రైతు బజార్లలో ఇవాళ ఇంత క్యూలు ఉన్నాయంటే దానికి కారణం వినియోగదారులు హెరిటేజ్ షాపుల్లో కిలో రూ.200 పెట్టి కొనుక్కోలేక పోవడమే. రైతు బజార్లలో రూ.25కే కిలో ఉల్లిపాయలు అందిస్తున్నాం కనుకే జనం క్యూ కడుతున్నారు. ఈ విషయాలేవీ చంద్రబాబుకు అర్థం కావు. శవాల మీద రాజకీయం చేసే రకం.
– సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ప్రజలు ఇక్కట్లు పడకుండా రైతు బజార్లలో కిలో రూ.25 చొప్పున విక్రయాలు కొనసాగిస్తూనే వచ్చే శుక్రవారం నుంచి మార్కెట్ యార్డులలోనూ ఉల్లిగడ్డలను అమ్మిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్నదే తమ ధ్యేయమని, అందుకోసం ఎంత ఖర్చయినా పర్వాలేదన్నారు. ఈనెల 12, 13 తేదీలలో విదేశాల నుంచి ఉల్లిగడ్డలు ముంబయి పోర్టుకు రానున్నాయని, వాటిల్లోనూ మన రాష్ట్రానికే అత్యధికంగా కేటాయించాలని ఇండెంట్ పెట్టామన్నారు. ఉల్లిపై మంగళవారం రాష్ట్ర శాసనసభలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయం చెప్పారు. ఉల్లిపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం బాధనిపిస్తోందన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
ఏపీలోనే తక్కువ ధర
‘దేశంలో ఉల్లిని తక్కువ ధరకు విక్రయిస్తున్న రాష్ట్రాలలో నంబర్ వన్ రాష్ట్రం మనదే. బిహార్‌లో కిలో ఉల్లి రూ.35, పశ్చిమ బెంగాల్‌లో రూ.59, తెలంగాణలో రూ.40, తమిళనాడులో రూ.35–40 మధ్య, మధ్యప్రదేశ్‌లో రూ.50 చొప్పున పరిమితమైన సరుకు అమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కిలో రూ.25 చొప్పున విక్రయిస్తున్నాం. తెలంగాణలో ఒకే ఒక్క రైతుబజార్లో 25 టన్నులు, తమిళనాడులో 50 టన్నులు కన్నా తక్కువగా విక్రయించారు. బిహార్‌లో నవంబర్ 22 నుంచి 28 వరకు అమ్మకాలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లో ఇవాల్టి (మంగళవారం) నుంచి అమ్ముతారని సమాచారం. మహారాష్ట్రలో ఇంకా మొదలు కాలేదు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటున్న ఉల్లిపాయల్లో అత్యధికంగా 2,100 మెట్రిక్ టన్నులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది.
ఈ సరుకు ఈనెల 12, 13 తేదీల్లో ముంబయికి రాబోతోంది. ప్రజలకు మంచి చేసే సమయంలో ఎలాంటి జాప్యం, లోపం చూపించాల్సిన అవసరం లేదని, కాస్త దూకుడు(అగ్రెసివ్)గా ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించాం. రైతు బజార్లలోనే కాకుండా వచ్చే శుక్రవారం నుంచి మార్కెట్ యార్డుల్లోనూ సబ్సిడీపై ఉల్లిపాయల అమ్మకం ప్రారంభిస్తాం. దేశంలో మరెక్కడా కూడా ఈ స్థాయిలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. అయినా ప్రతిపక్షం రాజకీయం చేస్తోంది. ఇది ధర్మమేనా? వాళ్లు గుండెల మీద చేయి వేసుకుని మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
కొరత ఉన్నా ఇబ్బంది పడకుండా చూస్తున్నాం : మోపిదేవి
మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు ఉల్లిపై చర్చను ప్రారంభిస్తూ.. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ మధ్య నుంచి కొరత ప్రారంభమైందన్నారు. డిసెంబర్ మొదటి వారానికి హోల్‌సేల్ మార్కెట్లలో కిలో ఉల్లి రూ.100–130 మధ్య పలికిందని, ప్రస్తుతం రూ.80–100 మధ్య ఉందన్నారు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం వల్ల దిగుబడి తక్కువగా వచ్చిందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర తదితర ఉల్లి సాగు చేసే రాష్ట్రాలలో పంట నష్టం జరిగిందని వివరించారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి సూచన మేరకు కిలో రూ.25కే వినియోగదారులకు సరఫరా చేస్తున్నామన్నారు. కర్నూలు, తాడేపల్లిగూడెం, హైదరాబాద్, షోలాపూర్, అల్వార్ మార్కెట్ల నుంచి ఉల్లిపాయలు తెప్పించామని తెలిపారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకోకుండా ప్రతిపక్షం దుర్బుద్ధితో విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు.
ప్రతిదీ రాజకీయమేనా బాబూ?: కన్నబాబు
కిలో ఉల్లికి వంద రూపాయల సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? అని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు విపక్షాన్ని ప్రశ్నించారు. రాజకీయాన్ని వ్యవసాయానికి ముడిపెట్టవద్దని చంద్రబాబుకు హితవు పలికారు. ప్రతిదాన్నీ రాజకీయం చేయాలని చూడడం బాబు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. మహిళల భద్రతపై చర్చ జరుగుతుంటే సమయం, సందర్భం చూడకుండా శవం బొమ్మలతో ఉల్లిదండలు వేసుకుని వచ్చి ఆటంకం సృష్టిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో ఓ వ్యక్తి సహజ మరణాన్ని తన రాజకీయ స్వార్థం కోసం వినియోగించుకోవడాన్ని ఆక్షేపించారు. చంద్రబాబు సోమవారం సభలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, సభను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంలో చంద్రబాబు, మంత్రి కొడాలి నాని మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం టీడీపీ సభ్యురాలు భవాని చర్చలో పాల్గొంటూ రేషన్ డిపోలలోనూ ఉల్లిని విక్రయించాలని, గ్రామ వలంటీర్లతో ఇంటింటికీ సరఫరా చేయించాలన్నారు.
ముందే గుర్తించి చర్యలు : పార్థసారధి
అతివృష్టి, అనావృష్టి కారణంగా దేశంలో ఉల్లి కొరత ఏర్పడితే అదేదో మన రాష్ట్రం ఒక్కదానికే పరిమితమైన సమస్యగా విపక్షం చిత్రీకరిస్తోందని ఎమ్మెల్యే పార్థసారధి విమర్శించారు. సమస్య తీవ్రతను తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు నెలల ముందే గుర్తించి మార్కెట్‌లో జోక్యం చేసుకోండని అధికారులను ఆదేశించారన్నారు. ముందు చూపుతో వ్యవహరించినందు వల్లే ప్రజలకు ఇబ్బంది లేకుండా సరుకు తెప్పించి కిలో రూ.25కు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఇవేవీ పట్టించుకోకుండా సహజ మరణాలను కూడా ఉల్లి మరణాలుగా చిత్రీకరిస్తూ ప్రతిపక్షం శవ రాజకీయం చేస్తోందని విమర్శించారు. జగన్ మోహన్‌రెడ్డి రైతు పక్షపాతి కాగా, చంద్రబాబు రైతు వ్యతిరేకన్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తుంటే ఓర్వలేక బాబు విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. దళారులను నిలువరించిన ఘనత జగన్‌దేనని వివరించారు. డాక్టర్ వైఎస్సార్ పాలనలో రైతుకు జరిగిన మేలును ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment