హద్దులు దాటిన అక్రమాలు! | Capture Subsidy Rice in Task Force attacks | Sakshi
Sakshi News home page

హద్దులు దాటిన అక్రమాలు!

Published Wed, May 8 2019 1:53 AM | Last Updated on Wed, May 8 2019 1:53 AM

Capture Subsidy Rice in Task Force attacks - Sakshi

ఇటీవల కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలో టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది తనిఖీల్లో పట్టుబడిన పీడీఎస్‌ బియ్యం

రాష్ట్రంలో సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతోంది. గుట్టు చప్పుడు కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. వందల క్వింటాళ్ల మేర రోజూ పక్క రాష్ట్రా లకు తరలుతోంది. డీలర్లు, రేషన్‌ దుకాణాల స్థాయిలో పటిష్ట వ్యవస్థ ఏర్పాటు కావడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడ్డా, క్షేత్ర స్థాయిలో తయారైన దళారీలు పేదల నుంచి పీడీఎస్‌ బియ్యాన్ని సేకరించి పక్క రాష్ట్రాల్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్ర సరిహద్దు జిల్లాల నుంచి రైళ్లు, ట్రక్కుల్లో బియ్యాన్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా చేస్తు న్నారు. ఆహార భద్రత చట్టం కింద తెలంగాణలో మొత్తంగా 1.91 కోట్ల మందిని అర్హులుగా తేల్చిన కేంద్రం వీరి అవసరాల మేరకు బియ్యాన్ని సరఫరా చేస్తోంది. నిజానికి రాష్ట్రంలో ఆహార భద్రత చట్టం కింద అర్హత సాధించిన వారి సంఖ్య 2.8 కోట్ల వరకు ఉంది.

అదీగాక ఆహార భద్రత చట్టం కింద కేంద్రం తలా 4 కేజీల బియ్యాన్ని మాత్రమే సరఫరా చేస్తుండగా రాష్ట్రం దానికి అదనంగా మరో రెండు కిలోలు కలిపి 6 కిలోలు రూపాయికి కిలో చొప్పున పంపిణీ చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఏటా 18 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర బియ్యం అవసరమవుతోంది. దీనికి సబ్సిడీ కింద ఏటా ప్రభుత్వం రూ.2.200 కోట్ల మేర ఖర్చు చేస్తోంది. బియ్యాన్ని ప్రతి నెలా 1 నుంచి 15 లోపు అర్హులకు పంపిణీ చేస్తున్నారు. ఈ తర్వాతే అసలు కథ మొదలవుతోంది. రేషన్‌ పంపిణీ ముగిశాక దళారులు, అక్రమ వ్యాపారులు రంగంలోకి దిగుతున్నారు.

ముఖ్యంగా కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండే గిరిజన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. గిరిజనులు ఎక్కువగా జొన్నలు, గోధుమలపై ఆధారపడే వంటకాలకే ప్రాధాన్యం ఇస్తుండటంతో వారి నుంచి దళారులు కేజీ రూ.10కు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎక్కువ మంది దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఇష్ట పడట్లేదు. అలాంటి వారి నుంచి రేషన్‌ బియ్యాన్ని సేకరించి వారికి గోధుమలు, జొన్నలు ఇస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని అక్రమార్కులు పలు మార్గాల ద్వారా పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నారు.  
 – సాక్షి, హైదరాబాద్‌ 

మహారాష్ట్ర హోటళ్లకు మన బియ్యం..
ఎక్కువగా అక్రమ వ్యాపారులు ప్యాసింజర్‌ రైళ్ల ద్వారా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఆసిఫాబాద్, రామ గుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్ల ద్వారా ఈ దందా యథే చ్ఛగా సాగుతోంది. జమ్మికుంట, ఓదెల, కొత్తపల్లి, పెద్దపల్లి, రామ గుండం, మంచిర్యాల, మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌ రోడ్డు, కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లలో నుంచి నిత్యం వందల క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పలు రైళ్లలో మహారాష్ట్రకు తరలు తున్నాయి. రాత్రి వేళల్లో అధికారుల తనిఖీలు తక్కువగా ఉంటా యనే ఉద్దేశంతో అక్రమ వ్యాపారులు వీటిని రాత్రి వేళల్లో రైళ్లలో తరలిస్తున్నారు.

ప్రయాణికుల సీట్ల కింద, మరుగుదొడ్ల క్యాబిన్లలో వేసి అక్రమంగా తరలిస్తున్న బియ్యం విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్‌ అధి కారులకు దొరుకుతున్నా అక్రమ వ్యాపారులు మాత్రం తప్పించు కుంటున్నారు. దొడ్డు బియ్యాన్ని మరపట్టించి దోశ, ఇడ్లీ, బియ్యం రొట్టెల్లో మన బియ్యాన్నే వాడుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర హోటళ్లకు మన బియ్యం సరఫరా అవుతున్నట్లు సమాచారం. నిజామాబాద్‌ జిల్లా బోధన్, బిచ్కుంద, పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతాల నుంచి ట్రక్కులు, లారీల ద్వారా మహారాష్ట్రలోని నాందేడ్, సిరొంచలకు తరలిస్తున్నారు. ఇటీవలే పెద్దపల్లి జిల్లా కాటారం వద్ద మహారాష్ట్రలోని సిరొంచకు తరలిస్తున్న సుమారు 28 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మీదుగా కూడా మహారాష్ట్రకు బియ్యం తరలుతోంది.

సరిహద్దు ప్రాంతాల నుంచీ అధికమే..
మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంగా వ్యాపారం జోరుగా సాగుతోంది. గిరిజన తండాలు, మారుమూల పల్లెల నుంచి ఏజెంట్లను పెట్టుకొని వ్యాపారులు దందా చేస్తున్నారు. గ్రామాల వారీగా బియ్యాన్ని సేకరించి, ఆటోల ద్వారా గోడౌన్‌లకు తరలించి, ఒక లారీ లోడు సిద్ధమయ్యాక పలు రైస్‌మిల్లుల్లో వీటిని రీసైక్లింగ్, పాలిష్‌ చేసి బ్రాండ్‌ పేరుతో 25 కేజీల బ్యాగ్‌ తయారు చేసి ఆంధ్రా సరిహద్దులు దాటిస్తు న్నారు. గత నెలలో ఇదే జిల్లాలో 9న అనంతారం వద్ద లారీలో అక్ర మంగా తరలుతున్న 250 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక సరిహద్దుగా ఉన్న వికారాబాద్‌ జిల్లా కొడంగల్, నారాయణపేట, మక్తల్‌ల పరిధిలోనూ ఈ రవాణా తీవ్రంగా ఉంది.

కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో అడిగేవారు, తనిఖీలు చేసే వారు లేకపోవడంతో యథేచ్ఛగా బియ్యం అక్రమంగా తరలిపోతోంది. దీని నివారణకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన జాడే లేదు. కర్ణాటక చెక్‌ పోస్టులు మాత్రమే ఉండటంతో వాటిని దాటి నిరాటంకంగా వ్యాపారం సాగుతోంది. ఆ అక్రమ వ్యాపారం నిరోధానికి పౌర సరఫరాల శాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేసి దాడులు చేయిస్తోంది. ఈ టాస్క్‌ఫోర్స్‌ మూడు నెలల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 3 వేల క్వింటాళ్ల మేర పీడీఎస్‌ బియ్యం పట్టుకొని 60 మేర కేసులు నమోదు చేసి దందాకు ఫుల్‌స్టాప్‌ మాత్రం పడట్లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement