ఏపీలో కూరగాయల రవాణాకు అనుమతి | AP lockdown:Transportation of vegetables allowed | Sakshi
Sakshi News home page

ఏపీలో కూరగాయల రవాణాకు అనుమతి

Published Sat, Apr 4 2020 1:38 PM | Last Updated on Sat, Apr 4 2020 1:46 PM

AP lockdown:Transportation of vegetables allowed - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ప్రకటించిన లాక్‌డౌన్‌తో తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న పూలు, పండ్లు, కూరగాయలు, మిర్చి, పసుపు రైతులకు ఊరట లభించింది. ఈ పంటల రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎటువంటి ఆటంకం కలుగకుండా వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు ఇచ్చే ఉత్తర్వులు కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం మరోసారి ఆదేశించింది. (లాక్డౌన్: వైరస్ కంటే మరింత ప్రమాదకరం!)

లాక్‌డౌన్‌ నుంచి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లకు మినహాయింపు ఇచ్చినప్పటికీ రవాణాలో చాలా చోట్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యాన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌధురి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఉద్యాన పంటల రవాణా, ఎగుమతి, శుద్ధి, సేకరణ, రైతు బజార్లకు, స్థానిక మార్కెట్లకు తరలింపు వంటి వాటికి గతంలో మినహాయింపు ఇచ్చినా సక్రమంగా అమలు కావడంలేదని, మరోసారి జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు ఇస్తూ ఈ మినహాయింపులు అమలయ్యేలా చూడాలని కోరారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆమోదం తెలిపాయి. దీంతో జిల్లాలలో వ్యవసాయ ఉత్పత్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ చిరంజీవి చౌధురి జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు. (కరోనాతో యుద్ధం : ప్రభుత్వానికి సహకరించండి)

లేఖలో అంశాలు..
► రాష్ట్రంలో రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి పండ్లు, కూరగాయలు సేకరించి రవాణా చేసుకునేందుకు ఐఎన్‌ఐ ఫారమ్స్‌, దేశాయ్‌ ఫ్రూట్స్, ఐటీసీ ఇండియా లిమిటెడ్, మహీంద్రా, జైన్‌ ఇరిగేషన్‌ ఇండియా లిమిటెడ్, నింజా కార్ట్‌ తదితర సంస్థలకు అనుమతి

► రాష్ట్ర వ్యాప్తంగా మామిడి కాయల సేకరణ, ఎగుమతులకు అనుమతి ఇచ్చి పచ్చి సరుకు చెడిపోకుండా చూడాలి

► చిత్తూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఇతర జిల్లాలలో పండ్లు, కూరగాయల శుద్ధి పరిశ్రమలకు అనుమతి 

► గుంటూరు, కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు జిల్లాలతో పాటు పాడేరు ప్రాంతంలో మిర్చి, పసుపు సేకరణ, రవాణాకు అనుమతి

► కర్నూలు, ప్రకాశం జిల్లాలలో విత్తన శుద్ధి పరిశ్రమలకు అనుమతి ఇచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటే రవాణాకు అనుమతించాలి.

► ఖరీఫ్‌ సీజన్‌కు టిష్యూ కల్చర్‌ ప్లాంటింగ్‌ మెటీరియల్‌కు, సూక్ష్మనీటి పారుదల సామగ్రి రవాణాకు అనుమతించాలి.

మొబైల్‌ రైతు బజార్లుగా సిటీ బస్సులు
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజల చెంతకే కూరగాయలను తీసుకెళ్లేందుకు నగరాల్లో సిటీ బస్సుల్ని మొబైల్‌ రైతు బజార్లుగా తిప్పాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం 200 బస్సులు కావాలని మార్కెటింగ్, ఉద్యాన శాఖ, మున్సిపల్‌ శాఖలు ఆర్టీసీకి ప్రతిపాదనలు పంపించాయి. ప్రయోగాత్మకంగా విజయవాడలో ఐదు సిటీ బస్సులను మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వినియోగించుకుని ఒక్క రోజులో పది క్వింటాళ్ల కూరగాయలు అమ్మారు. ఈ విధానం విజయవంతం కావడంతో విశాఖ, తిరుపతి, గుంటూరు తదితర నగరాల్లో కూడా ఇదే విధంగా సిటీ బస్సునే ప్రాంతాల వారీ తిప్పుతూ కూరగాయలను అమ్మితే ప్రజల్ని రోడ్లపైకి తిరగనివ్వకుండా కట్టడి చేయవచ్చని అధికార యంత్రాంగం భావిస్తోంది. జిల్లాల వారీగా ఎన్ని బస్సులు కేటాయించాలనే అంశంపై ఈ నెల 6న ఆర్టీసీ అధికారులు, మార్కెటింగ్, ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం కానున్నారని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్పారు.

రైతులకు అనుమతి పత్రాలు..
పూలు, పండ్లు, కూరగాయల సాగు రైతులు ఎవరైనా స్థానిక మార్కెట్లలో తమ ఉత్పత్తులు అమ్ముకోవాలనుకుంటే తమ శాఖ అధికారులు అనుమతి పత్రాలు, పాస్‌లు అందజేస్తారని ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఏ పంట అమ్ముకోవాలనుకుంటున్నారో తెలిపితే తమ అధికారులే తోటల వద్దకు వెళ్లి పాస్‌లు ఇస్తారని, దీనివల్ల రవాణాకు ఎటువంటి ఆటంకం ఉండదని వివరించారు. 

జొన్న, మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రంలో 3.64 లక్షల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న, 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల జొన్నలు కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదనరెడ్డి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. శుక్రవారం (నిన్న) నుంచి జూన్‌ 16 వరకు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు.

► రైతుల నుంచి వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు, మార్కెటింగ్‌ సొసైటీలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో ఈ పంటను కొనుగోలు చేసేందుకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

► మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.1,760, హైబ్రిడ్‌ జొన్నకు రూ.2,550ని మద్దతు ధరగా నిర్ణయించినట్టు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement