సాక్షి, గుంటూరు : ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హైదరాబాద్ ఉప్పల్‌లోని హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న కొందరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా, చాలామందిని క్వారంటైన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. ముఖ్యంగా టీవీ ఛానల్స్‌లో చాలా ప్రబలంగా, విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, దీనిపై చంద్రబాబు స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బుధవారం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్ట్ ద్వారా వేలు, లక్షల మందికి పాలు తీసుకువెళ్లి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సెన్సిటివ్‌గా ఉండే ప్రాంతాలలో వైరస్ వచ్చినప్పుడు అది ఇంకా విస్తృతంగా వ్యాపించే ప్రమాదం ఉంది. ( రాజకీయ దుర్బుద్ధి తప్ప.. ప్రజలపై ప్రేమ ఏదీ! )
కాబట్టి తక్షణమే బయటకు వచ్చి దీనిలో వాస్తవాలేంటి.. అవాస్తవాలేంటి.. ఏం జరిగింది.. ఎంతమందికి వచ్చింది.. ఎంతమందిని క్వారంటైన్ చేశారనే దానిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయనాయకుడిగా మీపై ఉంది. హెరిటేజ్ ఆయన స్వంతసంస్థ అయినప్పటికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చంద్రబాబునాయుడుకు గుర్తుచేస్తున్నాను. ఎందుకంటే వారు కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్‌కు చాలా సలహాలు ఇస్తున్నారు. రోజూ గంటల తరబడి వారు చాలా విషయాలు చెబుతున్నారు. ( చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? )
కానీ, హెరిటేజ్‌లో సంభవించిన ఈ ప్రమాదం ఇంకా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు ఏవిధమైన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకుంది. హెరిటేజ్ ఫ్యాక్టరీని క్లోజ్ చేశారా?. పాల ఉత్పత్తులు జరుగుతూనే ఉన్నాయా. ఆ పాల ఉత్పత్తుల వల్ల ప్రమాదం లేదా?. వీటన్నింటికి వివరణ ఇవ్వకపోయినట్లైతే ఆంధ్రరాష్ర్టానికి సంబంధించిన ప్రజలు గానీ, తెలంగాణ రాష్ర్ట ప్రజలు గానీ కన్ఫ్యూజన్‌కు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై తక్షణమే చంద్రబాబు బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పితీరాలని కూడా మేం డిమాండ్ చేస్తున్నా’’మని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment