సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునే రేషన్ పోర్టబిలిటీ విధానానికి లబ్ధిదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తొలిరోజు వెయ్యిమంది పోర్టబిలిటీ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. రాష్ట్రంలో ఒక జిల్లాలో రేషన్ కార్డుంటే, మరో జిల్లాలో ఎక్కడి నుంచైనా రేషన్ బియ్యం తీసుకునే విధానానికి పౌర సరఫరాల శాఖ ఆదివారం నుంచి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వలసలు వెళ్లిన వారు, ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉన్నప్పుడు ఈ పోర్టబిలిటీ పద్ధతి ఉపయోగపడనుంది.
రాష్ట్రంలో 17,027 రేషన్ షాపులకుగాను ఆదివారం 5 వేల షాపుల్లో 1.33 లక్షల లావాదేవీలు జరిగాయి. ఇందులో జిల్లా పరిధిలో 13,623 పోర్టబిలిటీ లావాదేవీలు జరగ్గా, రాష్ట్రంలో వివిధ జిల్లాల మధ్య వెయ్యి మంది పోర్టబిలిటీ ద్వారా సరుకులు తీసుకున్నారని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్‌లో 157, మేడ్చల్‌లో 253, రంగారెడ్డిలో 173 మంది అత్యధికంగా రేషన్ పోర్టబిలిటీ విధానాన్ని వినియోగించుకున్నారు. రేషన్ పోర్టబిలిటీపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment