Task Force attacks
-
ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రీచ్‌లు, చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘాతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టపడింది. సీసీ కెమెరాల నిఘాతో పాటు టాస్క్ఫోర్సు దాడులు ముమ్మరం చేయడంతో అక్రమార్కుల వెన్నుల్లో వణుకు పుడుతోంది. మరోవైపు ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా ఇసుక బుక్ చేసుకునేలా పారదర్శక విధానంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బుక్ చేసుకున్న వారికి వెంటనే సమీపంలోని స్టాక్ యార్డులు, డిపోల నుంచి ఇసుక వెంటనే సరఫరా చేయడంతో అన్ని వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలకు సరసమైన ధరలకు ఇసుక అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక పాలసీని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబరు 1 వరకూ ఈ విధానంలో రాష్ట్రంలో మొత్తం 23,81,716 టన్నుల ఇసుకను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సరఫరా చేసింది. ఇందులో బల్క్ వినియోగదారులు 3,88,955 టన్నులు, సాధారణ వినియోగదారులు 19,92,761 టన్నుల ఇసుకను కొనుగోలు చేశారు. గత 20 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార తదితర నదులకు వరద రావడంతో నవంబరు రెండో వారం ముగిసే వరకూ రీచ్‌లన్నీ నీటిలోనే మునిగిఉన్నాయి. దీంతో ఇసుక తవ్వకాలు, రవాణాకు అవరోధం ఏర్పడడంతో కొంత మేర ఇసుక కొరత ఏర్పడింది. గత నెల రెండోవారం తర్వాత వరద తగ్గడం, నవంబరు 14 నుంచి ఇసుక వారోత్సవాలను నిర్వహించి చర్యలు తీసుకోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత నెల 16 నుంచి రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరత మాటే లేదు. అన్ని డిపోలు, స్టాక్ పాయింట్లలో ఇసుక నిండుగా ఉంది. ప.గోదావరి జిల్లాలో అత్యధిక వినియోగం: పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా సాధారణ వినియోగదారులు 4,54,354 టన్నుల ఇసుకను కొనుగోలు చేయగా.. విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 14,766 టన్నుల ఇసుక మాత్రమే బుక్ చేసుకున్నారు. ఒకేరోజు 5 జిల్లాల్లో టాస్క్ఫోర్సు దాడులు ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపుతూ.. అక్రమార్కులకు రూ. 2 లక్షల జరిమానాతోపాటు రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా జీఓ జారీ చేసింది. జీపీఎస్ పరికరాలు అమర్చిన వాహనాలను మాత్రమే ఇసుక సరఫరాకు అనుమతిస్తున్నారు. విజయవాడలోని కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు టాస్క్ఫోర్సు సిబ్బంది దాడుల్ని ముమ్మరం చేసింది. సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా అనంతపురం, విజయనగరం, గుంటూరు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో విస్తృతంగా దాడులు చేసి కేసులు నమోదు చేశారు. అక్రమంగా తరలిస్తున్న వారిపై 9, అక్రమ తవ్వకాలు చేస్తున్న వారిపై 2 కేసులు నమోదు చేయడంతోపాటు 9 వాహనాలను సీజ్ చేశారు. -
హద్దులు దాటిన అక్రమాలు!
రాష్ట్రంలో సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతోంది. గుట్టు చప్పుడు కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. వందల క్వింటాళ్ల మేర రోజూ పక్క రాష్ట్రా లకు తరలుతోంది. డీలర్లు, రేషన్ దుకాణాల స్థాయిలో పటిష్ట వ్యవస్థ ఏర్పాటు కావడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడ్డా, క్షేత్ర స్థాయిలో తయారైన దళారీలు పేదల నుంచి పీడీఎస్ బియ్యాన్ని సేకరించి పక్క రాష్ట్రాల్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్ర సరిహద్దు జిల్లాల నుంచి రైళ్లు, ట్రక్కుల్లో బియ్యాన్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా చేస్తు న్నారు. ఆహార భద్రత చట్టం కింద తెలంగాణలో మొత్తంగా 1.91 కోట్ల మందిని అర్హులుగా తేల్చిన కేంద్రం వీరి అవసరాల మేరకు బియ్యాన్ని సరఫరా చేస్తోంది. నిజానికి రాష్ట్రంలో ఆహార భద్రత చట్టం కింద అర్హత సాధించిన వారి సంఖ్య 2.8 కోట్ల వరకు ఉంది. అదీగాక ఆహార భద్రత చట్టం కింద కేంద్రం తలా 4 కేజీల బియ్యాన్ని మాత్రమే సరఫరా చేస్తుండగా రాష్ట్రం దానికి అదనంగా మరో రెండు కిలోలు కలిపి 6 కిలోలు రూపాయికి కిలో చొప్పున పంపిణీ చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఏటా 18 లక్షల మెట్రిక్ టన్నుల మేర బియ్యం అవసరమవుతోంది. దీనికి సబ్సిడీ కింద ఏటా ప్రభుత్వం రూ.2.200 కోట్ల మేర ఖర్చు చేస్తోంది. బియ్యాన్ని ప్రతి నెలా 1 నుంచి 15 లోపు అర్హులకు పంపిణీ చేస్తున్నారు. ఈ తర్వాతే అసలు కథ మొదలవుతోంది. రేషన్ పంపిణీ ముగిశాక దళారులు, అక్రమ వ్యాపారులు రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండే గిరిజన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. గిరిజనులు ఎక్కువగా జొన్నలు, గోధుమలపై ఆధారపడే వంటకాలకే ప్రాధాన్యం ఇస్తుండటంతో వారి నుంచి దళారులు కేజీ రూ.10కు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎక్కువ మంది దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఇష్ట పడట్లేదు. అలాంటి వారి నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి వారికి గోధుమలు, జొన్నలు ఇస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని అక్రమార్కులు పలు మార్గాల ద్వారా పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ మహారాష్ట్ర హోటళ్లకు మన బియ్యం.. ఎక్కువగా అక్రమ వ్యాపారులు ప్యాసింజర్ రైళ్ల ద్వారా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, రామ గుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్ల ద్వారా ఈ దందా యథే చ్ఛగా సాగుతోంది. జమ్మికుంట, ఓదెల, కొత్తపల్లి, పెద్దపల్లి, రామ గుండం, మంచిర్యాల, మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్డు, కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లలో నుంచి నిత్యం వందల క్వింటాళ్ల రేషన్ బియ్యం పలు రైళ్లలో మహారాష్ట్రకు తరలు తున్నాయి. రాత్రి వేళల్లో అధికారుల తనిఖీలు తక్కువగా ఉంటా యనే ఉద్దేశంతో అక్రమ వ్యాపారులు వీటిని రాత్రి వేళల్లో రైళ్లలో తరలిస్తున్నారు. ప్రయాణికుల సీట్ల కింద, మరుగుదొడ్ల క్యాబిన్లలో వేసి అక్రమంగా తరలిస్తున్న బియ్యం విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధి కారులకు దొరుకుతున్నా అక్రమ వ్యాపారులు మాత్రం తప్పించు కుంటున్నారు. దొడ్డు బియ్యాన్ని మరపట్టించి దోశ, ఇడ్లీ, బియ్యం రొట్టెల్లో మన బియ్యాన్నే వాడుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర హోటళ్లకు మన బియ్యం సరఫరా అవుతున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా బోధన్, బిచ్కుంద, పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతాల నుంచి ట్రక్కులు, లారీల ద్వారా మహారాష్ట్రలోని నాందేడ్, సిరొంచలకు తరలిస్తున్నారు. ఇటీవలే పెద్దపల్లి జిల్లా కాటారం వద్ద మహారాష్ట్రలోని సిరొంచకు తరలిస్తున్న సుమారు 28 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మీదుగా కూడా మహారాష్ట్రకు బియ్యం తరలుతోంది. సరిహద్దు ప్రాంతాల నుంచీ అధికమే.