ఒంగోలు దిబ్బల రోడ్డులోని రైతుబజారు వద్ద ఉల్లిపాయల కోసం జనం బారులు
కర్నూలు (అగ్రికల్చర్)/ఒంగోలు సబర్బన్: ఉల్లి ధరల జోరు క్రమంగా తగ్గుతోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాల్‌కు ఉల్లి గరిష్ట ధర శనివారం రూ.9,300 ఉండగా.. ఆదివారం రూ.9,150కి తగ్గింది. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాలకు ఉల్లి ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించటం, ఇతర చర్యల కారణంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కర్నూలు మార్కెట్‌లో రోజుకు 100 నుంచి 150 టన్నుల వరకు ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేసి రాయలసీమతోపాటు ప్రకాశం జిల్లాకు సరఫరా చేస్తోంది. తాడేపల్లిగూడెం మార్కెట్ నుంచి ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలకు సరఫరా చేస్తోంది. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో కొనుగోలు చేసిన ఉల్లిని మిగిలిన జిల్లాలకు సరఫరా చేస్తోంది.
రైతు బజార్లకు పోటెత్తుతున్న ప్రజలు
ఉల్లిపాయల కోసం ప్రజలు ఆశ్రయిస్తుండటంతో రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లు కిటకిటలాడుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.160కి చేరింది. రైతు బజార్ల ద్వారా రూ.25కే విక్రయిస్తుండటంతో వాటిని తీసుకునేందుకు జనం పోటెత్తుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఒంగోలులోని రైతు బజార్ల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనుగోలుదారులు బారులు తీరారు.
Comments
Please login to add a commentAdd a comment