rythu Bazaar
-
రాష్ట్రంలో మరో 54 రైతు బజార్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లో కొత్తగా మరిన్ని రైతు బజార్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రూ.41.09 కోట్ల వ్యయంతో ఒకేసారి 54 కొత్త రైతు బజార్లను నెలకొల్పుతోంది. వీటిలో ఇప్పటికే 15 రైతు బజార్లు అందుబాటులోకి రాగా.. మరో 3 రైతు బజార్లు ఈ నెల 15న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులతో పాటు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రైతుబజార్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన సమయానికి ఏపీలో 87 రైతు బజార్లు ఉండేవి. కొత్త రైతు బజార్ల ఏర్పాటు ప్రతిపాదన ఏళ్ల తరబడి ఉన్నప్పటికీ స్థలాల కొరత, నిధుల లేమి సాకుతో గత టీడీపీ ప్రభుత్వం వాటి జోలికి పోలేదు. ఉన్న రైతు బజార్లలోనూ కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఫలితంగా రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రైతుబజార్ల ఏర్పాటుతో పాటు ఇప్పటికే ఉన్న రైతు బజార్లలో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది. కాకినాడ జిల్లాలో 10, తూర్పు గోదావరి జిల్లాలో 4, విజయనగరం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో 3 చొప్పున, విశాఖపట్నం, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో 2 చొప్పున, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, బాపట్ల, తిరుపతి, నంద్యాల, కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నిర్మిస్తారు. వీటిలో 11 టెండర్ల దశలో ఉండగా, 7 బేస్మెంట్ దÔèæ, 8 రూఫ్‌స్థాయి, 5 సీలింగ్ స్థాయిల్లో ఉండగా, మరో ఐదుచోట్ల టెండర్లు పిలవాల్సి ఉంది. నాడు–నేడు కింద మౌలిక వసతుల కల్పన నాడు–నేడు కింద రూ.4.50 కోట్ల అంచనా వ్యయంతో విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, వైఎస్సార్ జిల్లాల్లోని మొత్తం రైతుబజార్లను ఆధునికీకరిస్తున్నారు. శిథిలమైన షెడ్ల పునర్నిర్మాణంతో పాటు ఆర్వో ప్లాంట్స్, విద్యుత్, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. పార్కింగ్, హోర్డింగ్స్, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో స్వయం సంవృద్ధి సాధించే దిశగా రైతుబజార్లను తీర్చిదిద్దుతున్నారు. ఒకేసారి 54 రైతు బజార్ల నిర్మాణం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 54 కొత్త రైతుబజార్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటిలో 15 రైతుబజార్ల సేవలు అందుబాటులోకి రాగా.. మరో 3 రైతుబజార్లను ఈ నెల 15న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశాం. మిగిలిన వాటిని దశల వారీగా ప్రారంభిస్తాం. – ముల్లంగి నందకిషోర్, సీఈవో, రైతుబజార్లు -
మార్కెట్ ధర 150.. సర్కార్ చర్యలు.. రైతుబజార్లలో కిలో రూ.50కే టమాటా
సాక్షి, అమరావతి : టమాటా ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా సబ్సిడీ రేటుకు టమాటాలను విక్రయిస్తూ వినియోగదారులకు బాసటగా నిలుస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి వీటి ధరలు రోజురోజుకూ దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే కిలో రూ.250లు దాటింది. రాష్ట్రంలో కిలో రూ.150 ఉంది. అయినా సరే ప్రభుత్వం వెనుకాడడంలేదు. దేశంలో మరెక్కడాలేని విధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుల నుంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తూ గత నెల 28 నుంచి కిలో రూ.50 చొప్పున సబ్సిడీపై అందిస్తోంది. ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు రైతుబజార్ల ద్వారా ఈ అమ్మకాలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 422 టన్నుల సేకరణ ఈ నేపథ్యంలో.. ప్రతిరోజూ రాష్ట్రంలోని వివిధ టమాటా మార్కెట్లతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం టమాటాలను సేకరిస్తోంది. ఇప్పటివరకు దాదాపు రూ.4 కోట్లు ఖర్చుచేసి 422.06 టన్నులు సేకరించింది. ప్రధాన మార్కెట్లలో వ్యాపారులతో పాటు వేలంపాటల్లో పాల్గొని రైతుల నుంచి, వ్యాపారుల నుంచి సేకరిస్తోంది. ఇలా ఇప్పటివరకు సగటున కిలో రూ.94.44 చొప్పున గరిష్టంగా కిలో రూ.110 చొప్పున కొనుగోలు చేసింది. వీటిని రాష్ట్రవ్యాప్తంగా 103 రైతుబజార్లలో మనిషికి కిలో నుంచి రెండు కిలోల వరకు విక్రయిస్తోంది. మరోవైపు.. శుక్రవారం సగటున కిలో రూ.94.34 చొప్పున రూ.61.32 లక్షల విలువైన 65టన్నుల టమాటాలను అధికారులు సేకరించారు. వీటిలో 30 టన్నులు పలమనేరు మార్కెట్ నుంచి, 20 టన్నులు మదనపల్లి మార్కెట్ నుంచి, మరో 15 టన్నులు విజయవాడలోని రైతులు, వ్యాపారుల నుంచి కొనుగోలు చేశారు. విశాఖ, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని రైతుబజార్లకు తరలించి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో కూడా ఇదే రీతిలో కిలో రూ.100 దాటిన సందర్భంలో రైతుల నుంచి సేకరించి సబ్సిడీపై రైతుబజార్ల ద్వారా విక్రయించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతుబజార్ల ద్వారా సబ్సిడీపై టమాటాను విక్రయిస్తున్నాం. ప్రభుత్వంపై ఆరి్థకంగా భారమైనప్పటికీ సగటున కిలో రూ.94.44 చొప్పున కొనుగోలు చేసి వినియోగదారులకు కిలో రూ.50లకే విక్రయిస్తున్నాం. ధరలు తగ్గేవరకూ రైతుబజార్లలో సబ్సిడీ టమాటా కౌంటర్లు కొనసాగిస్తాం. – రాహుల్ పాండే, కమిషనర్, ఏపీ మార్కెటింగ్ శాఖ -
ప్రమాదకర ప్లాస్టిక్ రహిత విశాఖ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు
-
తక్కువ రేటుకు టమాటా
సాక్షి, అమరావతి: ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రైతు బజార్ల ద్వారా సరసమైన ధరకు టమాటా విక్రయాలకు శ్రీకారం చుట్టింది. శుక్రవారమే రాష్ట్రవ్యాప్తంగా 47 రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు చేపట్టింది. మిగిలిన రైతుబజార్లలో శనివారం నుంచి తక్కువ ధరకు టమాటా విక్రయించనుంది. బహిరంగ మార్కెట్ కంటే రూ.10 నుంచి రూ.15 వరకు తక్కువ ధరకే ఇక్కడ అమ్ముతున్నారు. దీంతో రైతు బజార్లలో వినియోగదారులు బారులు తీరారు. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో టమాటా కిలో రూ.60 నుంచి రూ.85 వరకు ఉంది. పొరుగు రాష్ట్రంలో కిలో రూ.100కు చేరింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు రైతుబజార్ల ద్వారా సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు టమాటా విక్రయాలు చేపట్టారు. షోలాపూర్ నుంచి దిగుమతి చేసుకున్న 15 టన్నుల టమాటాను విశాఖ, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని రైతు బజార్లలో విక్రయిస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో స్థానిక రైతుల వద్ద ఉన్న నిల్వలను మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద కొనుగోలు చేసి స్థానిక రైతు బజార్లలో విక్రయిస్తున్నారు. కనిష్టంగా విజయవాడ రైతుబజార్లలో కిలో రూ.52కు అమ్ముతున్నారు. పల్నాడు, ఏలూరు జిల్లాల్లోనూ స్థానిక రైతుల నుంచి కొన్న టమాటాను అక్కడి రైతు బజార్లలో విక్రయిస్తున్నారు. మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ తదితర ప్రాంతాల నుంచి మరో 70 టన్నుల దిగుమతికి ఏర్పాట్లు చేశారు. ఇవి శుక్రవారం రాత్రికి రాష్ట్రానికి రానున్నాయి. వీటిని మిగిలిన జిల్లాల్లోని రైతు బజార్లకు తరలించి శనివారం నుంచి అందుబాటులో ఉంచనున్నారు. టమాటా ధరలపై మంత్రి కాకాణి సమీక్ష ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రైతుబజార్ల సీఈవో శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ జేడీ రాజశేఖర్, ఇతర అధికారులతో ఫోన్లో సమీక్షించారు. ధరలను అదుపులో ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా టమాటా విక్రయించాలని ఆదేశించారు. స్థానికంగా రైతుల వద్ద అందుబాటులో ఉన్న నిల్వలను కొనడంతోపాటు పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపి, అక్కడి వ్యాపారులతో సంప్రదింపులు జరపాలని సూచించారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా టమాటాను ప్రతిరోజు కొనాలని చెప్పారు. «ధరలు అదుపులోకి వచ్చే వరకు మార్కెట్‌పై నిరంతర పర్యవేక్షణ, కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై నిఘా ఉంచాలని సూచించారు. -
‘టమాటా’ రైతుకు అండగా సర్కార్
సాక్షి, అమరావతి: మంచి ధర లభించక కుదేలవుతున్న టమాటా రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. గిట్టుబాటు ధరలు దక్కక ఏ ఒక్క రైతూ నష్టపోకూడదనే ఉద్దేశంతో టమాటా ధరలు పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగి ధర తక్కువగా ఉన్నచోట మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద టమాటా కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటోంది. ఇందులో భాగంగా శనివారం చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్ యార్డులో నాణ్యతను బట్టి కిలో రూ.4 నుంచి రూ.6 చొప్పున ఐదు మెట్రిక్ టన్నుల టమాటాను కొనుగోలు చేసింది. ఇలా కొన్న టమాలను రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాయలసీమ నుంచే అధిక దిగుబడి రాష్ట్రవ్యాప్తంగా 61,571 హెక్టార్లలో టమాటా సాగవుతోంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 34,030, అనంతపురం జిల్లాలో 19,340, కర్నూలు జిల్లాలో 3,203, విశాఖపట్నం జిల్లాలో 1,260 హెక్టార్లలో, మిగిలిన జిల్లాల్లో వెయ్యిలోపు హెక్టార్లలో పండిస్తున్నారు. ఏటా 22,16,540 టన్నుల దిగుబడి వస్తుండగా.. ఇందులో రాయలసీమలోని మూడు జిల్లాల నుంచే 20,36,628 టన్నుల దిగుబడి వస్తోంది. రోజూ చిత్తూరులో 300–400 టన్నులు, అనంతపురంలో 80–100 టన్నులు, కర్నూలులో 80 టన్నులు, కడపలో 8–10 టన్నులు, విశాఖలో 30–50 టన్నుల టమాటా మార్కెట్‌కు వస్తోంది. చిత్తూరు మినహా మిగిలిన జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.600 నుంచి రూ.1,000 ధర పలుకుతోంది. వ్యాపారులతో కలిసి కొనుగోలు రాయలసీమ టమాటాకు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఏప్రిల్ నుంచి సగానికి పైగా టమాటా ఈ రాష్ట్రాలకే ఎక్కువగా ఎగుమతి అవుతుంది. ఆ మేరకు రేట్లు కూడా పెరుగుతాయి. కానీ కరోనా నేపథ్యంలో ఎగుమతుల్లేక స్థానిక మార్కెట్లో రేటు ఏమాత్రం పెరగలేదు. ఎక్కువగా దిగుబడి వచ్చే చిత్తూరులోని కొన్ని మార్కెట్ యార్డుల్లో క్వింటాల్‌కు రూ.400కు మించి పలకడం లేదు. ఈ ధర మరింత పతనమయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో సర్కార్ రంగంలోకి దిగింది. ధర పతనమైన మార్కెట్ యార్డుల్లో వ్యాపారులతో కలిసి మార్కెటింగ్ శాఖ ఈ–నామ్ (వేలం పాట)లో పాల్గొని టమాటా కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. మంచి ధర లభించేలా సర్కార్ చర్యలు ధర తక్కువగా ఉన్న ఇతర మార్కెట్ యార్డుల్లో కూడా ఇదే తరహాలో సర్కార్ జోక్యం చేసుకోనుంది. వ్యాపారులతో కలిసి వేలం పాటల్లో పాల్గొని పోటీని పెంచడం ద్వారా రైతుకు మంచి ధర వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. మిగిలిన మార్కెట్ యార్డుల్లో కూడా రోజూ టమాటా ధరలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకాధికారులను నియమిస్తోంది. కనీసం కిలోకి రూ.5 తక్కువ కాకుండా రైతుకు ధర లభించేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న ఆదేశాలు జారీ చేశారు. ఇలా కొనుగోలు చేసిన టమాటాను స్థానిక రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. -
సబ్సిడీ ఉల్లి విక్రయాలు ప్రారంభం
సాక్షి, అమరావతి/సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్)/తాడేపల్లిగూడెం: రైతు బజార్లలో సబ్సిడీపై కిలో ఉల్లిపాయలను రూ.40కే విక్రయిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. జిల్లా కేంద్రాల్లోని రైతు బజార్లలో శనివారం నుంచి.. అన్ని రైతు బజార్లలో సోమవారం నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానం రైతు బజార్లో ఉల్లి విక్రయాలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి 6 వేల క్వింటాళ్లను తెచ్చేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. గతంలోనూ రూ.60 కోట్ల భారం పడినా ప్రభుత్వమే సబ్సిడీపై ప్రజలకు అందించిందని గుర్తు చేశారు. దుకాణాల వద్ద ధరల బోర్డులు పెట్టాలని, అలా పెడుతున్నదీ లేనిదీ కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షించాలని కూడా సీఎం ఆదేశించారన్నారు. తాడేపల్లిగూడెం హోల్‌సేల్ మార్కెట్లో అధికారులు 140 టన్నులు కొనుగోలు చేశారు. కర్నూలు నుంచి వచ్చిన 2,881 బస్తాలనూ కొనుగోలు చేసి ప్రతి జిల్లాకు 10 టన్నుల చొప్పున తరలించారు. -
ఏపీలో మార్కెట్ యార్డుల్లోనూ రైతు బజార్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మార్కెట్ యార్డుల్లో శనివారం నుంచి రైతుబజార్లు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు యార్కెట్ యార్డుల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసింది. మార్కెట్ యార్డులోని గోడౌన్లు, ప్లాట్‌ఫారాలపై కూరగాయలు, పండ్లు విక్రయించేందుకు చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని 216 మార్కెట్ కమిటీల్లో 150 మార్కెట్ యార్డ్లు ఉండగా, ప్రస్తుతం ఈ యార్డుల్లో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. వ్యవసాయ యార్డ్‌కు నిత్యం 200మంది వరకూ వస్తున్నట్లు అంచనా. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలకు అనువుగా ఉండేలా ఇక్కడే కొత్త రైతుబజార్లు ఏర్పాటు చేశారు. అలాగే కూరగాయలు, పండ్లను తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. (జనతా బజార్లలో ఆక్వా ఉత్పత్తులు) అలాగే గోడౌన్లు లేని యార్డుల్లో తాత్కాలికంగా షెడ్లు వేసి అమ్మకాలు ప్రారంభించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. అలాగే తాత్కాలిక రైతు బజార్ల సంఖ్యను 417కు పెంచింది. అంతేకాకుండా మొబైల్ రైతుబజార్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. అవసరం అయిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో కూడా రైతు బజార్లు నిర్వహిస్తోంది. (కేసులు ఎక్కువున్న చోట కఠినంగా..) వంద యార్డుల గుర్తింపు రాష్ట్రంలోని 216 మార్కెట్ కమిటీల పరిధిలో 150 మార్కెట్ యార్డులు ఉన్నాయి. సౌకర్యాలున్న 100 యార్డులను అధికారులు గుర్తించారు. వాటిలో ఇవాళ్టి నుంచి అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం ఈ యార్డుల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. వీటికి రైతులు, హమాలీలు, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది కలిపి రోజుకు సగటున 200 మంది వరకు వస్తున్నట్లు అంచనా. వీరితోపాటు పరిసర ప్రాంతాల వినియోగదారులకు ఇవి ఉపయోగపడతాయి. కరోనా వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే.. ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు మార్కెట్ కమిటీల పరిధిలో ఉండే మేజర్ పంచాయతీల్లోనూ అక్కడి పరిస్థితులను బట్టి రైతు బజార్లు ఏర్పాటు కానున్నాయి. అందుబాటులోకి మొబైల్ బజార్లు కరోనా వైరస్‌కు ముందు రాష్ట్రంలో 100 రైతు బజార్లు ఉండేవి. తర్వాత తాత్కాలిక రైతు బజార్ల ఏర్పాటు ద్వారా వాటి సంఖ్యను 417కు పెంచారు. వీటికి అధిక సంఖ్యలో కొనుగోలుదారులు వ స్తుండటంతో మొబైల్ రైతు బజార్ల విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం 451 మొబైల్ రైతు బజార్లు పని చేస్తున్నాయి. ఇందు కు ఆర్టీసీ బస్సులను కూడా వాడుతున్నారు. -
మార్కెట్ యార్డుల్లోనూ రైతు బజార్లు
-
ఏపీలో కూరగాయల రవాణాకు అనుమతి
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రకటించిన లాక్‌డౌన్‌తో తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న పూలు, పండ్లు, కూరగాయలు, మిర్చి, పసుపు రైతులకు ఊరట లభించింది. ఈ పంటల రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎటువంటి ఆటంకం కలుగకుండా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు ఇచ్చే ఉత్తర్వులు కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం మరోసారి ఆదేశించింది. (లాక్డౌన్: వైరస్ కంటే మరింత ప్రమాదకరం!) లాక్డౌన్ నుంచి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లకు మినహాయింపు ఇచ్చినప్పటికీ రవాణాలో చాలా చోట్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌధురి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఉద్యాన పంటల రవాణా, ఎగుమతి, శుద్ధి, సేకరణ, రైతు బజార్లకు, స్థానిక మార్కెట్లకు తరలింపు వంటి వాటికి గతంలో మినహాయింపు ఇచ్చినా సక్రమంగా అమలు కావడంలేదని, మరోసారి జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు ఇస్తూ ఈ మినహాయింపులు అమలయ్యేలా చూడాలని కోరారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆమోదం తెలిపాయి. దీంతో జిల్లాలలో వ్యవసాయ ఉత్పత్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ చిరంజీవి చౌధురి జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు. (కరోనాతో యుద్ధం : ప్రభుత్వానికి సహకరించండి) లేఖలో అంశాలు.. ► రాష్ట్రంలో రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి పండ్లు, కూరగాయలు సేకరించి రవాణా చేసుకునేందుకు ఐఎన్ఐ ఫారమ్స్, దేశాయ్ ఫ్రూట్స్, ఐటీసీ ఇండియా లిమిటెడ్, మహీంద్రా, జైన్ ఇరిగేషన్ ఇండియా లిమిటెడ్, నింజా కార్ట్ తదితర సంస్థలకు అనుమతి ► రాష్ట్ర వ్యాప్తంగా మామిడి కాయల సేకరణ, ఎగుమతులకు అనుమతి ఇచ్చి పచ్చి సరుకు చెడిపోకుండా చూడాలి ► చిత్తూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఇతర జిల్లాలలో పండ్లు, కూరగాయల శుద్ధి పరిశ్రమలకు అనుమతి ► గుంటూరు, కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు జిల్లాలతో పాటు పాడేరు ప్రాంతంలో మిర్చి, పసుపు సేకరణ, రవాణాకు అనుమతి ► కర్నూలు, ప్రకాశం జిల్లాలలో విత్తన శుద్ధి పరిశ్రమలకు అనుమతి ఇచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటే రవాణాకు అనుమతించాలి. ► ఖరీఫ్ సీజన్‌కు టిష్యూ కల్చర్ ప్లాంటింగ్ మెటీరియల్‌కు, సూక్ష్మనీటి పారుదల సామగ్రి రవాణాకు అనుమతించాలి. మొబైల్ రైతు బజార్లుగా సిటీ బస్సులు లాక్డౌన్ నేపథ్యంలో ప్రజల చెంతకే కూరగాయలను తీసుకెళ్లేందుకు నగరాల్లో సిటీ బస్సుల్ని మొబైల్ రైతు బజార్లుగా తిప్పాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం 200 బస్సులు కావాలని మార్కెటింగ్, ఉద్యాన శాఖ, మున్సిపల్ శాఖలు ఆర్టీసీకి ప్రతిపాదనలు పంపించాయి. ప్రయోగాత్మకంగా విజయవాడలో ఐదు సిటీ బస్సులను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వినియోగించుకుని ఒక్క రోజులో పది క్వింటాళ్ల కూరగాయలు అమ్మారు. ఈ విధానం విజయవంతం కావడంతో విశాఖ, తిరుపతి, గుంటూరు తదితర నగరాల్లో కూడా ఇదే విధంగా సిటీ బస్సునే ప్రాంతాల వారీ తిప్పుతూ కూరగాయలను అమ్మితే ప్రజల్ని రోడ్లపైకి తిరగనివ్వకుండా కట్టడి చేయవచ్చని అధికార యంత్రాంగం భావిస్తోంది. జిల్లాల వారీగా ఎన్ని బస్సులు కేటాయించాలనే అంశంపై ఈ నెల 6న ఆర్టీసీ అధికారులు, మార్కెటింగ్, ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం కానున్నారని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్పారు. రైతులకు అనుమతి పత్రాలు.. పూలు, పండ్లు, కూరగాయల సాగు రైతులు ఎవరైనా స్థానిక మార్కెట్లలో తమ ఉత్పత్తులు అమ్ముకోవాలనుకుంటే తమ శాఖ అధికారులు అనుమతి పత్రాలు, పాస్‌లు అందజేస్తారని ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఏ పంట అమ్ముకోవాలనుకుంటున్నారో తెలిపితే తమ అధికారులే తోటల వద్దకు వెళ్లి పాస్‌లు ఇస్తారని, దీనివల్ల రవాణాకు ఎటువంటి ఆటంకం ఉండదని వివరించారు. జొన్న, మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం రాష్ట్రంలో 3.64 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, 1.50 లక్షల మెట్రిక్ టన్నుల జొన్నలు కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదనరెడ్డి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. శుక్రవారం (నిన్న) నుంచి జూన్ 16 వరకు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. ► రైతుల నుంచి వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు, మార్కెటింగ్ సొసైటీలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో ఈ పంటను కొనుగోలు చేసేందుకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ► మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.1,760, హైబ్రిడ్ జొన్నకు రూ.2,550ని మద్దతు ధరగా నిర్ణయించినట్టు తెలిపారు. -
దేశమంతట్లోకి ఏపీలోనే తక్కువ ధర
-
ఇక మార్కెట్ యార్డుల్లోనూ ఉల్లి
రైతు బజార్లలో ఇవాళ ఇంత క్యూలు ఉన్నాయంటే దానికి కారణం వినియోగదారులు హెరిటేజ్ షాపుల్లో కిలో రూ.200 పెట్టి కొనుక్కోలేక పోవడమే. రైతు బజార్లలో రూ.25కే కిలో ఉల్లిపాయలు అందిస్తున్నాం కనుకే జనం క్యూ కడుతున్నారు. ఈ విషయాలేవీ చంద్రబాబుకు అర్థం కావు. శవాల మీద రాజకీయం చేసే రకం. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ప్రజలు ఇక్కట్లు పడకుండా రైతు బజార్లలో కిలో రూ.25 చొప్పున విక్రయాలు కొనసాగిస్తూనే వచ్చే శుక్రవారం నుంచి మార్కెట్ యార్డులలోనూ ఉల్లిగడ్డలను అమ్మిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్నదే తమ ధ్యేయమని, అందుకోసం ఎంత ఖర్చయినా పర్వాలేదన్నారు. ఈనెల 12, 13 తేదీలలో విదేశాల నుంచి ఉల్లిగడ్డలు ముంబయి పోర్టుకు రానున్నాయని, వాటిల్లోనూ మన రాష్ట్రానికే అత్యధికంగా కేటాయించాలని ఇండెంట్ పెట్టామన్నారు. ఉల్లిపై మంగళవారం రాష్ట్ర శాసనసభలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయం చెప్పారు. ఉల్లిపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం బాధనిపిస్తోందన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏపీలోనే తక్కువ ధర ‘దేశంలో ఉల్లిని తక్కువ ధరకు విక్రయిస్తున్న రాష్ట్రాలలో నంబర్ వన్ రాష్ట్రం మనదే. బిహార్‌లో కిలో ఉల్లి రూ.35, పశ్చిమ బెంగాల్లో రూ.59, తెలంగాణలో రూ.40, తమిళనాడులో రూ.35–40 మధ్య, మధ్యప్రదేశ్‌లో రూ.50 చొప్పున పరిమితమైన సరుకు అమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కిలో రూ.25 చొప్పున విక్రయిస్తున్నాం. తెలంగాణలో ఒకే ఒక్క రైతుబజార్లో 25 టన్నులు, తమిళనాడులో 50 టన్నులు కన్నా తక్కువగా విక్రయించారు. బిహార్‌లో నవంబర్ 22 నుంచి 28 వరకు అమ్మకాలు జరిగాయి. పశ్చిమ బెంగాల్లో ఇవాల్టి (మంగళవారం) నుంచి అమ్ముతారని సమాచారం. మహారాష్ట్రలో ఇంకా మొదలు కాలేదు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటున్న ఉల్లిపాయల్లో అత్యధికంగా 2,100 మెట్రిక్ టన్నులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఈ సరుకు ఈనెల 12, 13 తేదీల్లో ముంబయికి రాబోతోంది. ప్రజలకు మంచి చేసే సమయంలో ఎలాంటి జాప్యం, లోపం చూపించాల్సిన అవసరం లేదని, కాస్త దూకుడు(అగ్రెసివ్)గా ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించాం. రైతు బజార్లలోనే కాకుండా వచ్చే శుక్రవారం నుంచి మార్కెట్ యార్డుల్లోనూ సబ్సిడీపై ఉల్లిపాయల అమ్మకం ప్రారంభిస్తాం. దేశంలో మరెక్కడా కూడా ఈ స్థాయిలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. అయినా ప్రతిపక్షం రాజకీయం చేస్తోంది. ఇది ధర్మమేనా? వాళ్లు గుండెల మీద చేయి వేసుకుని మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. కొరత ఉన్నా ఇబ్బంది పడకుండా చూస్తున్నాం : మోపిదేవి మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు ఉల్లిపై చర్చను ప్రారంభిస్తూ.. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ మధ్య నుంచి కొరత ప్రారంభమైందన్నారు. డిసెంబర్ మొదటి వారానికి హోల్‌సేల్ మార్కెట్లలో కిలో ఉల్లి రూ.100–130 మధ్య పలికిందని, ప్రస్తుతం రూ.80–100 మధ్య ఉందన్నారు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం వల్ల దిగుబడి తక్కువగా వచ్చిందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర తదితర ఉల్లి సాగు చేసే రాష్ట్రాలలో పంట నష్టం జరిగిందని వివరించారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి సూచన మేరకు కిలో రూ.25కే వినియోగదారులకు సరఫరా చేస్తున్నామన్నారు. కర్నూలు, తాడేపల్లిగూడెం, హైదరాబాద్, షోలాపూర్, అల్వార్ మార్కెట్ల నుంచి ఉల్లిపాయలు తెప్పించామని తెలిపారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకోకుండా ప్రతిపక్షం దుర్బుద్ధితో విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు. ప్రతిదీ రాజకీయమేనా బాబూ?: కన్నబాబు కిలో ఉల్లికి వంద రూపాయల సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? అని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు విపక్షాన్ని ప్రశ్నించారు. రాజకీయాన్ని వ్యవసాయానికి ముడిపెట్టవద్దని చంద్రబాబుకు హితవు పలికారు. ప్రతిదాన్నీ రాజకీయం చేయాలని చూడడం బాబు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. మహిళల భద్రతపై చర్చ జరుగుతుంటే సమయం, సందర్భం చూడకుండా శవం బొమ్మలతో ఉల్లిదండలు వేసుకుని వచ్చి ఆటంకం సృష్టిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో ఓ వ్యక్తి సహజ మరణాన్ని తన రాజకీయ స్వార్థం కోసం వినియోగించుకోవడాన్ని ఆక్షేపించారు. చంద్రబాబు సోమవారం సభలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, సభను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంలో చంద్రబాబు, మంత్రి కొడాలి నాని మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం టీడీపీ సభ్యురాలు భవాని చర్చలో పాల్గొంటూ రేషన్ డిపోలలోనూ ఉల్లిని విక్రయించాలని, గ్రామ వలంటీర్లతో ఇంటింటికీ సరఫరా చేయించాలన్నారు. ముందే గుర్తించి చర్యలు : పార్థసారధి అతివృష్టి, అనావృష్టి కారణంగా దేశంలో ఉల్లి కొరత ఏర్పడితే అదేదో మన రాష్ట్రం ఒక్కదానికే పరిమితమైన సమస్యగా విపక్షం చిత్రీకరిస్తోందని ఎమ్మెల్యే పార్థసారధి విమర్శించారు. సమస్య తీవ్రతను తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు నెలల ముందే గుర్తించి మార్కెట్లో జోక్యం చేసుకోండని అధికారులను ఆదేశించారన్నారు. ముందు చూపుతో వ్యవహరించినందు వల్లే ప్రజలకు ఇబ్బంది లేకుండా సరుకు తెప్పించి కిలో రూ.25కు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఇవేవీ పట్టించుకోకుండా సహజ మరణాలను కూడా ఉల్లి మరణాలుగా చిత్రీకరిస్తూ ప్రతిపక్షం శవ రాజకీయం చేస్తోందని విమర్శించారు. జగన్ మోహన్‌రెడ్డి రైతు పక్షపాతి కాగా, చంద్రబాబు రైతు వ్యతిరేకన్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తుంటే ఓర్వలేక బాబు విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. దళారులను నిలువరించిన ఘనత జగన్‌దేనని వివరించారు. డాక్టర్ వైఎస్సార్ పాలనలో రైతుకు జరిగిన మేలును ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
ఉల్లి ధర తగ్గుతోంది
కర్నూలు (అగ్రికల్చర్)/ఒంగోలు సబర్బన్: ఉల్లి ధరల జోరు క్రమంగా తగ్గుతోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాల్‌కు ఉల్లి గరిష్ట ధర శనివారం రూ.9,300 ఉండగా.. ఆదివారం రూ.9,150కి తగ్గింది. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాలకు ఉల్లి ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించటం, ఇతర చర్యల కారణంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కర్నూలు మార్కెట్లో రోజుకు 100 నుంచి 150 టన్నుల వరకు ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేసి రాయలసీమతోపాటు ప్రకాశం జిల్లాకు సరఫరా చేస్తోంది. తాడేపల్లిగూడెం మార్కెట్ నుంచి ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలకు సరఫరా చేస్తోంది. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో కొనుగోలు చేసిన ఉల్లిని మిగిలిన జిల్లాలకు సరఫరా చేస్తోంది. రైతు బజార్లకు పోటెత్తుతున్న ప్రజలు ఉల్లిపాయల కోసం ప్రజలు ఆశ్రయిస్తుండటంతో రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లు కిటకిటలాడుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.160కి చేరింది. రైతు బజార్ల ద్వారా రూ.25కే విక్రయిస్తుండటంతో వాటిని తీసుకునేందుకు జనం పోటెత్తుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఒంగోలులోని రైతు బజార్ల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనుగోలుదారులు బారులు తీరారు. -
ఉల్లి ఎగుమతులకు బ్రేక్!
సాక్షి, అమరావతి, కర్నూలు (అగ్రికల్చర్) : వ్యాపార రిజిస్ట్రేషన్, వాహనాలకు సరైన పత్రాలు లేకుండా ఉల్లి ఎగుమతి చేస్తున్న 20 లారీలను శుక్రవారం ఉదయం రాష్ట్ర సరిహద్దుల వద్ద అధికారులు నిలిపివేశారు. దీంతో ఉల్లి విక్రయాలకు ప్రధాన మార్కెట్లైన కర్నూలు, తాడేపల్లిగూడెంలో వ్యాపారులు శుక్రవారం లావాదేవీలను ఆకస్మికంగా బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడంతో దాదాపు 1,800 క్వింటాళ్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వ్యాపారులతో చర్చించిన మార్కెటింగ్‌శాఖ కమిషనర్ ప్రద్యుమ్న సమస్య పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ఉల్లిలో సగం మాత్రమే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోవచ్చని, మిగిలింది ఇక్కడే విక్రయించాలని సూచించారు. ఈ ప్రతిపాదనకు వ్యాపారులు సానుకూలంగా స్పందించారని, శనివారం నుంచి ఉల్లి కొనుగోళ్లు యథాతథంగా జరుగుతాయని చెప్పారు. రాజస్ధాన్ నుంచి కూడా ఉల్లి దిగుమతి చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్వింటాల్ గరిష్టంగా రూ. 12,400 కర్నూలు మార్కెట్లో ఉదయం తొలుత అరగంట పాటు వేలంపాట నిర్వహించి 20 లాట్ల వరకు కొనుగోలు చేయగా క్వింటాల్ గరిష్టంగా రూ.12,400 పలికింది. సరిహద్దుల్లో ఉల్లి లారీలను నిలిపివేశారనే సమాచారంతో తర్వాత వేలంపాటను ఆపేశారు. విజిలెన్స్ ఏడీ వెంకటేశ్వర్లు తదితరులు మార్కెట్ యార్డుకు చేరుకుని ఉల్లి కొనుగోళ్లను పరిశీలించారు. రాష్ట్రంలో ఉల్లి కొరతను పరిష్కరించి ప్రజల సమస్యలు నివారించేందుకు మార్కెటింగ్‌శాఖ వ్యాపారులతో పోటీపడి మార్కెట్లకు వస్తున్న ఉల్లిని రైతుల నుంచి కొనుగోలు చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఈ సీజన్లో కిలో రూ.45 నుంచి రూ.130 (గరిష్ట ధర) వరకు కొనుగోలు చేసి రాయితీపై కిలో రూ.25 చొప్పున రైతుబజార్లలో విక్రయిస్తోంది. సెప్టెంబరు 27 నుంచి డిసెంబరు 5వతేదీ వరకు 25,000 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసింది. ధరల స్ధిరీకరణ నిధిని ఈ సమస్య పరిష్కారానికి వినియోగిస్తోంది. కర్నూలు మార్కెట్లో 8 మంది వ్యాపారులు ఈ సీజన్లో ఇప్పటివరకు 2,02,262 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేయగా 1,75,808 క్వింటాళ్లను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పేర్కొంది. -
అక్రమ వ్యాపారం.. కృత్రిమ కొరత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యాపారులు తమ లాభం కోసం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుండటంతో ఉల్లి ధరలు దిగిరావడం లేదు. ఉల్లి ధరల మంటకు గల కారణాలను గుర్తించడానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ చేపట్టింది. ఉల్లి వ్యాపారం అధికంగా జరిగే కర్నూలు, తాడేపల్లిగూడెం మార్కెట్లలో క్రయవిక్రయాలు, గత మూడేళ్లుగా ఉల్లి దిగుబడులు.. తదితర అంశాలను పరిశీలించగా, విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గత రెండేళ్ల కంటే ఈ ఏడాది ఉల్లి దిగుబడి అధికంగా వచ్చినా.. వ్యాపారులు తమ కమిషన్ కోసం ఉల్లిని ఇతర రాష్ట్రాల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీనికితోడు కొంత సరుకును నల్లబజారుకు తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఈసారి దిగుబడి అధికంగా ఉన్నప్పటికీ మార్కెట్లో ఉల్లి దొరక్కపోవడానికి వ్యాపారుల అక్రమాలే కారణమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై మెరుపు దాడులు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలోని అంశాలు.. - రాష్ట్రంలో రోజుకు 8–9 వేల క్వింటాళ్ల ఉల్లి అవసరం. నవంబరులో కర్నూలు రకం ఉల్లి ప్రధాన మార్కెట్లకు 3.83 లక్షల క్వింటాళ్లు వచ్చింది. ఇందులో దాదాపు 40 శాతం.. అంటే 1.60 లక్షల క్వింటాళ్ల ఉల్లి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయింది. మిగిలిన 2.23 లక్షల క్వింటాళ్ల ఉల్లి నిల్వలు 13 జిల్లాల్లోని వినియోగదారులకు సరిపోతాయి. - అయినప్పటికీ ట్రేడర్లు/ఏజెంట్లు కృత్రిమ కొరత సృష్టించారు. తమకు వచ్చే 4 శాతం కమిషన్ కోసం ఇక్కడి ఉల్లిని ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు. మన రాష్ట్రంలో పండిన పంట ఇతర రాష్ట్రాలకు చేరుతుండడంతో స్థానికంగా ఉల్లి కొరత కొనసాగుతోంది. రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత మిగులు సరుకును మాత్రమే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తే ఉల్లి కొరత ఉండదు. - ఉల్లి కొరత తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం గత పదిహేను రోజులుగా ఉల్లిని కొనుగోలు చేసి, రైతుబజార్ల ద్వారా కిలో రూ.25 చొప్పున విక్రయిస్తోంది. కర్నూలు మార్కెట్లో కిలో రూ.65 చొప్పున కొనుగోలు చేసి రైతుబజార్లలో రాయితీపై వినియోగదారులకు అమ్ముతోంది. ధరల స్ధిరీకరణ నిధి ద్వారా ఈ భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. సబ్సిడీ ఉల్లి అమ్మకాల వల్ల ఇప్పటివరకు రూ.4.50 కోట్ల ఆర్థిక భారం ప్రభుత్వంపై పడింది. దీనికితోడు ఈజిప్టు నుంచి ఉల్లిపాయల కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
టమాటా ధర పైపైకి!