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా వ్యాపారం జోరుగా సాగుతోంది. గిరిజన తండాలు, మారుమూల పల్లెల నుంచి ఏజెంట్లను పెట్టుకొని వ్యాపారులు దందా చేస్తున్నారు. గ్రామాల వారీగా బియ్యాన్ని సేకరించి, ఆటోల ద్వారా గోడౌన్లకు తరలించి, ఒక లారీ లోడు సిద్ధమయ్యాక పలు రైస్‌మిల్లుల్లో వీటిని రీసైక్లింగ్, పాలిష్ చేసి బ్రాండ్ పేరుతో 25 కేజీల బ్యాగ్ తయారు చేసి ఆంధ్రా సరిహద్దులు దాటిస్తు న్నారు. గత నెలలో ఇదే జిల్లాలో 9న అనంతారం వద్ద లారీలో అక్ర మంగా తరలుతున్న 250 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక సరిహద్దుగా ఉన్న వికారాబాద్ జిల్లా కొడంగల్, నారాయణపేట, మక్తల్‌ల పరిధిలోనూ ఈ రవాణా తీవ్రంగా ఉంది. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో అడిగేవారు, తనిఖీలు చేసే వారు లేకపోవడంతో యథేచ్ఛగా బియ్యం అక్రమంగా తరలిపోతోంది. దీని నివారణకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన జాడే లేదు. కర్ణాటక చెక్ పోస్టులు మాత్రమే ఉండటంతో వాటిని దాటి నిరాటంకంగా వ్యాపారం సాగుతోంది. ఆ అక్రమ వ్యాపారం నిరోధానికి పౌర సరఫరాల శాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటు చేసి దాడులు చేయిస్తోంది. ఈ టాస్క్‌ఫోర్స్ మూడు నెలల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 3 వేల క్వింటాళ్ల మేర పీడీఎస్ బియ్యం పట్టుకొని 60 మేర కేసులు నమోదు చేసి దందాకు ఫుల్స్టాప్ మాత్రం పడట్లేదు. -
వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ దాడి
సాక్షి, విజయవాడ: నగరంలోని సింగ్‌నగర్ అమెరికన్ హాస్పిటల్ సమీపంలో ఓ వ్యభిచార గృహంపై గురువారం టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలు ఆ ఇంట్లో నలుగురు మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసుల విచారణలో తేలింది. 11 మంది విటులను అరెస్టు చేసి, రూ.30,800 నగదు, 8 సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మురళీధర్, సీఐ ఆర్.సురేష్‌రెడ్డి ఈ దాడి చేశారు. -
‘బియ్యం’ అక్రమ రవాణాకు చెక్
సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం అక్రమార్కులపై పౌరసరఫరాల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ఆ శాఖకు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ బృందాలు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెంచాయి. దీంతో వ్యాపారుల అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ బృందాల దాడులతో ముగ్గురిపై పీడీ కేసులు నమోదు కాగా, పలువురు వ్యాపారులపై 6ఏ, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ శాంతినగర్‌కు చెందిన రావిరాల రామలింగంపై ఆదివారం ఆ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పీడీ కేసు నమోదు చేశారు. మిర్యాలగూడ కేంద్రంగా కొన్నేళ్లుగా పీడీఎస్ బియ్యాన్ని సేకరించి రామలింగం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. దీంతో ఆయనపై 2016, ఫిబ్రవరి 10న మొదటిసారి కేసు నమోదైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి తొమ్మిది 6ఏ కేసులు ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయినా రామలింగం రేషన్ బియ్యం అక్రమ రవాణాను కొనసాగిస్తూనే ఉన్నాడు. దీంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ బృందాలు రామలింగం కదలికలపై నిఘా పెట్టాయి. మరికొందరిపై పీడీ కేసులు: సీవీ ఆనంద్ రేషన్ కార్డుదారులు, డీలర్లు, ఇతర వ్యాపారస్తుల నుంచి కొందరు రేషన్ బియ్యాన్ని సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ బృందాలను అప్రమత్తం చేశాం. గత ఏడాదిలో ముగ్గురిపై పీడీ కేసులు నమోదు చేసి జైలుకు తరలించాం. తాజాగా ఆదివారం మిర్యాలగూడకు చెందిన రామలింగంపై ఆ జిల్లా కలెక్టర్ పీడీ కేసు నమోదు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంపై నిఘా పెట్టాం. మరికొంత మందిపై పీడీ కేసులు నమోదు చేస్తాం. సూత్రధారులను త్వరలోనే అరెస్టు చేస్తాం. -
వ్యభిచారం కేసులో వీరిద్దరే కీలకం!
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్, పంజగుట్ట పరిధుల్లోని రెండు స్టార్ హోటల్స్‌పై శనివారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. వేర్వేరుగా వ్యభిచార దందాలు నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. తెలుగు సినీ, బెంగాలీ టీవీ రంగాలకు చెందిన ఇరువురిని రెస్క్యూ చేశారు. నిర్వాహకుడు కాస్టింగ్ డైరెక్టర్‌తో పాటు ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం వెల్లడించారు. ముంబైకి చెందిన మోనిశ్ కపాడియా తెలుగు, హిందీ చిత్రాలకు కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈవెంట్స్, ఫ్యాషన్ షోలు నిర్వహించే ఇతను కొన్నేళ్లుగా వ్యభిచార దందా నిర్వా హకుడిగా మారాడు. నగరంలోని స్టార్ హోటళ్లలో వర్ధమాన హీరోయిన్లతో వ్యభిచారం నిర్వహిస్తుంటాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనార్దన్ అలియాస్ జానీ పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న వ్యభిచార నిర్వాహకుడు. గుంటూరు జిల్లాకు చెందిన డి.వెంకట్రావును సహాయకుడిగా నియమించుకుని ఈ దందా నిర్వహిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల సాయంతో.. వీళ్లు వర్ధమాన హీరోయిన్లతో పాటు కొందరు టీవీ ఆర్టిస్టులనూ ముంబై, కోల్‌కతాల నుంచి రప్పిస్తున్నారు. మోనిశ్, వెంకట్ వేర్వేరుగా ‘కస్టమర్ల’తో కూడిన 40 నుంచి 50 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైనా సినీ, టీవీ నటిని ఉచ్చులోకి దింపిన వెంటనే వారి ఫొటోలను వాట్సాప్‌లో కస్టమర్లకు షేర్ చేస్తుంటారు. వారి ఆసక్తి మేరకు ఆయా బాధితురాళ్లను విమానాల్లో తరలిస్తుంటారు. స్టార్‌హోటల్స్‌లో రూమ్స్ సిద్ధం చేసి లాబీల్లోనే కస్టమర్‌తో నగదు లావాదేవీలు పూర్తి చేస్తారు. కస్టమర్లకు హోటల్లో గది నంబర్ చెప్పి యాక్సిస్ కార్డు ఇచ్చి పంపిస్తుంటారు. ఒక్కో కస్టమర్ల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తుంటారు. శుక్రవారం మోనిశ్ తెలుగు సినీ రంగానికి చెందిన ఓ వర్ధమాన హీరోయిన్ను బంజారాహిల్స్ పరిధిలో... శనివారం సిటీకి చేరుకున్న వెంకట్రావు బెంగాలీ టెలివిజన్ రంగానికి చెందిన నటిని పంజగుట్ట పరిధిలో ఉన్న హోటల్స్‌లో ఉంచి వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్, కేఎస్ రవి తమ బృందాలతో రెండో హోటళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. మోనిశ్, వెంకట్రావులను అరెస్టు చేయడంతో పాటు ఇద్దరు బాధితురాళ్లను రెస్క్యూ చేశారు. వీరి నుంచి రూ.50 వేల నగదు, సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న జానీ కోసం గాలిస్తున్నారు. నిందితులిద్దరినీ రిమాం డ్కు, బాధితురాళ్లను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ల కాల్ డేటాతో పాటు వీటిలోని వాట్సాప్ గ్రూపుల్నీ పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం.. ఈ ఇద్దరు నిర్వాహకుల కస్టమర్ల జాబితాలో సిటీకి చెందిన పలువురు వ్యాపారవేత్తలతో పాటు బడాబాబులూ ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ వివరాల ఆధారంగా వారిపై చర్యలు తీసుకోలేమని, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటేనే అరెస్టుకు ఆస్కారం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. -
శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ దాడులు
చంద్రగిరి : చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్సై భాస్కర్ బృందం కూంబింగ్ నిర్వహించింది. ఆదివారం తెల్లవారుజామున కల్యాణి డ్యామ్ ఎగువ ప్రాంతమైన శేషాచలం అడవుల్లో తనిఖీలు చేపట్టారు. పుల్లయ్యగారి పల్లెగుట్ట వద్ద 10 మంది తమిళ కూలీలు ఎర్రచందనం దుంగలను పక్కన పెట్టి సేదతీరుతుండగా టాస్క్‌ఫోర్స్ బృందం వారిని చుట్టుముట్టింది. దీంతో కూలీలు చేతికందిన రాళ్లు తీసుకొని టాస్క్‌ఫోర్స్ బృందంపై దాడి చేస్తూ పారిపోయారు. వారిలో ఒకరిని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లా పోలార్ తాలూకా జావాధిమలైకు చెందిన అలగేశన్‌గా గుర్తించారు. ఆ ప్రాంతం నుంచి 9 ఎర్రచందనం దుంగలను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎఫ్ఎస్వో వెంకటసుబ్బయ్య, ఏబీవో కోదండ, హెడ్‌కానిస్టేబుల్ మోహన్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రధాన బుకీ సహా10 మంది అరెస్టు
రూ.3.42లక్షలు స్వాధీనం పరారీలో మరో బుకీ విజయవాడ సిటీ : నగంలోని క్రికెట్ బెట్టింగ్‌స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు కొనసాగుతున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో శనివారం దాడులు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ప్రధాన బుకీ సహా 10 మందిని అరెస్టు చేశారు. మరో ప్రధాన బుకీ పరారవగా, పట్టుబడిన వారి నుంచి రూ.3.42 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం నింది తులను ఆయా పోలీసు స్టేషన్లకు అప్పగిం చారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీలు ఎ.వి.ఆర్.జి.బి.ప్రసాద్, పి.మురళీధరన్ ఈ దాడులను పర్యవేక్షించగా ఎస్ఐలు ఆర్.సురేష్ రెడ్డి, జి.శ్రీనివాస్ తమ సిబ్బందితో పాల్గన్నారు. నగల తయారీ మాటున బెట్టింగ్ దందా రెండేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ప్రధాన బుకీని ఎట్టకేలకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతనితో పాటు కలెక్షన్ వ్యవహారాలు చూసే మరో వ్యక్తిని, ముగ్గురు బెట్టింగ్ రాయుళ్లను శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2,64,000 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, ఆయా వ్యక్తులకు ఇవ్వాల్సిన, రావాల్సిన నగదు లావాదేవీలతో కూడిన స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అధికారుల కథనం ప్రకారం.. గుణదల గంగానమ్మ గుడి ప్రాంతానికి చెందిన వరదా కేశవరాం ప్రసాద్ అలియాస్ రాంబాబు బంగారు నగల తయారీ వృత్తి చేస్తుంటాడు. రెండేళ్లుగా క్రికెట్ బుకీ అవతారం పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు నిఘా పెట్టారు. శని వారం బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు రూఢీ చేసుకొని దాడి చేసి అతనితో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం మాచవరం పోలీసులకు అప్పగించారు. గవర్నరుపేటలో.. ఓ స్టార్ హోటల్లో గది అద్దెకు తీసుకొని క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు శనివారం దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసుల రాకను పసిగట్టి హైదరాబాద్‌కు చెందిన ప్రధాన బుకీ అప్పారావు పరారవ్వగా నగరానికి చెందిన డి.ప్రదీప్ కుమార్ రెడ్డి, టి.రాజేష్ కుమార్, కె.చిట్టిబాబు, పి.వెంకటనరేష్, పి.సత్యనారాయణను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.78వేల నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, ఎల్ఈడీ టీవీ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం స్వాధీనం చేసుకున్న సొత్తు సహా నిందితులను గవర్నరుపేట పోలీసులకు అప్పగించారు.