
చోడవరం టౌన్/ ఎస్.రాయవరం(పాయకరావుపేట): ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో గెలుపుకోసం ఓటర్లను డబ్బుతో ప్రలోభపెట్టేందుకు అధికార తెలుగుదేశం పార్టీ నేతలు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లకు పంచిపెట్టేందుకోసం భారీ ఎత్తున డబ్బు తరలిస్తున్నారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ సంస్థ వ్యాన్‌లు, విశాఖ డెయిరీకి చెందిన పాల వ్యాన్లను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం విశాఖ జిల్లాలో ఈ వాహనాల్లో డబ్బు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆడారి ఆనంద్ అనకాపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి పాల వ్యాన్‌లో గ్రామాలకు సొమ్ము తరలిస్తుండగా చోడవరం –చీడికాడ రోడ్డులో పోలీసులు పట్టుకున్నారు. అందులో అక్రమంగా తరలిస్తున్న రూ.2,02,050ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సీఎం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ పాలవ్యాన్‌లో పోలీసుల సోదాల్లో రూ.1,08,390 పట్టుపడింది. ఈ సొమ్మును సీజ్ చేసి కేసులు నమోదు చేశామని ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.
భారీగా బంగారం, నగదు పట్టివేత
విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు చెక్‌పోస్ట్ పరిధిలో వేర్వేరు వాహనాల్లో తరలిస్తున్న కోటీ 40 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.45 లక్షల నగదు పట్టుబడింది. జాతీయ రహదారిపై విశాఖపట్నం వైపు నుంచి రాజమండ్రి వెళుతున్న వాహనాన్ని చెక్‌పోస్ట్ పోలీసులు శుక్రవారం తనిఖీ చేయగా.. అందులో 4 కేజీల 653 గ్రాముల బంగారు ఆభరణాలున్నట్టు గుర్తించారు. కళ్యాణి జ్యువెల్లరీ వ్యాపారులు తరలిస్తున్న ఈ బంగారు ఆభరణాలకు పూర్తి ఆధారాలు, ఒరిజినల్ బిల్లు లేకపోవడంతో సీజ్ చేసి విశాఖ ట్రెజరీకి తరలించినట్టు ఎస్‌ఐ ధనుంజయ తెలిపారు.
బంగారు ఆభరణాల విలువ సుమారు రూ. కోటీ 40 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. మరోవైపు నక్కపల్లి నుంచి నర్సీపట్నం వైపు వెళుతున్న మరో వాహనంలో రూ.45 లక్షలు పట్టుకుని సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు. ఏటీఎం మిషన్లలో పెట్టేందుకు ఈ నగదును తీసుకెళుతున్నట్లు సిబ్బంది చెబుతున్నప్పటికీ వాహనంతో పాటు ఉన్న ఇన్‌వాయిస్‌కు, ఉన్న నగదుకు వ్యత్యాసం రావడం, వాహనానికి రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోవడంతో నగదును సీజ్ చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.