సాక్షి, హైదరాబాద్: టమాటా ధరలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. ఇటీవల కాస్త తగ్గిన ధరలు మళ్లీ చుక్కలనంటుతున్నాయి. రాష్ట్రంలో సాగు తగ్గడం, పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి లేకపోవడంతో కిలో ధర రూ.30 పలుకుతోంది. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 15–20 రోజుల క్రితం టమాటా ధర కిలో రూ.10 వరకే పలికింది. రైతుబజార్లో కిలో రూ.5 నుంచి రూ.8 వరకు ఉంది. రాష్ట్రంలో అధికంగా సాగు చేసే మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో సాగు తగ్గిపోయింది. ఈ జిల్లాల్లో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాల్లో భారీ క్షీణత ఏర్పడింది. దీంతో ఈ జిల్లాల నుంచి మార్కెట్లోకి టమాటా రావడం లేదు. దీంతో ఏపీలోని మదనపల్లి నుంచి, కర్ణాటకలోని కొలార్, చిక్మగళూర్ల నుంచి దిగుమతి అయ్యే టమాటాలపై ఆధారపడాల్సి వస్తోంది. అక్కడి నుంచి సైతం దిగుబడి తగ్గింది. మదనపల్లె మార్కెట్లో టమాటా ధరలు కొన్ని రోజులుగా పుంజుకున్నాయి. పదిరోజుల కిందట అత్యల్పంగా కిలో ధర రూ.4 నుంచి అత్యధికంగా రూ.10 వరకు మాత్రమే పలికింది. దిగుబడి తగ్గడంతోపాటు సీజన్ ప్రారంభం కావడంతో టమాటా మార్కెట్‌కు 100 టన్నుల నుంచి 140 టన్నుల వరకే వస్తోంది. డిమాండ్ పెరుగుతున్న కారణంగా మదనపల్లె టమాటా ధర పుంజుకుంటుంది. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన టమాటా కిలో రూ.22 వరకు పలుకుతోంది. ఈ ప్రభావం మన రాష్ట్రంపై పడుతోంది. ఈ నెల 29న పొరుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ మార్కెట్‌కు 1,510 క్వింటాళ్లు టమాటా రాగా, సోమవారం కేవలం 884 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం రైతుబజార్లోనే టమాటా కిలో ధర రూ.24 పలకగా, బహిరంగ మార్కెట్లో కిలో ధర రూ.30కి చేరింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరగాల్సిన అవసరం ఉంది. గత ఏడాది ఇదే సమయంలో రాజస్థాన్ నుంచి పెద్ద సంఖ్యలో టమాటా రాష్ట్ర మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం అక్కడి నుంచి రావడం లేదు. ఈ దిగుమతులు పెరిగితే ధరలు కొంత తగ్గే అవకాశం ఉంటుందని, లేని పక్షంలో మరో 3 నెలలపాటు ధరల్లో పెరుగుదల తప్పదని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. -
తెలుగు తమ్ముళ్ల బరితెగింపు!
సాక్షి, పశ్చిమ గోదావరి : ఏలూరులో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఏలూరు వన్ టౌన్ రైతుబజార్ రహదారి వద్ద షాపు నిర్మాణం చేపట్టారు. అనుమతులు లేకుండా కడుతున్న షాపును రైతు బజార్ ఈవో శ్రీలత అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు తమకు ఎమ్మెల్యే అనుమతి ఇచ్చారని ఈవో పై దౌర్జన్యానికి దిగారు. తాము ఎమ్మెల్యే బడేటి మనుషులం అంటూ వాగ్వాదానికి దిగారు. తమకు మార్కెట్ యార్డ్ చైర్మన్ నిరంజన్ అనుమతులిచ్చారని ఆక్రమణదారులు తెలిపారు. ప్రభుత్వ స్ధలాన్ని ఎలా కబ్జా చేస్తారని శ్రీలత ప్రశ్నించారు. గతంలోనూ ఏలూరు పత్తేబాద రైతుబజార్‌ను ఆక్రమించారు. రైతుబజార్ లో కూరగాయల ధరలను అధికారులు కాకుండా ఎమ్మెల్యే బడేటి వియ్యంకుడు నిర్ణయించడాన్ని అడ్డుకోవడంతో పాటు పత్తేబాద ఆక్రమణలను అడ్డుకున్న శ్రీలతను ఎమ్మెల్యే బదిలీ చేయించారు. తాజాగా వన్ టౌన్ రైతు బజార్‌ను సైతం ఎమ్మెల్యె మనుషుల ఆక్రమించారు. -
రాజన్న రైతు బజార్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్కే
-
ఉల్లి కోసం బారులు
నెల్లూరు : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ ఇప్పుడు ఆ ఉల్లి కొనాలంటే మాత్రం సామాన్యుల కళ్ల నుంచి నీళ్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఉల్లి అంతగా ఘాటెక్కింది. కాగా సామాన్యునికి అందుబాటులో రూ. 20 లకే కిలో ఉల్లిగడ్డలు పంపిణీ జరుగుతుండటంతో.. శనివారం నెల్లూరు రైతుబజార్ ముందు పట్టణవాసులు బారులు తీరారు. మార్కెట్లో రూ. 45 నుంచి రూ.70 వరకు అమ్ముడవుతుండగా.. రైతు బజార్లో రూ. 20 కే పంపిణీ జరుగుతుండటంతో శనివారం ప్రజలు ఉల్లి కొనుగోళ్లకు పోటెత్తారు. -
'సాక్షి' కథనానికి పరిటాల సునీత స్పందన
కాకినాడ : తుని మార్కెట్ యార్డ్‌లో బినామీ పేర్లతో టీడీపీ నేతల షాపులకు సంబంధించి సాక్షి టీవీ కథనానికి పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత స్పందించారు. రైతు బజార్లలో అక్రమాలపై చర్యలు తీసుకుంటామని ఆమె శనివారమిక్కడ అన్నారు. దళారులు చేతుల్లో ఉన్న షాపులను తిరిగి రైతులకు అప్పగిస్తామని పరిటాల సునీత తెలిపారు. తుని మార్కెట్లో జరిగిన అక్రమాలు తన దృష్టికి వచ్చాయని, దీనిపై విచారణ జరిపిస్తామని ఆమె పేర్కొన్నారు. కాగా కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లు తునిలో తెలుగు తమ్ముళ్లు రైతు బజార్లను కూడా వదిలి పెట్టలేదు. ఏకంగా రైతు బజారుకు 'రాపేటి సూరిబాబు రైతు బజారు' అని బోర్డు పెట్టి మరీ తమ దందా సాగించటం విశేషం. దీనిపై సాక్షి టీవీ ఓ కథనం ప్రసారం చేసింది. -
‘దళారీ’బజార్
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం రైతుబజార్లో దళారులు రాజ్యమేలుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన కూరగాయలు, ఆకుకూరలను అమ్ముకునే రైతులకు ఇక్కడ స్థానం లేకుండా పోతోంది. తక్కువ ధరలకే తాజా కూరగాయలు ైరెతులకు అందించాలనే లక్ష్యంతో నగర నడిబొడ్డున ఏర్పాటు చేసిన రైతుబజార్ దళారుల మూలంగా బేజార్ అవుతోంది. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడిచి కొంతమంది దళారులు అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో రైతుబజార్లో పాగావేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మం అర్బన్, రూరల్ మండలాలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు ఉపాధి పొందాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ బజార్‌ను పూర్తిగా దళారులు చేతుల్లోకి తీసుకున్నారు. వ్యాపారులు, దళారులు హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ నుంచి సరుకును కొనుగోలు చేసి రైతుబజార్లో అమ్ముతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. రైతులకు మాత్రమే అవకాశం ఇక్కడ కూరగాయల విక్రయాలు జరుపుకునే అవకాశం కేవలం రైతులకు మాత్రమే ఉంది. అనుమతిపొందిన డ్వాక్రా గ్రూపులు కూడా ఇక్కడ అమ్ముకోవచ్చు. ఇక్కడ కూరగాయలు అమ్మేది రైతులా? కాదా? అనే విషయాన్ని ఉద్యానవనశాఖ, రెవెన్యూశాఖల అధికారులు ధ్రువీకరించాల్సి ఉం టుంది. సంబంధిత శాఖ ల అధికారులు క్షేత్ర పర్యటనకు కూడా వెళ్లాలి. రైతుబజార్లలో అమ్మకాలు జరుపుతున్న రైతులందరూ కూరగాయలు పండిస్తున్నారో..లేదో ధ్రువీకరించాలి. సంబంధిత రైతులకు గుర్తింపుకార్డులు ఇచ్చి రైతుబజార్లో కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకునే అవకాశం కల్పించాలి. కానీ ఈ నిబంధనలేవి ఇక్కడి రైతుబజార్లో అమలు కావడం లేదని తెలుస్తోంది. రైతుల పేరుతో కొందరు కూరగాయలు తెచ్చి అమ్ముతుండగా, మరికొందరు వ్యాపారులు నేరుగానే సరుకును హోల్‌సేల్‌గా కొనుక్కు వచ్చి అమ్ముతున్నారు. ధరల నియంత్రణ లేదు నిబంధనల ప్రకారం హోల్‌సేల్ మార్కెట్ రేటుకన్నా 25 శాతం ఎక్కువ, రిటైల్ ధరల కన్నా 25 శాతం తక్కువకు రైతుబజారు లో రైతులు సరుకును అమ్మాలి. కానీ ఆ నిబంధన ఇక్కడ అమలుకావడం లేదు. వ్యాపారులు సిండికేటై తాము నిర్ణయిం చుకున్న ధరలకే అమ్మకాలు జరుపుతున్నారు. అవే ధరలను బోర్డుపైనా రాయిస్తున్నారు. ఇదేమని వినియోగదారులు ప్రశ్నిస్తే అంతా ఏకమై తిరగబడుతున్నారు. ధరల విషయంలోనూ అధికారుల నియంత్రణ లేకపోవడమే దీనికంతటికీ కారణమని వినియోగదారులు అంటున్నారు. నిబంధనలో లోపాలను ఆస రా చేసుకుని దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎటువంటి అనుమతిలేకపోయినా సరుకును రైతుబజార్‌కు తెచ్చి అమ్ముతున్నారు. కొందరు రైతుబజార్లో దుకాణ స్థలాలను సొంత జాగీరులా ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని అంటున్నారు. రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఉంటే ఇటువంటి సమస్య వచ్చి ఉండేదికాదని చెబుతున్నారు. చర్యలకు పూనుకోని ప్రభుత్వశాఖలు రైతుబజార్ ఏర్పాటు లక్ష్యం నీరుగారిపోతున్నా దాని నిర్వహణలో భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వశాఖలు ఎటువంటి చర్యలకు పూనుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రైతుబజార్లో ఎటువంటి సమస్య ఏర్పడినా, గొడవలు జరిగినా అధికారులు వెళ్లి తాత్కాలికంగా పరిష్కరించి వస్తున్నారే తప్ప శాశ్వ త పరిష్కారం చూపటంలేదని రైతులు విమర్శిస్తున్నారు. జిల్లా జా యింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ పర్యవేక్షణలో నిర్వహిం చే ఈ రైతుబజార్ బాధ్యతలను జిల్లా మార్కెటింగ్‌శాఖ డెరైక్టర్ కోట చౌదరిరెడ్డి చూస్తున్నారు. ఒకవైపు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం..మరోవైపు ఉద్యాన, రెవెన్యూశాఖల నిర్లక్ష్యంతోనే రైతుబజార్ బేజారవుతోందనే విమర్శలు వస్తున్నాయి.