ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం రైతుబజార్‌లో దళారులు రాజ్యమేలుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన కూరగాయలు, ఆకుకూరలను అమ్ముకునే రైతులకు ఇక్కడ స్థానం లేకుండా పోతోంది. తక్కువ ధరలకే తాజా కూరగాయలు ైరెతులకు అందించాలనే లక్ష్యంతో నగర నడిబొడ్డున ఏర్పాటు చేసిన రైతుబజార్ దళారుల మూలంగా బేజార్ అవుతోంది.
ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడిచి కొంతమంది దళారులు అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో రైతుబజార్‌లో పాగావేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మం అర్బన్, రూరల్ మండలాలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు ఉపాధి పొందాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ బజార్‌ను పూర్తిగా దళారులు చేతుల్లోకి తీసుకున్నారు. వ్యాపారులు, దళారులు హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ నుంచి సరుకును కొనుగోలు చేసి రైతుబజార్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకున్న పాపాన పోవట్లేదు.
రైతులకు మాత్రమే అవకాశం
ఇక్కడ కూరగాయల విక్రయాలు జరుపుకునే అవకాశం కేవలం రైతులకు మాత్రమే ఉంది. అనుమతిపొందిన డ్వాక్రా గ్రూపులు కూడా ఇక్కడ అమ్ముకోవచ్చు. ఇక్కడ కూరగాయలు అమ్మేది రైతులా? కాదా? అనే విషయాన్ని ఉద్యానవనశాఖ, రెవెన్యూశాఖల అధికారులు ధ్రువీకరించాల్సి ఉం టుంది. సంబంధిత శాఖ ల అధికారులు క్షేత్ర పర్యటనకు కూడా వెళ్లాలి. రైతుబజార్‌లలో అమ్మకాలు జరుపుతున్న రైతులందరూ కూరగాయలు పండిస్తున్నారో..లేదో ధ్రువీకరించాలి.
సంబంధిత రైతులకు గుర్తింపుకార్డులు ఇచ్చి రైతుబజార్‌లో కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకునే అవకాశం కల్పించాలి. కానీ ఈ నిబంధనలేవి ఇక్కడి రైతుబజార్‌లో అమలు కావడం లేదని తెలుస్తోంది. రైతుల పేరుతో కొందరు కూరగాయలు తెచ్చి అమ్ముతుండగా, మరికొందరు వ్యాపారులు నేరుగానే సరుకును హోల్‌సేల్‌గా కొనుక్కు వచ్చి అమ్ముతున్నారు.
ధరల నియంత్రణ లేదు
నిబంధనల ప్రకారం హోల్‌సేల్ మార్కెట్ రేటుకన్నా 25 శాతం ఎక్కువ, రిటైల్ ధరల కన్నా 25 శాతం తక్కువకు రైతుబజారు లో రైతులు సరుకును అమ్మాలి. కానీ ఆ నిబంధన ఇక్కడ అమలుకావడం లేదు. వ్యాపారులు సిండికేటై తాము నిర్ణయిం చుకున్న ధరలకే అమ్మకాలు జరుపుతున్నారు. అవే ధరలను బోర్డుపైనా రాయిస్తున్నారు. ఇదేమని వినియోగదారులు ప్రశ్నిస్తే అంతా ఏకమై తిరగబడుతున్నారు. ధరల విషయంలోనూ అధికారుల నియంత్రణ లేకపోవడమే దీనికంతటికీ కారణమని వినియోగదారులు అంటున్నారు.
నిబంధనలో లోపాలను ఆస రా చేసుకుని దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎటువంటి అనుమతిలేకపోయినా సరుకును రైతుబజార్‌కు తెచ్చి అమ్ముతున్నారు. కొందరు రైతుబజార్‌లో దుకాణ స్థలాలను సొంత జాగీరులా ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని అంటున్నారు. రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఉంటే ఇటువంటి సమస్య వచ్చి ఉండేదికాదని చెబుతున్నారు.
చర్యలకు పూనుకోని ప్రభుత్వశాఖలు
రైతుబజార్ ఏర్పాటు లక్ష్యం నీరుగారిపోతున్నా దాని నిర్వహణలో భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వశాఖలు ఎటువంటి చర్యలకు పూనుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రైతుబజార్‌లో ఎటువంటి సమస్య ఏర్పడినా, గొడవలు జరిగినా అధికారులు వెళ్లి తాత్కాలికంగా పరిష్కరించి వస్తున్నారే తప్ప శాశ్వ త పరిష్కారం చూపటంలేదని రైతులు విమర్శిస్తున్నారు. జిల్లా జా యింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ పర్యవేక్షణలో నిర్వహిం చే ఈ రైతుబజార్ బాధ్యతలను జిల్లా మార్కెటింగ్‌శాఖ డెరైక్టర్ కోట చౌదరిరెడ్డి చూస్తున్నారు. ఒకవైపు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం..మరోవైపు ఉద్యాన, రెవెన్యూశాఖల నిర్లక్ష్యంతోనే రైతుబజార్ బేజారవుతోందనే విమర్శలు వస్తున్నాయి.
‘దళారీ’బజార్
Published Tue, Aug 5 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM
Advertisement