రైతులను కూలీలుగా మార్చేందుకు కుట్ర | Telangana: Avinash Reddy Criticized BJP And TRS Party | Sakshi
Sakshi News home page

రైతులను కూలీలుగా మార్చేందుకు కుట్ర

Published Fri, Dec 31 2021 3:06 AM | Last Updated on Fri, Dec 31 2021 3:06 AM

Telangana: Avinash Reddy Criticized BJP And TRS Party - Sakshi

రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న అవినాష్‌రెడ్డి 

సాక్షి, మహబూబాబాద్‌: రైతులను కూలీలుగా మార్చడమే లక్ష్యంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని మహబూబాబాద్‌ జిల్లా ఈదులపూసపల్లి గ్రామంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తాము ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు. తామర పురుగు ఆశించిన మిర్చి పంటను చూపించి రైతులు విలపించారు.

అనంతరం అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి రైతును రాజుగా చూసేందుకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. రైతుల కోసమే ప్రాజెక్టులు కట్టామని చెబుతూ వరి సాగు చేయొద్దని చెప్పడం శోచనీయమన్నారు. రైతుల భూములను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే కుట్రలో భాగంగానే.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతోందని, విత్తనాల తయారీ కంపెనీలతో కుమ్మక్కై పంటలకు చీడపీడలు ఆశించేలా చేస్తోందని దుయ్యబట్టారు.

రైతు వ్యతిరేక చట్టాలు సైతం అందులో భాగమేనన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రైతులు పండించిన ప్రతి గింజను గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని, నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరానికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు తేజావత్‌ బెల్లయ్యనాయక్, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement