ధర.. కన్నీటి ధార.. | Mirchi farmer's condition is very bad | Sakshi
Sakshi News home page

ధర.. కన్నీటి ధార..

Published Tue, May 9 2017 11:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

ధర.. కన్నీటి ధార.. - Sakshi

ధర.. కన్నీటి ధార..

► దిగజారుతున్న ధరలు
► దయనీయంగా మిర్చి రైతు స్థితి
► ఖాతాల్లోకి రాని ‘రాయితీ’ సొమ్ము
► వ్యాపారులకే అండగా నిలుస్తున్న మంత్రి
► రైతుకు ప్రయోజనం కలిగే చర్యలు శూన్యం


మిర్చి రైతులను ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోంది. ధరల పతనానికి కారకులైన వ్యాపారులపై గానీ.. యార్డు సిబ్బందిపై గానీ ఇంతవరకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. మద్దతు ధరపై ఆశలు వదులుకున్న రైతులు ప్రభుత్వం ఇచ్చే రాయితీ కోసం ఎదురుచూస్తున్నారు. అన్నదాతల ఖాతాల్లో రాయితీ సొమ్ము పడేందుకు తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిని నిరోధించేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఎప్పుడో ఖాతాలో పడే రాయితీ కోసం ఎదురుచూడటం దండగ.. వచ్చినకాడికి అమ్ముకుపొండని వే మన్‌లు, కమీషన్‌ ఏజెంట్లు రైతులను మభ్యపెడుతున్నారు.

సాక్షి, అమరావతి బ్యూరో : మిర్చి రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. ధరల పతనాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వ పెద్దలు సమీక్షలతో సరిపెడుతుండటంతో ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో తేజ రకం.. క్వింటా రూ.11,200 పలుకగా.. ప్రస్తుతం రూ.2000–2500కు దిగజారిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సాధారణ రకం మిర్చి సైతం ప్రారంభంలో క్వింటా రూ.8000 పలుకగా ప్రస్తుతం క్వింటా రూ.1500కు పడిపోయింది. ఇబ్బడిముబ్బడిగా సరుకు వచ్చిందన్న సాకు చూపి ధరలు తగ్గిస్తున్నా మార్కెటింగ్‌ శాఖ చోద్యం చూస్తోంది. భారీగా ధరలుపతనం అవుతున్నా ఇంతవరకు వ్యాపారులపై గానీ, మార్కెటింగ్‌ సిబ్బందిపై గానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

అపోహలు సృష్టిస్తున్న వ్యాపారులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు రూ.1500 పథకంపై వ్యాపారులు అపోహలు సృష్టించి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. క్వింటా రూ.2000 పైన కొనుగోలు చేసిన మిర్చికి ఈ పథకం వర్తించదని వ్యాపారులు రైతులను మభ్యపెడుతున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. పథకం కింద అమ్ముకుంటే డబ్బులు వచ్చేందుకు ఎక్కువ సమయం పడుతుందని.. వే మన్‌లు, కమీషన్‌ ఏజెంట్లు, గుమాస్తాలు రైతులను భయపెడుతున్నట్లు సమాచారం. ఖాతాలో డబ్బులు వేయడం ఇదంతా ఎందుకు, వచ్చిన కాడికి డబ్బులు తీసుకుపోవాలని వ్యాపారులు చెబుతున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొండను తవ్వి.. ఎలుకను పట్టారు..
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న క్వింటా రూ.1500 పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ కావటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రైతులకు ఇబ్బంది కలుగకుండా, మార్కెట్‌ యార్డు చుట్టూ తిరగకుండా ఐడీఎఫ్‌సీ బ్యాంకు అధికారులతో కలిసి మార్కెటింగ్‌ అధికారులు గత పది రోజులుగా కసరత్తు చేసి ఆధార్‌ ఆధారంగా కమీషన్‌ ఏజెంట్లు వారి పేరుతో ఖాతాలు ఏర్పాటు చేసుకుని, సొమ్మును రైతు ఖాతాల్లో వేయగానే ప్రభుత్వ రాయితీ పడేలా సీఎం కోర్‌ డ్యాష్‌ బోర్డుకు అనుసంధానం చేశారు. ట్రేడింగ్‌ అకౌంట్‌ ద్వారానే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని, వ్యక్తిగతంగా ఖాతాల ద్వారా డబ్బు చెల్లిస్తే ఆదాయపన్ను ఇబ్బందులు తలెత్తుతాయని కమీషన్‌ ఏజెంట్ల సంఘం నాయకుడు సాంబిరెడ్డి, సుధాకర్‌ గట్టిగా వాదించారు.

మంత్రి పుల్లారావు సైతం వ్యాపారులకు దన్నుగా నిలవడంతో పదిరోజుల నుంచి చేసిన హంగామా ఎందుకూ పనికిరాకుండా పోయింది. జిల్లాలో పలు మార్కెట్ల పరిధిలో రైతుల పేరుతో పన్ను కట్టకుండా జీరో వ్యాపారం చేస్తున్నారని, తాము అలా చేయడం లేదని, దీంతో నష్టపోవాల్సి వస్తోందని పలువురు వ్యాపారులు మంత్రి దృష్టికి తెచ్చారు. రైతులకు లారీ బాడుగలు, ఖర్చులు, పెట్టుబడులకు డబ్బులు ఇచ్చామని, రైతుల ఖాతాల్లో వేస్తే తమ డబ్బులు ఎలా వస్తాయని పలువురు పేర్కొన్నారు.

ప్రభుత్వానికి మైలేజీ వచ్చేలా చూడాలి: మంత్రి ప్రత్తిపాటి
ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, మైలేజీ వచ్చేలా చూడాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాపారులను కోరారు. గుంటూరు మిర్చి యార్డులో సోమవారం సాయంత్రం ఆయన కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు, అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల ఖాతాల్లో కమీషన్‌ ఏజెంట్లు వెంటనే డబ్బు జమ చేయాలని సూచించారు. రైతు ఖాతాల్లో డబ్బు పడితేనే ప్రభుత్వ రాయితీ సొమ్ము వస్తుంది కాబట్టి అర్థం చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వానికి మైలేజీ వచ్చేలా చూడాలని కోరారు.

పథకంపై పలువురు వ్యాపారులు దుష్ప్రచారం చేస్తున్నారని, ధరలు తగ్గిస్తున్నవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా మిర్చి కొనుగోలు ప్రారంభించిన ఐదు మార్కెట్‌ యార్డుల్లో కొనుగోలు చేస్తే పన్ను మినహాయింపు, రవాణా చార్జిల్లో రాయితీలు ఇస్తామని ప్రకటించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కృతికా శుక్లా, జేసీ–2 ముంగా వెంకటేశ్వర్లు, మార్కెట్‌ యార్డు సెక్రటరీ దివాకర్, కమీషన్‌ ఏజెంట్లు పాల్గొన్నారు.

నష్ట నివారణ చర్యలేవీ...
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీంకు సంబంధించి ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రైతుకు నష్టం జరుగుతుందని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఫైన్‌ వెరైటీ క్వాలిటీ మిర్చి క్వింటా రూ.6000కు పైగా ఉందని రైతును మభ్యపెడుతున్నారు. లక్ష టిక్కీల్లో ఏదో నామమాత్రంగా అంటే సుమారు 1000 టిక్కీల్లోపు మాత్రమే రూ.6000 ధర పలకడం గమనార్హం. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వ పథకంతో రైతులకు నష్టం జరుగుతుందని అపోహలు సృష్టిస్తోంది. అయితే హైబ్రిడ్‌ రకాల్లో సైతం ప్రస్తుతం క్వింటా ధర రూ.2500–3000 ఉంది.

సాధారణ రకాల్లో ఫైన్‌ క్వాలిటీ రకం మిర్చి సైతం క్వింటా రూ.1500 మించి ధర పలకడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాన్ని అమలు చేసి అన్ని రకాల మిర్చిని కొనుగోలు చేస్తే కొంతవరకైనా తమకు మేలు కలుగుతుందని రైతులు కోరుతున్నారు. క్వింటా మిర్చి ఉత్పత్తికి రూ.7500 అవుతుందని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపిన విషయాన్ని కొంత మంది రైతులు గుర్తు చేçస్తున్నారు. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ పథకం అమలు చేస్తే కొంత మేరకు నష్టం అయినా తగ్గుతుందని రైతులు భావిస్తున్నారు.  

భిన్నాభిప్రాయాలు లేవు: పరమేశ్వర్‌
పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ మాట్లాడుతూ... పార్టీలో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవని, 2013 ఎన్నికల్లో మాదిరిగానే వచ్చే ఏడాది కూడా కాంగ్రెస్‌ను కలిసికట్టుగా అధికారంలోకి తేవడానికి కృషిచేయాలన్నారు. కాగా కేపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకంతో పాటు పార్టీ బలోపేతం చేయడానికి,వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి ఏం చేయాలన్నదానిపై ఈ సమావేశంలో సలహాలను స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement