ఉపాధి హామీ మేట్‌లకు అవార్డులను అందజేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సాక్షి, అమరావతి: కరోనా కష్ట సమయంలో రాష్ట్ర ఆదాయ వనరులు తగ్గినా పేదల అభివృద్ధికి ప్రభుత్వం మునుపటి కన్నా ఎంతో ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేస్తూ, మీట నొక్కి నేరుగా మహిళా లబ్ధిదారుల ఖాతాలకే సొమ్ము జమచేస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో క్షేత్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా మేట్ (గ్రామాల్లో పనులకు కావాల్సిన కూలీలను సమీకరించే వారు)లకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం మంగళవారం అవార్డులు అందజేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో నూరుశాతం మేట్లుగా మహిళలే బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాష్ట్రం మనదేనని చెప్పారు.
నిజాయితీ, బాధ్యతాయుతంగా పనిచేసే మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం నిర్ణయంలో భాగంగా ఉపాధి హామీలో మేట్లుగా మహిళలకే ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.13 లక్షలమంది మహిళలు మేట్లుగా ఉపాధి హామీ పథకానికి కీలకమైన స్థానంలో ఉండి పనిచేస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా 91 లక్షల జాబ్ కార్డులు ఉంటే అందులో 64 లక్షల మంది మహిళలే ఉన్నారని చెప్పారు. మహిళా మేట్లపై నమ్మకంతో ఎక్కువమంది ఉపాధి హామీ పనులకు వస్తున్నారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 22 కోట్ల పనిదినాల పాటు పేదలకు ప్రభుత్వం పనులు కల్పించినట్టు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం అన్ని రంగాల్లోను ప్రాధాన్యత కల్పించిందని చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ తనకు ఇద్దరు ఆడపిల్లలున్నందుకు తండ్రిగా గర్వపడుతున్నానని స్వయంగా చెప్పడం మహిళల పట్ల ఆయనకు ఉన్న గౌరవం, నమ్మకాన్ని చాటుతున్నాయన్నారు. తమ ప్రభుత్వం ఆర్థిక, సంక్షేమ పథకాలను మహిళల ద్వారానే ప్రతి కుటుంబానికి అందిస్తోందని గుర్తుచేశారు.
స్కోచ్ అవార్డుల్లో గ్రామీణాభివృద్ధి శాఖకే ప్రథమ స్థానం
జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరుకు ఇచ్చే స్కోచ్ అవార్డులు గత ఏడాది మనకు మూడు వచ్చాయని తెలిపారు. తాజాగా ప్రకటించిన స్కోచ్ అవార్డుల్లోను ఏపీకి మొదటిస్థానం దక్కిందని, అందులోను గ్రామీణాభివృద్ధి శాఖ ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఇదంతా ఈ శాఖలో భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులందరి కృషికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment