
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం విక్రయించకుండా నిబంధన విధించింది. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
కాగా, పెట్రోల్ వాహనాలు 15 ఏళ్లు, డీజిల్ వాహనాలు పదేళ్లు దాటితే ఇంధనం విక్రయించే ప్రసక్తే లేదని శనివారం తేల్చి చెప్పింది. వాహనాల గడువు తీరిపోయిందో లేదో తెలుసుకునేందుకు పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని పెట్రోల్, డీజిల్ పంపుల యాజమాన్యాలకు సూచించింది. కాలుష్య నియంత్రణపై శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం విక్రయించకూడదని నిర్ణయించినట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మత్రి మంజీందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. ఈ విషయాన్ని త్వరలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖకు తెలియజేస్తామని పేర్కొన్నారు.
గడువు తీరిపోయిన వాహనాలు రోడ్లపైకి రాకుండా నిరోధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టంచేశారు. ఢిల్లీలో 425కుపైగా ఇంధన బంకులు ఉన్నాయి. నగరంలో కాలం చెల్లిన వాహనాలు 55 లక్షలు ఉన్నట్లు అంచనా. ఇందులో 66 శాతం ద్విచక్ర వాహనాలు, 54 శాతం నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం ప్రజా రవాణా బస్సుల్లో 90 శాతం సీఎన్‌జీ బస్సులనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment