సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో, ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించడం బ్రిటిష్ కాలం నాటి అంశం. జాతీయవాదులు ఒకే చోట సమావేశం కాకుండా, గుమికూడకుండా ఉండేందుకు నాడు బ్రిటిష్ పాలకులు చట్టంలో ఈ సెక్షన్ను తీసుకొచ్చారు. అయినప్పటికీ భారత ప్రభుత్వం ఈ సెక్షన్ ను ఇప్పటికీ ఉపయోగిస్తోంది. అందుకు బదులుగా దుర్వినియోగం చేస్తోందని చెప్పడం ఇక్కడ ఎంతైన సబబు. ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాల లాంటి వివిధ రకాల ప్రజా పోరాటాలను, ముఖ్యంగా ప్రభుత్వం పట్ల అసంతప్తిని అణచివేసేందుకు ఈ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధిస్తోంది. ఈ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు నలుగురికి మించి ఒక చోట గుమికూడరాదు. సమావేశం కాకూడదు. ప్రసంగాలు, నినాదాలు చేయరాదు.
శాంతి భద్రతలను పరిరక్షించేందుకు మాత్రమే, అంటే శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లుతుందని భావించినప్పుడు మాత్రమే ఈ సెక్షన్ను ఉపయోగించాలి. అంటే జాతుల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య అల్లర్లు చెలరేగిన సందర్భాల్లో, ఫలానా ప్రజాందోళన కార్యక్రమం వల్ల శాంతియుత పరిస్థితులకు కచ్చితంగా భంగం కలుగుతుందని భావించినప్పుడు మాత్రమే, మరోవిధంగా చెప్పాలంటే అత్యయిక పరిస్థితుల్లోనే ఈ సెక్షన్ను ఉపయోగించాలి. కానీ మన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మానవ హక్కులను కాలరాస్తూ ప్రజల ఆందోళనలను, నిరసనలను, ధర్నాలను, ర్యాలీలను అడ్డుకునేందుకు అడ్డగోలుగా ఈ సెక్షన్ను ఉపయోగిస్తున్నాయి. శాంతియుత పరిస్థితులు నెలకొనడం కోసం తాత్కాలిక ప్రాతిపదికనే, అంటే రెండు నెలలకు మించి ఈ సెక్షన్ను అమలు చేయడానికి వీల్లేదు. కానీ ఢిల్లీలో పార్లమెంట్, ఇతర ప్రభుత్వ భవనాల వద్ద ప్రతిరోజు ఈ సెక్షన్ అమల్లో ఉంటోంది. అంటే ప్రతి రెండు నెలలకోసారి ఈ నిషేధాజ్ఞలను ఢిల్లీ పోలీసులు నోటిఫికేషన్ ద్వారా గుడ్డిగా పొడిగిస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో తమ హక్కుల కోసం ఉద్యమాలు చేపడుతున్న వివిధ రంగాలకు చెందిన ప్రజలు తమ ఆందోళనను వ్యక్తం చేయడం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ ను వేదికగా ఎంపిక చేసుకున్నారు. గతంలో పార్లమెంట్ భవనం ముందు వరకు ప్రజల నిరసన ప్రదర్శనలను అనుమతించేవారు. 1988లో భారతీయ కిసాన్ సంఘ్ నాయకుడు మహేంద్ర సింగ్ తికాయత్ కొన్ని లక్షల మంది రైతులతో ర్యాలీ తీయడంతో ఇండియా గేట్ సమీపంలోని మున్సిపల్ లాన్స్, బోట్ క్లబ్, రాజ్ పథ్, పార్లమెంట్ భవనం వరకు రైతులు నిండిపోయారు. ఆ తర్వాత నుంచి పార్లమెంట్, ఇతర ప్రభుత్వ భవనాలకు సమీపంలో 144వ సెక్షన్ను అమలు చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద కూడా ప్రజల ఆందోళనకు ఆస్కారం లేకుండా పోయింది. తమకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఎంపీలు, సంపన్నులు ‘గ్రీన్ ట్రిబ్యునల్’ను ఆశ్రయించడంతో ప్రజల ఆందోళన వేదికను పోలీసులు రామ్ లీలా మైదాన్కు మార్చారు. అక్కడ ప్రజలు తమ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలంటే అందుకు డబ్బులు చెల్లించాలి. ఈ నేపథ్యంలోనే ‘మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్’ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అన్యాయంగా ఉపయోగిస్తున్న 144వ సెక్షన్ ఎత్తివేయాలని లేదంటూ దాన్ని ప్రయోగించడానికి సరైన మార్గదర్శకాలనైనా సూచించాలని రిట్లో డిమాండ్ చేశారు.
నిరసన కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రజలకుగల హక్కులకు, శాంతి భద్రతల పరిరక్షణకు మధ్య సమతౌల్యాన్ని పాటించేందుకు మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రాథమికంగా ఈ పిటిషన్ వాదనలను సోమవారం నాడు ఆలకించిన జస్టిస్ ఏకే సిక్రీ, ఆశోక్ భూషణ్లతో కూడిన సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషన్ తదుపరి విచారణను జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఎప్పుడో ఆచార్య జగదీశ్వరానంద అవధూత కేసులోనే 144వ సెక్షన్ దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అప్పుడే ప్రజా సంఘాలు రిటి పిటిషన్ దాఖలు చేయాల్సి ఉండింది. ఇంతకాలానికైనా దాఖలైనందుకు ముదావహం.
Comments
Please login to add a commentAdd a comment