సాక్షి, హైదరాబాద్ : జీఎస్‌టీ మోసాలకు పాల్పడుతున్న వ్యాపార, వాణిజ్య సంస్థలపై తూనికలు, కొలతల శాఖ కొరఢా ఝుళిపించింది. జీఎస్‌టీ పేరుతో అధిక ధరలకు విక్రియిస్తోన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్‌లలో తూనికల కొలతల శాఖ గురువారం నాడు తనిఖీలు నిర్వహించింది. జీఎస్‌టీకి సంబంధించి కొన్ని వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ తగ్గించింది. మరికొన్ని వస్తువులపై జీఎస్‌టీని తొలగించింది. కానీ తగ్గించిన జీఎస్‌టీ ధరల ప్రకారం షాపింగ్ మాల్స్, సూపర్ బజార్‌లలో విక్రయాలు జరపడం లేదని తూనికల కొలతల శాఖకు భారీగా ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఇందుకోసం 32 మంది అధికారులు 16 బృందాలుగా ఏర్పడి గ్రేటర్ హైదరాబాద్‌లోని మనికొండ, మాధాపూర్, హైటెక్ సిటీ, బాచుపల్లి, కొంపల్లి, బంజారాహిల్స్, పంజాగుట్ట, నాంపల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, బేగం బజార్, కూకట్‌పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్న పలు మార్కెట్లపై కేసులు నమోదు చేశారు.
వీటిలో ప్రముఖ రత్నదీప్ సూపర్ మార్కెట్‌పై 8 కేసులు, హెరిటేజ్ సూపర్ మార్కెట్‌పై13 కేసులు, మోర్ సూపర్ మార్కెట్‌పై 5 కేసులు, స్పెన్సర్స్‌పై 7 కేసులు, బిగ్‌బజార్‌పై 15 కేసులు, విజేత సూపర్ మార్కెట్, మహావీర్ ఎలక్ట్రికల్ అండ్ హార్డ్‌వేర్, భగవతి పెయింట్స్ అండ్ హార్డ్‌వేర్, బిగ్ సి, హైపర్ మార్కెట్ వంటి తదితర షాపింగ్ మాల్స్‌పై మొత్తం 125 కేసులు నమోదు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
తూనికల కొలతల శాఖ అధికారులకు పదోన్నతులు
తూనికల కొలతల శాఖలో 16 మంది ఇన్‌స్పెక్టర్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ఆ శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. 2012 నుంచి ఈ పదోన్నతుల ప్రక్రియ పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్లుగా ఉన్న వారిని జిల్లా తూనికల కొలతల అధికార్లు (డీఎల్‌ఎంఓ)గా పదోన్నతి కల్పించినట్లు అకున్ సబర్వాల్ తెలిపారు.
పదోన్నతులు పొందిన వారిలో బి. ప్రవీణ్ కుమార్, డి. శ్రీవల్లి, డి. సరోజ, మొహమ్మద్ సుజాత్ అలి, కె. రామమోహన్, ఎన్. సంజయ్ క్రిష్ణ, బి. భూలక్ష్మి, పి. శ్రీనివాస్ రెడ్డి, జి. అశోక్‌బాబు, పి. రవీందర్, ఎండి రియాజ్ అహ్మద్ ఖాన్, ఎం.ఎ. జలీల్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment