మార్కాపురం : సాధారణంగా వర్షం కోసం రైతులు పూజలు చేస్తుంటారు. కానీ, ప్రస్తుతం వర్షం పడితే తమకు నష్టం వస్తుందని ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, పెద్దదోర్నాల, కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట, యర్రగొండపాలెం, పుల్లలచెరువు తదితర మండలాల్లో సుమారు 18 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగుచేశారు. గ్రేడింగ్ కోసం పొలాల్లోనే మిర్చిని ఆరబోశారు. కూలీలు దొరక్క కొంత మంది రైతులు పత్తిని కూడా పొలంలోనే వదిలేశారు. మరి కొంత మంది మిరపకాయలు కోసి అమ్మేందుకు సిద్ధంగా పొలాల్లోనే ఉంచారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల నుంచి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడుతుండటంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు.
మంగళవారం సాయంత్రం మార్కాపురం ప్రాంతంలో వర్షం కురిసింది. రెండు రోజుల నుంచి సాయంత్రం వేళల్లో ఆకాశమంతా మేఘావృతమై ఉంటోంది. దీంతో వర్షం కురుస్తుందనే ఆందోళన రైతుల్లో ఏర్పడింది. మండలంలోని వేములకోట, కొట్టాలపల్లె, నికరంపల్లె, చింతగుంట్ల, తిప్పాయపాలెం, మిట్టమీదపల్లె, కొండేపల్లి, గజ్జలకొండ, రాయవరం, మొద్దులపల్లి, యాచవరం, తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం, మీర్జపేట, తాడివారిపల్లె, నాగెళ్లముడుపు, కలుజువ్వలపాడు, పెద్దారవీడు మండలంలోని పెద్దారవీడు, దేవరాజుగట్టు, తోకపల్లె, బద్వీడు చెర్లోపల్లె, పుచ్చకాయలపల్లె, తదితర గ్రామాల్లో పొలాల్లోనే మిర్చి పంట ఉంది.
క్వింటా ధర మార్కెట్‌లో రూ.5,500 నుంచి రూ.6,500 మధ్య ఉంది. కూలీలు దొరక్క కొంత మంది రైతులు పొలాల్లోనే మిర్చి పంట ఉంచా రు. వర్షం పడితే కల్లాల్లో ఆరబోసిన మిర్చికి తీవ్ర నష్టం కలుగుతుంది. బాగా ఎండిన తరువాత గిట్టుబాటు ధర ఉంటే అమ్మాలని కొంత మంది రైతులు భావిస్తున్నారు. పత్తి కూడా సుమారు వెయ్యి హెక్టార్లలో సాగుచేశారు. వర్షం పడితే పత్తి పంట తడిసి నాణ్యత తగ్గే ప్రమాదం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, కోల్డ్‌స్టోరేజీ సౌకర్యాన్ని కల్పించాలని రైతులు కోరుతున్నారు.
మొక్కజొన్న పంటను కూడా సుమారు 500 హెక్టార్లలో సాగు చేశారు. క్వింటాను సుమారు 10 వేల రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. మండలంలోని కొట్టాలపల్లె, వేములపేట, వేములకోట గ్రామాల్లో రైతులు అధికంగా మొక్కజొన్న సాగుచేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. ఈ నేపథ్యంలో మేఘాలు కమ్ముకుంటుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడూ వర్షాలు కురవాలని కోరుకునే రైతులు.. ఇప్పుడు మాత్రం కురిస్తే కష్టమే అనుకుంటూ బిక్కుబిక్కుమంటున్నారు.
కురిస్తే కష్టమే..!
Published Thu, Mar 9 2017 4:25 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement