‘వినియోగ తరంగిణి’ సంచికను ఆవిష్కరిస్తున్న సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: కేంద్రం మాదిరిగానే రాష్ట్రాల్లోనూ వినియోగదారులకు ప్రత్యేక విభాగం ఉంటే బాగుంటుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ అభిప్రాయపడ్డారు. వినియోగదారులు తమ హక్కులు, బాధ్యతల పట్ల చైతన్యం కలిగి ఉన్నప్పుడే నేరాలకు త్వరితగతిన అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వానికి మార్గం సులువవుతుందని అన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంపై వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. గురువారం పౌరసరఫరాల భవన్‌లో ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘వినియోగ తరంగిణి’ప్రత్యేక సంచికను ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం జాతీయ వినియోగదారుల చట్టం ఏర్పడిందని, అప్పటి నుంచి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలతోపాటు, ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఆన్‌లైన్ షాపింగ్ లావాదేవీలలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయన్నారు.
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వినియోగదారుల రక్షణకు చట్టంలో మార్పులు తీసుకురావాల్సి ఉందన్నారు. జీఎస్టీ పేరుతో వినియోగదారుల నుంచి ఎంఆర్పీకి అదనంగా వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న హోటల్స్, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి దాదాపు 1,400 వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేసి రూ.50 లక్షల పెనాల్టీ వసూలు చేశామన్నారు. వినియోగదారుల రక్షణకు చట్టాలున్నాయని, నష్టం జరిగితే, మోసపోతే పరిహారం పొందడానికి అవకాశాలు ఉన్నాయని, ఇందుకు చట్టపరంగా యంత్రాంగం ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment