జాషువా మృతదేహంపై పడి కన్నీమున్నీరై విలపిస్తూ సొమ్మసిల్లిన తల్లి విజయకుమారి
పశ్చిమగోదావరి , పాలకొల్లు అర్బన్: ‘అన్నయ్యా నాకు ఈ గొడవతో ఏం సంబంధం లేదు.. నన్ను కొట్టొద్దు.. అని కానిస్టేబుల్ చెల్లబోయిన నరేష్‌ను వేడుకున్నా.. తాను పోలీస్ నంటూ నన్ను విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టాడు. అతనితోపాటు మరో వ్యక్తి ఉన్నాడు. అతనూ పోలీసే. గ్రామంలో నేను తప్పు చేశానని అనుకుంటున్నారు. పరువు పోయింది. జాషువా తప్పు చేయడని నా చావుతో ఊరి ప్రజలు తెలుసుకుంటారు. కానిస్టేబుల్ నరేష్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలి. అప్పుడే నా ఆత్మకు శాంతి. నా శవం కుళ్లినా సరే అతనిని అరెస్ట్ చేశాకే నన్ను ఖననం చేయండి అంటూ దళిత యువకుడు నాగదాసు జాషువా(19) 12 పేజీల సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాలకొల్లు మండలం వెంకటాపురంలోని జాషువా ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే..
జాషువా పూలపల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీకాం ఫస్టియర్ చదువుతున్నాడు. గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఏడాదిగా పనిచేస్తున్నాడు. నానమ్మ విజయమ్మ నిర్వహిస్తున్న చౌకడిపోలోనూ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. గ్రామంలో రెవెన్యూ అధికారికి అవసరమైన ప్రభుత్వ సర్వే పనులూ చేస్తుంటాడు. గ్రామస్తులందరికీ చిరపరిచితుడు. అతని స్నేహితుడు రాజేష్‌కి రాయికుదురులో ప్రేమికురాలు ఉంది. రాజేష్ కోరిక మేరకు అతనితో కలిసి జాషువా ఈ నెల 1న రాయికుదురు వెళ్లాడు. అక్కడ రాజేష్ ప్రేమికురాలికి వరుసకు సోదరుడైన చెల్లబోయిన నరేష్, మరికొందరు కలిసి వీరిద్దరినీ బంధించి విద్యుత్ స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం వీరవాసరం పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. విషయం తెలుసుకున్న జాషువా తండ్రి శ్యామలరావు, చిన్నాన్న కమలాకర్ అక్కడుకు వెళ్లి కేసు రాజీ చేసుకుని వచ్చారు.
అప్పటినుంచే మనస్తాపం
ఆ రోజు నుంచి జాషువా మనస్తాపంతో బాధపడుతున్నాడు. రెండు రోజులు పాలకొల్లులోని తన చిన్నాన్న కమలాకర్ ఇంటి వద్ద ఉండి వచ్చాడు. రాయికుదురుకు చెందిన కానిస్టేబుల్ నరేష్ నరసాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. రోజూ రాయికుదురు మీదుగా నరసాపురం వెళతారు. ఆ మార్గంలో వెళుతూ వెంకటాపురంలో జాషువా కనిపించగా మళ్లీ బెదిరించడం వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని జాషువా తండ్రి శ్యామలరావు అనుమానిస్తున్నారు.
అనవసర గొడవలకు వెళ్లొద్దు
జాషువా సూసైడ్‌నోట్‌లో సోదరులు, స్నేహితులను ఉద్దేశిస్తూ.. బాగా చదువుకోవాలని, అనవసర గొడవలకు వెళ్లొద్దని సూచించాడు. తండ్రి,చిన్నాన్నకు సిగరెట్, మందు తాగొద్దని కోరాడు. ‘నా స్నే హితురాలిని తిట్టవద్దు. ఆఅమ్మాయి చాలా మంచిది’ అం టూ పేర్కొన్నాడు. మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్‌ను ఉద్దేశించి ‘రాజేషన్నా.. నా చావుకు కారణమైన నరేష్‌ను వదలొద్దు. అతనిని అరెస్ట్ చేసిన తరువాతే తనను ఖననం చేయాలి అని పేర్కొన్నాడు. జాషువా మృతదేహాన్ని నరసాపురం డీఎస్పీ టి.ప్రభాకరబాబు పరిశీలించారు. కాని స్టేబుల్ నరేష్‌పై కేసు నమోదు చేశామని చెప్పారు.
నరేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
చెల్లబోయిన నరేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ డిమాండ్ చేశారు. వెంకటాపురంలో మృతదేహం వద్ద ఆందోళనకు దిగారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు జాషువా మృతదేహాన్ని ఖననం చేయబోమని ఆయన హెచ్చరించారు. మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి కర్ణి జోగయ్య, జిల్లా అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజు, మర్రే సామ్యూల్, తోటే సుందరరావు, కె రవికుమార్, గుండె నగేష్ తదితరులు ఉన్నారు.
గుణ్ణం నాగబాబు పరామర్శ
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్ గుణ్ణం నాగబాబు కేసు వివరాలను రూరల్ సీఐ కె.రజనీకుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన మృతుడు తండ్రి శ్యామలరావును పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment