సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం అక్రమార్కులపై పౌరసరఫరాల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ఆ శాఖకు సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ బృందాలు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెంచాయి. దీంతో వ్యాపారుల అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ బృందాల దాడులతో ముగ్గురిపై పీడీ కేసులు నమోదు కాగా, పలువురు వ్యాపారులపై 6ఏ, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ శాంతినగర్‌కు చెందిన రావిరాల రామలింగంపై ఆదివారం ఆ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పీడీ కేసు నమోదు చేశారు. మిర్యాలగూడ కేంద్రంగా కొన్నేళ్లుగా పీడీఎస్ బియ్యాన్ని సేకరించి రామలింగం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. దీంతో ఆయనపై 2016, ఫిబ్రవరి 10న మొదటిసారి కేసు నమోదైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి తొమ్మిది 6ఏ కేసులు ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయినా రామలింగం రేషన్ బియ్యం అక్రమ రవాణాను కొనసాగిస్తూనే ఉన్నాడు. దీంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ బృందాలు రామలింగం కదలికలపై నిఘా పెట్టాయి.
మరికొందరిపై పీడీ కేసులు: సీవీ ఆనంద్
రేషన్ కార్డుదారులు, డీలర్లు, ఇతర వ్యాపారస్తుల నుంచి కొందరు రేషన్ బియ్యాన్ని సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ బృందాలను అప్రమత్తం చేశాం. గత ఏడాదిలో ముగ్గురిపై పీడీ కేసులు నమోదు చేసి జైలుకు తరలించాం. తాజాగా ఆదివారం మిర్యాలగూడకు చెందిన రామలింగంపై ఆ జిల్లా కలెక్టర్ పీడీ కేసు నమోదు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంపై నిఘా పెట్టాం. మరికొంత మందిపై పీడీ కేసులు నమోదు చేస్తాం. సూత్రధారులను త్వరలోనే అరెస్టు చేస్తాం.
‘బియ్యం’ అక్రమ రవాణాకు చెక్
Published Mon, Feb 5 2018 2:26 AM | Last Updated on Mon, Feb 5 2018 2:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment