kurnool market yard
-
AP: ఈనామ్ బిడ్డింగ్‌లో మనదే రికార్డ్..
సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈనామ్) బిడ్డింగ్‌లలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. రికార్డుస్థాయిలో వ్యాపార లావాదేవీలు నిర్వహించడమే కాదు బిడ్డింగ్ల్లో కూడా రికార్డులు తిరగరాస్తోంది. కోటి బిడ్డింగ్లతో ఆదోని మార్కెట్ యార్డు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 45.63 లక్షల బిడ్స్‌తో కర్నూలు యార్డు రెండోస్థానంలో ఉంది. 2017–18లో ప్రారంభమైన ఈనామ్ దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా మండీ (మార్కెట్ యార్డు)ల్లో అమలవుతోంది. మన రాష్ట్రంలో 33 యార్డులు ఈనామ్ పరిధిలో ఉన్నాయి. రాష్ట్రంలో 14.49 లక్షలమంది రైతులు, 3,532 మంది వ్యాపారులు, 2,302 మంది ఏజెంట్లు ఈనామ్‌లో రిజిస్టరయ్యారు. 203 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా ఈనామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర పరిధిలో రూ.35 వేలకోట్ల విలువైన 58.74 లక్షల టన్నుల క్రయవిక్రయాలు ఈనామ్ ద్వారా జరిగాయి. ప్రధానంగా మిరప, పత్తి, పసుపు, నిమ్మ, టమాటా, బెల్లం, ఆముదం, ఉల్లి, వివిధరకాల పండ్లు, కూరగాయలను జాతీయస్థాయిలో రైతులు అమ్ముకుంటున్నారు. నాణ్యత పరీక్ష యంత్రాల ద్వారా ర్యాండమ్‌గా లాట్స్ నాణ్యతను పరీక్షించి ఆన్లైన్లోనే పరిమాణంతో సహా ప్రదర్శిస్తారు. విక్రయించిన రైతుల ఖాతాల్లో సొమ్ము నేరుగా జమ అవుతోంది. ఆదోని యార్డు పరిధిలో ఇప్పటివరకు రూ.3,607.28 కోట్ల క్రయవిక్రయాలు ఆదోని యార్డు పరిధిలో మూడులక్షల మంది రైతులు, 503 మంది వ్యాపారులు, 429 మంది కమీషన్ ఏజెంట్లు ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా పత్తి, వేరుశనగ, ఆముదం, పూలవిత్తనాల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఆదోని పరిధిలో 50కి పైగా స్పిన్నింగ్ మిల్స్ ఉండడంతో వ్యాపారులు ఆదోని మార్కెట్ యార్డులో ఈనామ్ టెండర్లో పాల్గొని పత్తికి పోటీపడి బిడ్డింగ్‌లు నమోదు చేస్తుంటారు. ఈనామ్ ప్రారంభించినప్పటి నుంచి నేటివరకు రాష్ట్రంలో ఈనామ్ పరిధిలో ఉన్న 33 మార్కెట్ యార్డుల్లో 64.29 లక్షల లాట్స్ మార్కెట్‌కు వచ్చాయి. వీటిలో ఒక్క ఆదోనిలోనే 11.34 లక్షల లాట్స్ ఉన్నాయి. ఈ సరుకు కోసం 300 మంది వ్యాపారులు పోటీపడగా, కోటి బిడ్డింగ్‌లు నమోదయ్యాయి. అత్యధికంగా 2020–21లో 2.26 లక్షల లాట్స్ కోసం 18.39 లక్షల బిడ్డింగ్స్ నమోదయ్యాయి. యార్డు పరిధిలో ఇప్పటివరకు రూ.3,607.28 కోట్ల విలువైన 6.97లక్షల టన్నుల వ్యవసాయోత్పత్తుల క్రయవిక్రయాలు జరిగాయి. రెండో స్థానంలో నిలిచిన కర్నూలు ఏఎంసీలో ఇప్పటివరకు 45.63 లక్షల బిడ్స్ నమోదయ్యాయి. ఈ యార్డు పరిధిలో రూ.1,536 కోట్ల విలువైన 3.89 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరిగాయి. దేశంలో మూడోస్థానంలో నిలిచిన రాజస్థాన్‌లోని కోట మండీలో 36 లక్షల బిడ్స్ నమోదయ్యాయి. అరుదైన రికార్డు కోటి బిడ్డింగ్‌లను అధిగమించడం అరుదైన రికార్డు. అనతికాలంలోనే ఈ ఫీట్‌ను సాధించిన తొలి యార్డుగా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో యార్డు పరిధిలో కల్పించిన మౌలిక వసతుల వలన పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోంది. రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుండడంతోపాటు వ్యాపారులకు నాణ్యమైన సరుకు లభిస్తోంది. – బి.శ్రీకాంత్‌రెడ్డి, కార్యదర్శి, ఆదోని మార్కెట్ యార్డు -
మిర్చి అ‘ధర’హో !
కర్నూలు(అగ్రికల్చర్): మిర్చి ధర పరుగులు తీస్తున్నది. మంగళవారం కర్నూలు మార్కెట్‌కు 207 మంది రైతులు 295 క్వింటాళ్ల ఎండుమిర్చి తీసుకొచ్చారు. కనిష్ట ధర రూ.4,119, గరిష్ట ధర రూ.37,112, మోడల్ ధర రూ.18,009గా నమోదు అయ్యింది. కర్నూలు మార్కెట్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ.37,112 ధర లభించడం విశేషం. ఈ నెల 24న మార్కెట్లో గరిష్ట ధర రూ.33,102 లభించింది. మూడు రోజుల్లోనే క్వింటాలుపై రూ.4,010 పెరగడం విశేషం. జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 1.25 లక్షల ఎకరాల్లో ఎండుమిర్చి సాగయింది. కర్నూలు మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఈ నెల 24న మార్కెట్‌కు 135 క్వింటాళ్లు మాత్రమే రాగా.. ఈ నెల 27న 295 క్వింటాళ్ల మిర్చి వచ్చింది. -
ఉల్లి విక్రయాలకు తొలగిన అడ్డంకి
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి క్రయవిక్రయాల్లో గత నెల 17 నుంచి నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. యార్డులో నెలకొన్న సమస్యలు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి చొరవతో పరిష్కారమయ్యాయి. మార్కెట్‌కు ఉల్లిగడ్డలు తెప్పించేందుకు, ఈ–నామ్ అమలుకు కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు అంగీకరించారు. దీంతో ఈ నెల 11 నుంచి కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి సహా అన్ని రకాల పంటల కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయి. కొత్తగా మినుములు, కొర్రలను కూడా కొనుగోలు చేసే సదుపాయాన్ని మార్కెట్ కమిటీ కల్పించింది. శనివారం ఉదయం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులతో సమావేశమయ్యారు. ఉల్లి క్రయవిక్రయాల్లో మరింత పారదర్శకతను పెంపొందించేందుకు, వ్యాపారుల మధ్య పోటీ ఉండటం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం ఉల్లికి కూడా ఈ–నామ్ అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు విధిగా కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సహకరించకపోతే కొత్త కమీషన్ ఏజెంట్లు, కొత్త వ్యాపారులను రంగంలోకి దింపి ఉల్లి సహా అన్ని పంటలను ఈ–నామ్లో కొనుగోలు చేసే ఏర్పాట్లు చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో దిగివచ్చిన కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు ఈ నెల 11 నుంచి తాము కూడా ఈ–నామ్లో కొంటామని సంసిద్ధత వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి, వైఎస్సార్సీపీ నాయకుడు శ్రీధర్‌రెడ్డి, కమీషన్ ఏజెంట్ల సంఘం నేతలు కట్టా శేఖర్, శ్రీనివాసరెడ్డి, జూటూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి ధర తగ్గుతోంది
కర్నూలు (అగ్రికల్చర్)/ఒంగోలు సబర్బన్: ఉల్లి ధరల జోరు క్రమంగా తగ్గుతోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాల్‌కు ఉల్లి గరిష్ట ధర శనివారం రూ.9,300 ఉండగా.. ఆదివారం రూ.9,150కి తగ్గింది. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాలకు ఉల్లి ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించటం, ఇతర చర్యల కారణంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కర్నూలు మార్కెట్లో రోజుకు 100 నుంచి 150 టన్నుల వరకు ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేసి రాయలసీమతోపాటు ప్రకాశం జిల్లాకు సరఫరా చేస్తోంది. తాడేపల్లిగూడెం మార్కెట్ నుంచి ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలకు సరఫరా చేస్తోంది. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో కొనుగోలు చేసిన ఉల్లిని మిగిలిన జిల్లాలకు సరఫరా చేస్తోంది. రైతు బజార్లకు పోటెత్తుతున్న ప్రజలు ఉల్లిపాయల కోసం ప్రజలు ఆశ్రయిస్తుండటంతో రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లు కిటకిటలాడుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.160కి చేరింది. రైతు బజార్ల ద్వారా రూ.25కే విక్రయిస్తుండటంతో వాటిని తీసుకునేందుకు జనం పోటెత్తుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఒంగోలులోని రైతు బజార్ల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనుగోలుదారులు బారులు తీరారు. -
ఉల్లి ఎగుమతులకు బ్రేక్!
సాక్షి, అమరావతి, కర్నూలు (అగ్రికల్చర్) : వ్యాపార రిజిస్ట్రేషన్, వాహనాలకు సరైన పత్రాలు లేకుండా ఉల్లి ఎగుమతి చేస్తున్న 20 లారీలను శుక్రవారం ఉదయం రాష్ట్ర సరిహద్దుల వద్ద అధికారులు నిలిపివేశారు. దీంతో ఉల్లి విక్రయాలకు ప్రధాన మార్కెట్లైన కర్నూలు, తాడేపల్లిగూడెంలో వ్యాపారులు శుక్రవారం లావాదేవీలను ఆకస్మికంగా బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడంతో దాదాపు 1,800 క్వింటాళ్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వ్యాపారులతో చర్చించిన మార్కెటింగ్‌శాఖ కమిషనర్ ప్రద్యుమ్న సమస్య పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ఉల్లిలో సగం మాత్రమే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోవచ్చని, మిగిలింది ఇక్కడే విక్రయించాలని సూచించారు. ఈ ప్రతిపాదనకు వ్యాపారులు సానుకూలంగా స్పందించారని, శనివారం నుంచి ఉల్లి కొనుగోళ్లు యథాతథంగా జరుగుతాయని చెప్పారు. రాజస్ధాన్ నుంచి కూడా ఉల్లి దిగుమతి చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్వింటాల్ గరిష్టంగా రూ. 12,400 కర్నూలు మార్కెట్లో ఉదయం తొలుత అరగంట పాటు వేలంపాట నిర్వహించి 20 లాట్ల వరకు కొనుగోలు చేయగా క్వింటాల్ గరిష్టంగా రూ.12,400 పలికింది. సరిహద్దుల్లో ఉల్లి లారీలను నిలిపివేశారనే సమాచారంతో తర్వాత వేలంపాటను ఆపేశారు. విజిలెన్స్ ఏడీ వెంకటేశ్వర్లు తదితరులు మార్కెట్ యార్డుకు చేరుకుని ఉల్లి కొనుగోళ్లను పరిశీలించారు. రాష్ట్రంలో ఉల్లి కొరతను పరిష్కరించి ప్రజల సమస్యలు నివారించేందుకు మార్కెటింగ్‌శాఖ వ్యాపారులతో పోటీపడి మార్కెట్లకు వస్తున్న ఉల్లిని రైతుల నుంచి కొనుగోలు చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఈ సీజన్లో కిలో రూ.45 నుంచి రూ.130 (గరిష్ట ధర) వరకు కొనుగోలు చేసి రాయితీపై కిలో రూ.25 చొప్పున రైతుబజార్లలో విక్రయిస్తోంది. సెప్టెంబరు 27 నుంచి డిసెంబరు 5వతేదీ వరకు 25,000 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసింది. ధరల స్ధిరీకరణ నిధిని ఈ సమస్య పరిష్కారానికి వినియోగిస్తోంది. కర్నూలు మార్కెట్లో 8 మంది వ్యాపారులు ఈ సీజన్లో ఇప్పటివరకు 2,02,262 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేయగా 1,75,808 క్వింటాళ్లను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పేర్కొంది. -
16 నుంచి 24 వరకు మిర్చి కొనుగోళ్లు బంద్
కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్) : కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోఈనెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మిర్చి కొనుగోళ్లను బంద్ చేస్తున్నట్లు మార్కెట్ యార్డు కార్యదర్శి శివరామకృష్ణ శాస్త్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవంగా 13వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మిర్చి కొనుగోళ్లను నిలిపివేస్తామని కమీషన్ ఏజెంట్లు పట్టుపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమీషన్ ఏజెంట్లను, వ్యాపారులను చర్చలకు పిలిపించి ఒప్పందం కుదిర్చారు. పక్షం రోజుల పాటు కాకుండా వారం రోజుల వరకు కొనుగోళ్లు బంద్ చేయవచ్చన్నారు. ఈ మేరకు మార్కెట్ యార్డు శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రకటన జారీ చేశారు. ప్రకటించిన రోజుల్లో మిర్చిని యార్డుకు తీసుకురావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. -
మిర్చి కొనుగోలు చేయలేం!
– కర్నూలు మార్కెట్లో చేతులెత్తేసిన వ్యాపారులు – మార్కెట్ కమిటీ అధికారులో కలెక్టర్ సమీక్ష కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర ప్రభుత్వం మిర్చికి క్వింటాకు రూ.1500 మద్దతు ధర ప్రకటించి.. కర్నూలు మార్కెట్ యార్డులో కూడా కొనుగోళ్లు జరపాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కర్నూలు మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలు చేయలేమని వ్యాపారులు చేతులెత్తేశారు. శనివారం..మార్కెట్ కమిటీ అధికారులు, కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులతో జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తన చాంబరులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్కెట్లో కొనుగోళ్లు జరిపేందుకు సహకరించాలని వ్యాపారులకు సూచించారు. అయితే కర్నూలు మార్కెట్‌కు వస్తున్న మిర్చిలో నాణ్యత లేదని, ప్రభుత్వం రూ.1500 మద్దతు ప్రకటించిన నేపథ్యంలో కొనుగోళ్లు జరుపడం సాధ్యం కాదని వ్యాపారులు పేర్కొన్నారు. తాము తొమ్మిది మందిమి ఉన్నామని.. స్థానిక అవసరాలకు అనుగుణంగా మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నామని, వేలాది క్వింటాళ్లు అయితే తమకు చేతకాదని చేతులెత్తేశారు. మార్కెట్ కమిటీ సెక్రటరీ శాస్త్రీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కలెక్టర్ స్పందిస్తూ కర్నూలు మార్కెట్ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకపోతామని, అక్కడి నుంచి వచ్చే స్పందనను బట్టి తర్వాత నిర్ణయం తీసుకుందామని తెలిపారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి, కమిషన్ ఏజెంట్ల అసోషియేషన్ నేతలు కట్టా శేఖర్, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
రేపటి నుంచి మిర్చి కొనుగోళ్లు బంద్
- ఏప్రిల్ 9 వరకు ఇదే పరిస్థితి - నగదు కొరతే కారణం కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): రైతులు ఎవరూ మిర్చిని కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు తీసుకురావద్దని, శుక్రవారం 24వ తేదీ నుంచి కొనుగోళ్లు బంద్ చేస్తున్నామని యార్డు కార్యదర్శి శివరామకృష్ణ శాస్త్రి తెలిపారు. బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు మిర్చి కొనుగోళ్లు ఉండబోవని పేర్కొన్నారు. మార్చి మాసాంతంలో బ్యాంకుల నుంచి నగదు తీసుకోలేకపోతున్నామని కర్నూలు కమిషన్ మండి మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు అభ్యర్థించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. అమవాస్యతోపాటు ఉగాది, శ్రీరామనవమి పర్వదినాలు కలిసి రావడంతో పక్షం రోజుల పాటు మిర్చి కొనుగోళ్లను నిలుపుదల చేసినట్లు తెలిపారు. నగదు కొరతతో కలుగుతున్న అసౌకర్యానికి రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దిక్కుతోచని స్థితిలో రైతులు.. ఇప్పటికే యార్డుకు మిర్చిని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రకృతి వైపరిత్యాల కారణంగా ఆశించిన దిగుబడి రాకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో వారు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. కొనుగోళ్లు కూడా బంద్ కావడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షం రోజులపాటు దిగుబడిని ఎలా కాపాడుకోవాలనే సంశయం వారిని వెన్నాడుతోంది. -
ధర మురిగి.. గుండె పగిలి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఉల్లి రైతు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. గత ఏడాది మురిపించిన ఈ పంట.. ప్రస్తుతం కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలతో అధిక శాతం దిగుబడులు పొలాల్లోనే మురిగిపోగా.. మిగిలిన సరుకు మార్కెట్లో విక్రయానికి పెట్టగా అనామత్ కొనుగోళ్ల రూపంలో ధర వెక్కిరిస్తోంది. ఇదే సమయంలో వ్యాపారులు.. హమాలీలు.. లారీ ఓనర్లు.. ట్రాన్స్పోర్టర్ల మధ్య వివాదాలతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధికారులకు తెలిసినా అప్పటికప్పుడు హెచ్చరికలు చేసి వదిలేయడం పరిపాటిగా మారింది. ఫలితంగా రేయింబవళ్లు కష్టించినా.. మార్కెట్లో ఎదురవుతున్న పరిస్థితులతో మట్టి మనిషి చివరకు తనువు చాలించే పరిస్థితి నెలకొంది. ఖరీఫ్‌లో ఉల్లి సాధారణ సాగు 16,904 హెక్టార్లు కాగా.. 20,161 హెక్టార్లలో సాగయింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా అతి కష్టం మీద పంటలను గట్టెక్కించారు. సాధారణంగా దిగుబడలు తగ్గినప్పుడు ధర పెరగాల్సి ఉండగా.. ప్రస్తుత పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రోజురోజుకు ధర తగ్గుముఖం పడుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే సమయంలో లారీ ఓనర్ల అసోసియేషన్, లారీ ట్రాన్స్‌పోర్టు(బ్రోకర్లు) అసోసియేషన్ల మధ్య వివాదం చెలరేగడం వారికి శాపంగా మారింది. మార్కెట్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లి రవాణాకు తమ లారీలనే వినియోగించాలని ఓనర్లు బ్రోకర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. బాడుగ అడిగినంత ఇవ్వాలనే డిమాండ్ విధించారు. దీంతో కొద్ది రోజుల పాటు వ్యాపారులు ఉల్లి కొనుగోళ్లు నిలిపేశారు. సమస్య పరిష్కారానికి అధికారులు, వ్యాపారులు ఓ కమిటీ వేసి మార్కెట్ ధరలకు అనుగుణంగా బాడుగలు నిర్ణయించేలా తీర్మానించారు. అయితే అమలుకు నోచుకోలేదు. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు హమాలీలు, వ్యాపారుల మధ్య కూలి విషయంలో భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ పరిణామం కూడా ఉల్లి రైతుపై ప్రభావం చూపింది. కొంప ముంచుతున్న అనామత్ వ్యాపారం ఉల్లి విక్రయాలకు తాడేపల్లిగూడెం తర్వాత కర్నూలు మార్కెట్‌యార్డు రాయలసీమ, మహబూబ్‌నగర్, ప్రకాశం జిల్లాలకు ఏకైక దిక్కు. ఇక్కడ అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా వ్యాపారుల తీరు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. అనామత్ కొనుగోళ్ల కారణంగా రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ప్రస్తుతం క్వింటాకు రూ.1500 నుంచి రూ.2వేల ధర లభిస్తేనే రైతుకు గిట్టుబాటవుతుంది. అయితే వ్యాపారులు కుమ్మక్కై క్వింటా రూ.800లకు మించి కొనుగోలు చేయకపోవడం రైతులను ఆత్మహత్యలకు ఉసిగొలుపుతోంది. నిబంధనల ప్రకారం వేలంలో కొనుగోలు చేయాల్సి ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు. మధ్యాహ్నం వరకు నామమాత్రంగా వేలంలో కొనుగోలు చేస్తూ.. ఆ తర్వాత షరామామూలుగా అనామత్ వ్యాపారం సాగిస్తున్నారు. జిల్లా అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. వానొస్తే అంతే సంగతి కర్నూలు మార్కెట్ యార్డుకు కొద్ది రోజులుగా ఉల్లి దిగుబడి భారీగా వస్తోంది. అయితే అవసరమైనన్ని షెడ్లు లేకపోవడంతో ఆరుబయటే ఉంచాల్సి వస్తోంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దిగుబడులు తడిసి ముద్దవుతున్నాయి. ఇలాంటి సరుకు ధర సగానికి పడిపోతోంది. ఇదే సమయంలో పందికొక్కుల బెడద నష్టాన్ని రెట్టింపు చేస్తోంది.