సాక్షి, అమరావతి : టమాటా ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా సబ్సిడీ రేటుకు టమాటాలను విక్రయిస్తూ వినియోగదారులకు బాసటగా నిలుస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి వీటి ధరలు రోజురోజుకూ దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే కిలో రూ.250లు దాటింది.
రాష్ట్రంలో కిలో రూ.150 ఉంది. అయినా సరే ప్రభుత్వం వెనుకాడడంలేదు. దేశంలో మరెక్కడాలేని విధంగా మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్‌లో జోక్యం చేసుకుని రైతుల నుంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తూ గత నెల 28 నుంచి కిలో రూ.50 చొప్పున సబ్సిడీపై అందిస్తోంది. ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు రైతుబజార్ల ద్వారా ఈ అమ్మకాలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటివరకు 422 టన్నుల సేకరణ
ఈ నేపథ్యంలో.. ప్రతిరోజూ రాష్ట్రంలోని వివిధ టమాటా మార్కెట్లతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం టమాటాలను సేకరిస్తోంది. ఇప్పటివరకు దాదాపు రూ.4 కోట్లు ఖర్చుచేసి 422.06 టన్నులు సేకరించింది. ప్రధాన మార్కెట్లలో వ్యాపారులతో పాటు వేలంపాటల్లో పాల్గొని రైతుల నుంచి, వ్యాపారుల నుంచి సేకరిస్తోంది. ఇలా ఇప్పటివరకు సగటున కిలో రూ.94.44 చొప్పున గరిష్టంగా కిలో రూ.110 చొప్పున కొనుగోలు చేసింది.
వీటిని రాష్ట్రవ్యాప్తంగా 103 రైతుబజార్లలో మనిషికి కిలో నుంచి రెండు కిలోల వరకు విక్రయిస్తోంది. మరోవైపు.. శుక్రవారం సగటున కిలో రూ.94.34 చొప్పున రూ.61.32 లక్షల విలువైన 65టన్నుల టమాటాలను అధికారులు సేకరించారు. వీటిలో 30 టన్నులు పలమనేరు మార్కెట్ నుంచి, 20 టన్నులు మదనపల్లి మార్కెట్ నుంచి, మరో 15 టన్నులు విజయవాడలోని రైతులు, వ్యాపారుల నుంచి కొనుగోలు చేశారు.
విశాఖ, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని రైతుబజార్లకు తరలించి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో కూడా ఇదే రీతిలో కిలో రూ.100 దాటిన సందర్భంలో రైతుల నుంచి సేకరించి సబ్సిడీపై రైతుబజార్ల ద్వారా విక్రయించారు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతుబజార్ల ద్వారా సబ్సిడీపై టమాటాను విక్రయిస్తున్నాం. ప్రభుత్వంపై ఆరి్థకంగా భారమైనప్పటికీ సగటున కిలో రూ.94.44 చొప్పున కొనుగోలు చేసి వినియోగదారులకు కిలో రూ.50లకే విక్రయిస్తున్నాం. ధరలు తగ్గేవరకూ రైతుబజార్లలో సబ్సిడీ టమాటా కౌంటర్లు కొనసాగిస్తాం. – రాహుల్ పాండే, కమిషనర్, ఏపీ మార్కెటింగ్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment