టడంతో పాటు పెట్రోల్‌ పోసి కిరాతంగా హత్య చేశాడు. తల్లిని హత్య చేయడంలో పెద్దకూతురు కూడా తండ్రికి సహకరించినట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో వేసుకున్న దుస్తులను కూడా పోలీసులు స్వా«ధీనం చేసుకుని కేసు విచారణ చేస్తున్నట్టు తెలిసింది. అల్లుడు, మనవరాలు కలిసి తన కుమార్తెను హత్యచేశారని మృతురాలి తల్లి కొండేపూడి లక్ష్మి ఆరోపిస్తూ కన్నీటిపర్యంమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement