ఉల్లి ఎగుమతులకు బ్రేక్‌! | Break to Onion Exports | Sakshi
Sakshi News home page

ఉల్లి ఎగుమతులకు బ్రేక్‌!

Published Sat, Dec 7 2019 4:51 AM | Last Updated on Sat, Dec 7 2019 5:22 AM

Break to Onion Exports - Sakshi

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌యార్డులో కొనుగోళ్లు బంద్‌ కావడంతో నిలిచిపోయిన ఉల్లి

సాక్షి, అమరావతి, కర్నూలు (అగ్రికల్చర్‌) : వ్యాపార రిజిస్ట్రేషన్, వాహనాలకు సరైన పత్రాలు లేకుండా ఉల్లి ఎగుమతి చేస్తున్న 20 లారీలను శుక్రవారం ఉదయం రాష్ట్ర సరిహద్దుల వద్ద అధికారులు నిలిపివేశారు. దీంతో ఉల్లి విక్రయాలకు ప్రధాన మార్కెట్లైన కర్నూలు, తాడేపల్లిగూడెంలో వ్యాపారులు శుక్రవారం లావాదేవీలను ఆకస్మికంగా బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడంతో దాదాపు 1,800 క్వింటాళ్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వ్యాపారులతో చర్చించిన మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న సమస్య పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ఉల్లిలో సగం మాత్రమే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోవచ్చని, మిగిలింది ఇక్కడే విక్రయించాలని సూచించారు. ఈ ప్రతిపాదనకు వ్యాపారులు సానుకూలంగా స్పందించారని, శనివారం నుంచి ఉల్లి కొనుగోళ్లు యథాతథంగా జరుగుతాయని చెప్పారు. రాజస్ధాన్‌ నుంచి కూడా ఉల్లి దిగుమతి చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

క్వింటాల్‌ గరిష్టంగా రూ. 12,400 
కర్నూలు మార్కెట్‌లో ఉదయం తొలుత అరగంట పాటు వేలంపాట నిర్వహించి 20 లాట్ల వరకు కొనుగోలు చేయగా క్వింటాల్‌ గరిష్టంగా రూ.12,400 పలికింది. సరిహద్దుల్లో ఉల్లి లారీలను నిలిపివేశారనే సమాచారంతో తర్వాత వేలంపాటను ఆపేశారు. విజిలెన్స్‌ ఏడీ వెంకటేశ్వర్లు తదితరులు మార్కెట్‌ యార్డుకు చేరుకుని ఉల్లి కొనుగోళ్లను పరిశీలించారు. రాష్ట్రంలో ఉల్లి కొరతను పరిష్కరించి ప్రజల సమస్యలు నివారించేందుకు మార్కెటింగ్‌శాఖ వ్యాపారులతో పోటీపడి మార్కెట్లకు వస్తున్న ఉల్లిని రైతుల నుంచి కొనుగోలు చేస్తోంది. 

ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల మేరకు ఈ సీజన్‌లో కిలో రూ.45 నుంచి రూ.130 (గరిష్ట ధర) వరకు కొనుగోలు చేసి రాయితీపై కిలో రూ.25 చొప్పున రైతుబజార్లలో విక్రయిస్తోంది. సెప్టెంబరు 27 నుంచి డిసెంబరు 5వతేదీ వరకు 25,000 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసింది. ధరల స్ధిరీకరణ నిధిని ఈ సమస్య పరిష్కారానికి 
వినియోగిస్తోంది. 

కర్నూలు మార్కెట్లో 8 మంది వ్యాపారులు ఈ సీజన్‌లో ఇప్పటివరకు 2,02,262 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేయగా 1,75,808 క్వింటాళ్లను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement