విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న హరీశ్. చిత్రంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, సీవీ ఆనంద్
సాక్షి, సిద్దిపేట: పేదలకు కడుపు నిండా అన్నం పెట్టి దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయడమే ప్రభుత్వ లక్ష్యమని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లాలో పాస్‌పోర్టు సెం టర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం పౌర సరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్‌తో కలిసి సివిల్ సప్‌లై కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గతంలో పౌర సరఫరాల శాఖ నుంచి రైళ్లల్లో, ట్రక్కుల్లో బియ్యం అక్రమంగా తరలివెళ్లేవని, దీనిని అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, కమిషనర్ సీవీ ఆనంద్ విప్లవాత్మక మార్పులు తెచ్చారని అభినందించారు. ఈ–పాస్ విధానం ద్వారా బినామీలు రేషన్ పొందకుండా చెక్ పెట్టామన్నారు. దీంతో ఏటా రూ.500 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదా అవుతోందని చెప్పారు. ఈ నిధులు పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టల్స్‌కు సన్న బియ్యం సరఫరాకు ఉపయోగపడుతున్నాయన్నారు. బియ్యం అక్రమ రవాణా అరికట్టడం కోసం కమాండ్ అండ్ కంట్రోల్ రూం ప్రారంభించామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఈ విధానం మంచి ఫలితాలను ఇచ్చిందని, ఇప్పుడు సిద్దిపేటలో ప్రారంభించామని, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తృతం చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 171 ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద 17 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, వాహనాలకు జీపీఎస్ అమర్చడంతో అక్రమాలను అడ్డుకట్ట వేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
డీలర్ల సమస్య సీఎం దృష్టికి..
రాష్ట్రంలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు డీలర్ల సంఘం నాయకులు దృష్టికి తెచ్చారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు. డీలర్ల సమస్యను పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎం సమక్షంలో చర్చించి పరిష్కరిస్తామన్నారు.
అక్రమ రవాణాకు చెక్: ఆనంద్
రాష్ట్రం నుంచి రేషన్ బియ్యం కాకినాడ మీదుగా ఇతర దేశాలకు అక్రమ రవాణా అవుతోందంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో బియ్యం పక్కదారి పట్టకుండా కమాండ్ అండ్ కంట్రోల్ విధానం ప్రారంభించామని రాష్ట్ర సివిల్ సప్లయ్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. జిల్లాలోని అన్ని మెయిన్ గోదాంలు, ఎంఎల్‌ఎస్ పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిజమైన లబ్ధిదారులకే బియ్యం సరఫరా చేయాలనే ఆలోచనతో రాష్ట్రవ్యాప్తంగా 17 వేల రేషన్ షాపుల్లో ఈ పాస్ విధానం అమలు చేస్తున్నామన్నారు. వేలిముద్రలు పడనివారి కోసం త్వరలో ఐరిస్ విధానం తీసుకొస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment