నల్లిమిల్లి లక్ష్మీప్రసన్న, రోజా శ్రీలక్ష్మి, జాహ్నవి (ఫైల్)
సాక్షి, మొగల్తూరు: ఏం కష్ట మొచ్చిందో ఆ తల్లికి.. పేగుబంధంపైనా పెనుకసిని చూపింది. కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలను కడితేర్చింది. పిల్లల చిరునవ్వులను చూసి నిత్యం మురిసిపోయిన ఆమె అతి కర్కశంగా వారి మెడకు తువ్వాలు బిగించి, బిగించి ఊపిరి తీసింది. చివరకు తనూ ఉరివేసుకుని ప్రాణం తీసుకుంది.
ఏం జరిగిందంటే..!
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గాంధీబొమ్మల సెంటర్ సమీపంలో నివాసం ఉండే నల్లిమిల్లి లక్ష్మీప్రసన్న(28) ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. తను చని పోవడానికి ముందు పెద్ద కుమార్తె రోజాశ్రీలక్ష్మి (7), చిన్న కుమార్తె జాహ్నవి (5) లను కూడా దారుణంగా తువ్వాలుతో గొంతుబిగించి చంపేసింది. ఆర్థిక ఇబ్బందులు, భర్త వేధింపులు, కుటుంబ కలహాల వల్లే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీంతో మొగల్తూరులో విషాదఛాయలు అలముకున్నాయి. రైస్ మిల్లు జయమాని అయిన లక్ష్మీప్రసన్న భర్త నల్లిమిల్లి వెంకటరామాంజనేయరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి 7.15గంటల సమయంలో మిల్లు నుంచి ఇంటికి వచ్చిన రామాంజనేయరెడ్డి ఇంట్లో భార్య ఫ్యాన్‌కు ఉరివేసుకుని, మంచంపై ఇద్దరు పిల్లలు విగత జీవులుగా పడిఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో మొగల్తూరు ఎస్సై వచ్చి వెంటనే రామాంజనేయరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ముందు పిల్లలను చంపి..
ముందు పిల్లల గొంతులను తువ్వాలుతో బిగించి లక్ష్మీప్రసన్న చంపిందని, తరువాత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇద్దరు చిన్నారులకు మెడపై గాయాలు ఉండడమే కాకుండా, ముక్కునుంచి రక్తం కారుతున్నట్టు గుర్తించారు. పిల్లలు ఇద్దరూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత అదే గదిలో ఫ్యాన్‌కు చీరతో లక్ష్మీప్రసన్న ఉరివేసుకుందని భావిస్తున్నారు.
ఆదివారం ఇంట్లో పెద్ద గొడవ?
లక్ష్మీప్రసన్న ఇంట్లో ఆదివారం జరిగిన పెద్ద గొడవే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. కొన్నినెలలుగా భర్త వేధింపులే ఈ గొడవకు కారణమని సమాచారం. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. వెంటక రామాంజనేయరెడ్డి కుటుంబానిది ఆచంట మండలం పిట్టలవేమవరం. ఆయన తండ్రి సత్యనారాయణరెడ్డి 15ఏళ్ల క్రితం మొగల్తూరు వచ్చేశారు. అతనికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఇక్కడ రైస్‌మిల్లు వ్యాపారం ప్రారంభించారు. తండ్రీ, కొడుకులు ఇద్దరూ కలసి రైసుమిల్లు నడిపేవారు. అయితే 3 నెలల క్రితం సత్యనారాయణరెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. 10 రోజుల కిత్రం రామాంజనేయరెడ్డి తల్లి రామలక్ష్మి కూడా చనిపోయారు. రామలక్ష్మి పెద్దకార్యం ఆదివారం జరిగింది. ఈ సందర్భంలో లక్ష్మీప్రసన్నతో భర్త, ఆడపడుచులు గొడవ పడినట్టు లక్ష్మీప్రసన్న తల్లి కనకదుర్గ చెబుతోంది. సోమవారం ఉదయం ఇంట్లో శాంతిహోమం నిర్వహించారు. అది ముగిసిన తరువాత సాయంత్రం 6 గంటలకు మిల్లుకు వెళ్లానని, మళ్లీ రాత్రి 7.15 గంటలకు ఇంటికి వచ్చి చూడగా భార్యాపిల్లలు మృతిచెంది పడి ఉన్నారని రామాంజనేయరెడ్డి చెబుతున్నాడు.
మంచంపై విగత జీవులుగా పడి ఉన్న చిన్నారులు
ఆత్మహత్యా... హత్యలా..?
అల్లుడికి ఉన్న అప్పులు, వేధింపులే తమ కుమార్తె ప్రాణం తీశాయని లక్ష్మీప్రసన్న తల్లి కనకదుర్గ ఆరోపిస్తోంది. అల్లుడు తండ్రి సత్యనారాయణరెడ్డి చనిపోయే నాటికి మిల్లుపై రూ.7 కోట్ల వరకూ అప్పులు చేశారని చెబుతోంది. అప్పటి నుంచి డబ్బులు తేవాలని, లేకుంటే నిన్ను చంపి వేరే పెళ్లి చేసుకుంటానని అతను తన కుమార్తెను బెదిరిస్తున్నాడని కనకదుర్గ చెబుతున్నారు. అప్పటికీ ఇటీవల రూ.70 లక్షలు సర్దామని, అయినా ఆదివారం జరిగిన గొడవలో తమ కుమార్తెపై అల్లుడు, అతని బంధువులు విరుచుకుపడ్డారని వివరించింది. అయితే అసలు ఏం జరిగిందనేది రామాంజనేయరెడ్డి నోరు తెరిస్తేనే గానీ తెలియదు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతులుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని నరసాపురం సీఐ కృష్ణమోహన్ చెప్పారు.
చిన్న గొడవ కూడా బయటకు వచ్చేది కాదు
లక్ష్మీప్రసన్న కుటుంబం 15 ఏళ్లుగా ఇదే ఇంట్లో అద్దెకు ఉంటోంది. గొడవలు జరుగుతున్నట్టుగా గానీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టుగా గానీ ఏమీ తెలిసేది కాదని స్థానికులు చెబుతున్నారు. రామాంజనేయరెడ్డికి, ఆలమూరుకు చెందిన లక్ష్మీప్రసన్నతో 2011లో పెళ్లైంది. పెద్దపాప 2వ తరగతి, చిన్న పాప ఎల్‌కేజీ. పిల్లలతో కలసి చుట్టుపక్కల వారితో లక్ష్మీప్రసన్న చాలా కలివిడిగా ఉండేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment