రేపటి నుంచి మిర్చి కొనుగోళ్లు బంద్
రేపటి నుంచి మిర్చి కొనుగోళ్లు బంద్
Published Wed, Mar 22 2017 9:53 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
- ఏప్రిల్ 9 వరకు ఇదే పరిస్థితి
- నగదు కొరతే కారణం
కర్నూలు (వైఎస్‌ఆర్ సర్కిల్): రైతులు ఎవరూ మిర్చిని కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు తీసుకురావద్దని, శుక్రవారం 24వ తేదీ నుంచి కొనుగోళ్లు బంద్ చేస్తున్నామని యార్డు కార్యదర్శి శివరామకృష్ణ శాస్త్రి తెలిపారు. బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు మిర్చి కొనుగోళ్లు ఉండబోవని పేర్కొన్నారు. మార్చి మాసాంతంలో బ్యాంకుల నుంచి నగదు తీసుకోలేకపోతున్నామని కర్నూలు కమిషన్ మండి మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు అభ్యర్థించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. అమవాస్యతోపాటు ఉగాది, శ్రీరామనవమి పర్వదినాలు కలిసి రావడంతో పక్షం రోజుల పాటు మిర్చి కొనుగోళ్లను నిలుపుదల చేసినట్లు తెలిపారు. నగదు కొరతతో కలుగుతున్న అసౌకర్యానికి రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
దిక్కుతోచని స్థితిలో రైతులు..
ఇప్పటికే యార్డుకు మిర్చిని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రకృతి వైపరిత్యాల కారణంగా ఆశించిన దిగుబడి రాకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో వారు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. కొనుగోళ్లు కూడా బంద్ కావడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షం రోజులపాటు దిగుబడిని ఎలా కాపాడుకోవాలనే సంశయం వారిని వెన్నాడుతోంది.
Advertisement