
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత వరకు ఉపయోగించుకుని పారదర్శకత, జవాబుదారీతనం, సత్వర ఫలితాలే లక్ష్యంగా పౌరసరఫరాల శాఖలో చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సాంకేతికత ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా, రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసిందన్నారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న 21వ జాతీయ ఈ–గవర్నెన్స్ సదస్సులో మంగళవారం, సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను, సంస్కరణలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కమిషనర్ వివరించారు. జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు కేంద్రం ఒక్కో వ్యక్తికి నెలకు కిలో మూడు రూపాయలకు ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని సరఫరా చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కుటుంబంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున కిలో ఒక్క రూపాయికే సరఫరా చేస్తుందన్నారు. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2.75 కోట్ల మంది లబ్ధిపొందుతున్నారన్నారు.
రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే నిత్యావసర సరుకులు పక్క దారి పట్టకుండా అర్హులకు అందేలా సరఫరా నుండి పంపిణీ వరకు కంప్యూటరీకరణ, రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ మెషీన్లు, ఎలక్ట్రానిక్ తూకాలు, సరుకుల రవాణా వాహనాలకు జీపీఎస్, గోదాముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment