మిర్చికి నకిలీ పురుగు
మిర్చికి నకిలీ పురుగు
Published Tue, Oct 18 2016 11:46 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
మిర్చి రైతులను నిండా ముంచిన విత్తనాలు
మొక్కలకు కానరాని పూత, కాత
ఎకరానికి రూ.25 వేల నుంచి 35 వేల పెట్టుబడి
రెక్కల కష్టం, పెట్టిన పెట్టుబడి రెండూ నేలపాలు
చేనును చెడగొడుతున్న రైతులు
ప్రత్యామ్నాయంగా అపరాల సాగు
బయ్యారం : నకిలీ విత్తనాలు మండలంలోని మిర్చి రైతులను నట్టేట ముంచాయి. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన మిర్చి పంటలను నకిలీ చీడ పట్టి పీడిస్తోంది. మిర్చి మొక్కలకు కాత, పూత లేకపోవటంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. పంటల సాగుకు మూలమైన విత్తనాల నాణ్యతపై పాలకులు దృష్టి సారించకపోవటంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో మార్కెట్లోకి వచ్చిన నకిలీ విత్తనాలు రైతులను నిండా ముంచాయి. దీంతో తాము ఎంతో ఆశతో నాటిన మొక్కలను రైతులు పుట్టెడు దుఃఖంతో పీకేస్తున్నారు. మండలంలోని బయ్యారం, కొత్తపేట గ్రామాలకు చెందిన రైతులు జీవ–801 రకం మిర్చి విత్తనాలను గంధంపల్లి, మహబూబాబాద్‌లలోని డీలర్ల వద్ద కొనుగోలు చేసి 50 ఎకరాల్లో సాగు చేశారు. పంట సాగు చేసిన నెల రోజులైనా ఏపుగా పెరిగిన మొక్కలకు పూత, కాత లేదు. తీరా ఆ సమయంలో జీవ–801 రకం విత్తనాలు నకిలీవని వ్యవసాయశాఖ ప్రకటించడంతో జీవ విత్తనాలు సాగు చేసిన రైతుల్లో ఆందోళన మొదలైంది.
అప్పటికే విత్తనం తీసుకొచ్చి నారు పోయడం నుంచి పంట సాగుతోపాటు ఎరువులు, పురుగుల మందులు, పాట్లకు ఒక్కో ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. పెట్టిన పెట్టుబడులు నష్టపోవడంతోపాటు పంటపై ఆశలు లేకపోవడంతో రైతులు నకిలీ విత్తనాలతో సాగు చేసిన మిరప పంటను కొన్ని చోట్ల పీకివేయగా మరికొన్ని చోట్ల మినుము పంట సాగు చేశారు. నకిలీ విత్తనాల మూలంగా ఒక్కో ఎకరానికి వేలాది రూపాయలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించి మరోసారి ఇలాంటి నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, రైతుసంఘాల నాయకులు కోరుతున్నారు.
పెట్టుబడులు ఇప్పించాలి
మిర్చి పంటలో మంచి విత్తనం కావాలని మా ఊరిలో ఉన్న విత్తనాల దుకాణానికి వెళితే అక్కడి వ్యాపారి జీవ రకం విత్తనం బాగా దిగుబడి వస్తుందని చెప్పాడు. అతడిపై నమ్మకంతో ఒక్కో ప్యాకెట్‌కు రూ.350 చొప్పున చెల్లించి 10 ప్యాకెట్లు కొనుగోలు చేశాను. ఆ విత్తనాలను నారు పోయగా బాగానే మొలక వచ్చింది. మొక్కలు నాటిన తర్వాత పూత, కాత లేదు. నకిలీ విత్తనాల మూలంగా ఎకరం మిర్చి పంటను నష్టపోయా. ఈ పంటకు ఎకరంకు 35 వేలు పెట్టుబడులు పెట్టా. నకిలీ విత్తనం వలన నష్టపోయిన నా లాంటి రైతులకు పెట్టిన పెట్టుబడులనైనా ఇప్పించాలి. మల్సూర్, కొత్తపేట
మిర్చి పంటను దున్నించి మినుములు వేశా
ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు సరిగా పడకపోవటంతో బావి నీళ్లతోనైనా మిర్చి పంటను సాగు చేద్దామని రెండు ఎకరాల్లో సాగు చేశా. అయితే పంట సాగు చేసిన నెల తర్వాత నాటిన మొక్కలు నకిలీ విత్తనాలని తేలటంతో చేసేది లేక సాగు చేసిన పంట మొత్తాన్ని ట్రాక్టర్‌తో దున్నించా. ప్రస్తుతం ఆ భూమిలో మినుము విత్తనాలు చల్లగా మొలిచాయి. పెట్టిన పెట్టుబడులు, చేసిన కష్టం నష్టపోవాల్సి వచ్చింది.
పోలవరపు శ్రీనివాసరావు(రైతు, బయ్యారం)
Advertisement
Advertisement