నరికిన భార్య తలను చేత్తో పట్టుకున్న శ్రీనివాసరావుతో సీఐ విజయచంద్ర
ఆ చిన్నారుల కళ్లలో బేల చూపులు.. రాత్రి పక్కనే గుండెలపై చేయి వేసి నిద్దుర పుచ్చిన అమ్మ .. తెల్లవారే సరికి శాశ్వతంగా నిద్దురలోకి జారిపోయింది. ఏ రాత్రి వేళో, వేకువ వేళో డబ్బులిచ్చి తలపై ప్రేమగా నిమిరే నాన్న చేతులు.. బేడీలతో కటకటాల వెనక్కి వెళ్లి ముడుచుకుపోయాయి. మద్యం మత్తులో కర్కశంగా మారిన తండ్రి మూర్ఖత్వానికి ఇద్దరు పసివాళ్ల జీవితాలు అనాథగా మారాయి. వివాహేతర సంబంధం వద్దన్నందుకు భార్య తలను నరికిన కసాయి భర్త ఉదంతం కలకలం రేపింది.
గుంటూరు ,సత్తెనపల్లి: కట్టుకున్న భార్యను భర్త దారుణంగా హతమార్చిన ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో జరిగింది. అర్బన్ సీఐ ఎస్.విజయ చంద్ర తెలిపిన వివరాల మేరకు.. సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన ముప్పన శ్రీనివాసరావుకు తండ్రి మరణంతో లింగంగుంట్ల మేజర్‌పై ఉద్యోగం వచ్చింది. పిల్లుట్ల గ్రామానికి చెందిన మాండ్ల అంకమ్మ (35)ను 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఐదేళ్ల క్రితం శ్రీనివాసరావు సాధారణ బదిలీల్లో భాగంగా ఫిరంగిపురం మండలానికి బదిలీ అయ్యాడు. కొండవీడు మేజర్‌పై లస్కర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య, పిల్లలను సత్తెనపల్లిలోని ఎన్‌ఎస్‌పీ కాలనీలో ఉంచి రాకపోకలు సాగించేవాడు. ఈ క్రమంలో శ్రీనివాసరావు ఫిరంగిపురంలో మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని నిత్యం మద్యం సేవిస్తూ భార్య, పిల్లలను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఇంటికి రావడం పూర్తిగా తగ్గించాడు. జీతం ఇవ్వకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో భార్య అంకమ్మకు అనుమానం వచ్చి కొద్దిరోజుల క్రితం ఫిరంగిపురం వెళ్లి భర్త శ్రీనివాసరావు ఉంటున్న ఇంటిని పరిశీలించింది. అక్కడ భర్త శ్రీనివాసరావు మరో మహిళతో ఉండటం ప్రత్యక్షంగా చూసింది.
దీంతో వారి మధ్య గొడవ జరిగింది. అనంతరం తన భర్తను వెంట పెట్టుకుని అంకమ్మ సత్తెనపల్లి వచ్చింది. శ్రీనివాసరావు ఎప్పుడు వచ్చినా అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత రావడం, తెల్లవారుజామున 3, 4 గంటల మధ్య వెళ్లిపోవడం చేస్తుంటాడు. రెండు రోజులుగా భార్యతో భర్త శ్రీనివాసరావు గొడవ పడుతున్నాడు. సోమవారం రాత్రి పూటుగా మద్యం సేవించి భార్య అంకమ్మతో గొడవకు దిగాడు. అంకమ్మ జరిగిన ఘటనను తొమ్మిది గంటల సమయంలో తన సోదరుడు అంకారావుకు ఫోన్‌లో చెప్పింది. అర్ధరాత్రి సమయంలో శ్రీనివాసరావు గొడవ చేస్తుండడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తేల్చి చెప్పింది. పోలీసుస్టేషన్‌కు బయలుదేరి వెళుతుండగా కోపోద్రిక్తుడైన శ్రీనివాసరావు మొండి కొడవలితో వెనుక నుంచి వచ్చి ఎన్‌ఎస్‌పీ బంగ్లా వద్ద అతి కిరాతకంగా నరికాడు. తల, మొండం వేరు చేశాడు. తలను పట్టుకుని పారిపోయేందుకు యత్నించగా సమాచారం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలను పట్టుకున్న శ్రీనివాసరావును సీఐ ఎస్.విజయచంద్ర అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి సోదరుడు మాండ్ల అంకారావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment