విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్
సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): ప్రభుత్వ గుర్తింపు లేకుండానే గల్ఫ్ దేశాలకు మహిళలను ఉద్యోగాల పేరిట పంపుతూ మోసాలకు పాల్పడుతున్న ఏజెంట్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, అనుమతులు లేకుండా మహిళలను గల్ఫ్ దేశాలకు పంపితే అక్రమ రవాణాగా భావించాల్సి ఉంటుందని జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ చెప్పారు. ఇటీవల జిల్లాకు చెందిన మహిళ దుబాయ్‌లో పడుతున్న పాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారటం, వారంతా దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీకి వెళ్ళగా ఇద్దరు మహిళలను వారి గ్రామాలకు క్షేమంగా చేరేలా చర్యలు చేపట్టారు. మహిళలు ఇచ్చిన ఫిర్యాదుతో ఇరగవరం మండలం ఒగిడి గ్రామానికి చెందిన దొండ వెంకట సుబ్బారావు అలియాస్ చినబాబును పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సంఘటనకు సంబంధించి ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు మొగల్తూరు గ్రామానికి చెందిన పులుదిండి నాగలక్ష్మి దుబాయ్‌లో ఉద్యోగం కోసం ఇరగవరం మండలం ఒగిడికి చెందిన వెంకట సుబ్బారావును సంప్రదించారు. నాగలక్ష్మి నుంచి రూ.లక్ష తీసుకుని జూలై 14న శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్‌కి పంపాడు. అక్కడ శీలం అనే డ్రైవర్ ఆమెను ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకుని ఒక ప్రాంతంలో ఉంచాడు. దుబాయ్‌లో ఉండే జ్యోతి నర్సు ఉద్యోగం చూస్తుందని నమ్మబలికారు. కానీ నర్సు ఉద్యోగం రాకపోగా అక్కడ తీవ్రమైన ఇబ్బందులు పడడంతో మానసికంగా కృంగిపోయింది.
నాగలక్ష్మితోపాటు మరో ఐదుగురు తెలుగు మహిళలు ఇదే విధంగా ఏవిధమైన ఉద్యోగం లేకుండా, తీవ్ర ఇబ్బందులు పడుతూ నరకం అనుభవిస్తున్నట్లు వాట్సాప్‌లో వీడియో చిత్రీకరించి తమ బంధువులకు, సీఎం వైఎస్ జగన్‌కు సైతం సమాచారం అందించారు. అనంతరం దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీకి వెళ్ళి పరిస్థితిని అక్కడి అధికారులకు వివరించారు. నాగలక్ష్మితోపాటు టి.నర్సాపురం మండలం కె.జగ్గావురం గ్రామానికి చెందిన నట్టా భూలక్ష్మిని ఇండియన్ ఎంబసీ అధికారులు తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు తీసి ఈనెల 10న పంపారు. పాలకొల్లుకు చెందిన ప్రశాంతి అనే మరో మహిళ ఇండియన్ ఎంబసీ వద్ద ఉండగా, రెండురోజుల్లో ఆమె ఇండియాకు రానుంది.
నేపథ్యమిదీ..
ఈ కేసులో నిందితుడైన దొండ వెంకట సుబ్బారావు అలియాస్ చినబాబు ఎటువంటి ప్రభుత్వ లైసెన్స్ లేకుండానే గల్ఫ్ దేశాలకు 15 ఏళ్ళుగా మహిళలను పంపుతున్నాడు. 20 సంవత్సరాల క్రితం దోహలో 5 ఏళ్ళు పనిచేసిన సుబ్బారావు అక్కడి నుంచి వచ్చేశాడు. వచ్చిన అనంతరం కొంత పొలం, ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయంతోపాటు ఖతార్, కువైట్, దుబాయ్ దేశాలకు మహిళలను ఉద్యోగాల పేరుతో పంపుతూ ఉన్నాడు. పాలకొల్లు మండలం వెదుళ్ళపాలెం గ్రామానికి చెందిన ఆకుమర్తి జ్యోతి గత 15 ఏళ్ళుగా అక్కడే ఉంటూ ఇక్కడి నుంచి పంపే మహిళలకు అక్కడ ఉద్యోగాలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. జ్యోతి ఒక్కో మహిళ నుంచి వీసా పంపినందుకు రూ.లక్ష వరకూ తీసుకుంటూ ఉండగా, ఏజెంట్ సుబ్బారావు అదనంగా మరో రూ.50 వేల వరకు వసూలు చేస్తూ ఉంటాడు. దుబాయ్‌లో ఉండే జ్యోతికి కారు డ్రైవర్‌గా శీలం చిన్న వ్యవహరిస్తున్నాడు.
జిల్లాలో 421మంది నకిలీ ఏజెంట్లు
జిల్లాలో అనధికారికంగా, ప్రభుత్వ లైసెన్సులు లేకుండా గల్ఫ్ దేశాలకు మహిళలను పంపే నకిలీ ఏజెంట్లు 421మంది వరకూ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా ప్రభుత్వ లైసెన్సులు లేకుండా గల్ఫ్ దేశాలకు మహిళలను పంపుతున్నారు. జిల్లాలోని ఏ ఒక్క ఏజెంట్‌కూ ప్రభుత్వ అనుమతితో లైసెన్సులు లేవని ఎస్పీ నవదీప్‌సింగ్ స్పష్టం చేస్తున్నారు.
జ్యోతిపై లుక్‌అవుట్ నోటీసు
దుబాయ్‌లో ఉంటూ మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పే పాలకొల్లు మండలం వెదుళ్ళపాలెం గ్రామానికి చెందిన ఆకుమర్తి జ్యోతిపై లుక్‌అవుట్ నోటీసు జారీ చేయించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ నవదీప్‌సింగ్ చెప్పారు. దుబాయ్‌లోని జుల్ఫా ప్రాంతంలో ఒక గదిలో ఇతర దేశాలకు చెందిన చాలా మంది మహిళలతో పాటు 10మంది తెలుగు మహిళలు అక్కడ ఉంచుతున్నట్లు బాధిత మహిళ నాగలక్ష్మి పోలీసులకు వివరించింది. ఉద్యోగాలు ఇప్పించకుండా వేధింపులకు గురిచేస్తోందనీ, తమపై మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డారని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
సీఎం జగన్‌కు వాట్సాప్ వీడియోతో బాధితుల ఫిర్యాదు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దుబాయ్‌లోని బాధిత మహిళలు వాట్సాప్‌లో తాము పడుతున్న ఇబ్బందులను వీడియో తీసి పంపారు. వెంటనే స్పందించిన సీఎం వైఎస్ జగన్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చర్యలు చేపట్టాలని చెప్పటంతో జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. రంగంలోకి దిగిన నరసాపురం డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు నకిలీ ఏజెంట్ వెంకట సుబ్బారావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జిల్లాకు చెందిన పులుదిండి నాగలక్ష్మి, నట్టా భూలక్ష్మి, పాలకొల్లుకు చెందిన ప్రశాంతితోపాటు మరికొందరు మహిళలు సైతం మోసపోయినట్లు తెలుసుకున్నారు.
నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు
జిల్లా వ్యాప్తంగా గల్ఫ్ దేశాలకు మహిళలను ఉద్యోగాల పేరుతో పంపుతున్న నకిలీ ఏజెంట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ నవదీప్‌సింగ్ హెచ్చరించారు. నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు, సీఐ బి.కృష్ణకుమార్ ఆధ్వర్యంలో మొగల్తూరు ఎస్‌ఐ షేక్ మదీనా బాషా, సిబ్బందితో కలిసి నిందితుడు సుబ్బారావును అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ మేరకు మొగల్తూరు పోలీసు స్టేషన్‌లో ఇరగవరం మండలం ఒగిడి గ్రామానికి చెందిన దొండ వెంకట సుబ్బారావు అలియాస్ చినబాబు, పాలకొల్లు మండలం వెదుళ్ళపాలెం గ్రామానికి చెందిన ఆకుమర్తి జ్యోతి, ఆమె డ్రైవర్ శీలం చిన్నా అనే వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. 420, 370 ఐపీసీ రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ 24(1)(బీ) ఆఫ్ ఇమిగ్రేషన్ యాక్ట్ 1983, సెక్షన్3(1)(హెచ్), 3(2)(వీ) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. వెంకట సుబ్బారావును పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment