
సాక్షి, హైదరాబాద్: నిత్యావసర సరుకులు ముఖ్యంగా రేషన్ బియ్యంలో అక్రమాలను అడ్డుకునేందుకు పౌరసరఫరాలశాఖ చేసిన ప్రయోగం విజయవంతమైందని పౌరసరఫరాలశాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తెలి పారు. ఏడాది క్రితం ఎస్‌పీ ర్యాంకు రిటైర్డ్ పోలీసుల నేతృత్వంలో ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థతో పౌరసరఫరాల శాఖలో అక్రమాలకు, ముఖ్యంగా రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట పడిందన్నారు.
నిత్యావసర సరుకుల ప్రజాపంపిణీ వ్యవస్థలో అవినీతిని నిరోధించడానికి, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి రిటైర్డ్ పోలీసుల అధికారులతో పాటు రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్ తదితర విభాగాలకు సంబంధించిన 20 మందితో 5 బృందాలను ఏర్పాటు చేశామన్నా రు. ఈ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా 843 ప్రాంతా ల్లో ఆకస్మిక దాడులు, తనిఖీలు నిర్వహించి, రూ.3.60 కోట్ల విలువ చేసే 12,915 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 2,619 క్వింటాళ్ల సీఎంఆర్ ధాన్యాన్ని, అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 3.90 లక్షల చక్కెర, ఎల్‌పీజీ సిలిండర్లు, కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. 165 మందిపై 6ఏ కేసులు, 71 మందిపై క్రిమినల్ కేసులను నమోదు చేశామన్నారు.