సాక్షి, రాజమండ్రి :‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’- తెలుగు సినిమాలకు వాటి పేర్ల కింద తగిలిస్తున్న ఉపశీర్షికల్లా.. మూడవ విడత ‘రచ్చబండ’కు కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు తగిలించిన వ్యాఖ్య ఇది. అయితే పేరులో ఎంత ఆర్భాటం ఉన్నా..కథ, కథనాల్లో పస లేని సినిమా ఫ్లాపయినట్టు.. రాజమండ్రిలో రచ్చబండ కార్యక్రమం తుస్సుమంది. రాజమండ్రి నగర పాలక సంస్థ పరిధిలోకి వచ్చే 41 అర్బన్ డివిజన్‌లు, తొమ్మిది రూరల్ డివిజన్‌లకు కలిపి కేవలం రెండు రచ్చబండలు మాత్రమే నిర్వహించి అధికారులు చేతులు దులుపుకొన్నారు.
పట్టుమని రెండు రోజులు కూడా జరగని ఈ తంతులో కూడా నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావన వినిపించలేదు. ఆర్ అండ్ బి శాఖ మంత్రి పితాని సత్యనారాయణ వస్తున్నారు కాబట్టి ఓ సభ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వస్తున్నారు కాబట్టి మరో పెద్ద సభ అన్నట్టుగానే నగరంలో రచ్చబండ జరిగింది. రాష్ట్రంలో అది చేశాం, జిల్లాకు ఇది చేస్తాం అంటూ అటు ముఖ్యమంత్రి, ఇటు పితాని డంబాలు పలికారు, అంతే తప్ప వివిధ పథకాలకు సంబంధించిన స్థానిక లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేయకుండా కార్యక్రమాన్ని కానిచ్చేశారు. కొత్తగా దరఖాస్తులు తీసుకోవడం కన్నా గత ఏడాది మంజూరైన వాటిని అందచే సేందుకే అధికారులు ప్రాధాన్యం ఇచ్చారు.
రాజకీయ విమర్శలకే పరిమితం..
జిల్లాలో ఈనెల 11 నుంచి 26 వరకూ రచ్చబండ కార్యక్రమాలు సాగుతాయని కలెక్టర్ ప్రకటించారు. వాస్తవానికి ప్రతి రెండు, మూడు డివిజన్లకొక రచ్చబండ నిర్వహించాల్సి ఉంది. కనీసం ఐదు డివిజన్లకో రచ్చబండైనా నిర్వహించకుండా రెండే రెండింటితో సరిపుచ్చడం పట్ల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఈ నెల 12న పుష్కరాల రేవు వద్ద నిర్వహించిన తొలి రచ్చబండకు ఆర్ అండ్ బి మంత్రి పితాని సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అయితే ఆయన ఈ కార్యక్రమాన్ని ఆసాంతం తన రాజకీయ విమర్శలకే పరిమితం చేశారు. ‘మీకు మంజూరైన కార్డులు, పెన్షన్లు మంత్రిగారు అంద చేస్తారు’ అని జనాన్ని పిలిచిన అధికారులకు కూడా మంత్రి వ్యవహార శైలి ఇబ్బంది కలిగించింది. అసలే ఆలస్యంగా వచ్చిన మంత్రి జనం సమస్యల గురించి కాక ఇతర విషయాలు మాట్లాడి, తీరా అసలు కార్యక్రమానికి వచ్చేసరికి ఓ నలుగురికి మంజూరు పత్రాలు అందచేసి చక్కా వెళ్లిపోయారు. మొత్తం 11 డివిజన్‌లకు నిర్వహించిన ఈ సభలో డివిజన్‌ల వారీ సమస్యలు చర్చకు రాలేదు. కొత్తగా ఎవరికి ఏం కావాలో అడగలేదు. దీంతో ఎంతో ఆశతో వచ్చిన జనం తీవ్ర నిరాశతో వెనుతిరిగారు.
‘సమైక్య’ ప్రచారానికే ప్రాధాన్యం..
ఈ నెల 16న సుబ్రహ్మణ్య మైదానంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరైన రచ్చబండ కూడా అదే తంతుగా జరిగింది. తాను సమైక్యవాదినని, రాష్ట్ర సమైక్యత కోసం ఎంతకైనా సిద్ధమని చెప్పుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని సీఎం ప్రజల సమస్యలపై మాట్లాడడానికి ఇవ్వనేలేదు. వాస్తవంగా ఈ కార్యక్రమం 39 డివిజన్‌ల లబ్ధిదారులను ఉద్దేశించి పెట్టినా మొత్తం 50 డివిజన్ల వారినీ పిలిచారు. సుమారు 25 స్టాళ్లు పెట్టి రచ్చబండలో మంజూరైన ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇక్కడే ఇచ్చేస్తామంటూ ప్రచారం చేశారు. అదే ఊరింపుతో లబ్ధిదారులను సభకు తరలించారు. తీరా సీఎం వెళ్లిపోయాక ‘మీ రేషన్ కార్డులు, కూపన్లు డిపోలకు వస్తాయి. పెన్షన్ల కోసం సంబంధిత అధికారులను సంప్రదించండి’ అంటూ చేతులు దులుపుకొన్నారు.
ఎక్కడ ‘రచ్చ’ అవుతుందోననే..
నగరంలో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న పలువురు మాజీ కార్పొరేటర్లు తమ వర్గీయులకు రచ్చబండలో లబ్ధి చేకూర్చడం లేదని ఆగ్రహంగా ఉన్నారు. చాలా కాాలంగా కొత్త రేషన్ కార్డులు మంజూరుకాకపోవడం, గత ఏడాది మంజూరైన కార్డులను కూడా పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో సంగతి తేల్చుకుందామని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. దీనిపై అధికారులను నిలదీసేందుకు వివిధ రాజకీయ పక్షాలు కూడా సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో డివిజన్లలోకి వెళ్లి రచ్చ చేసుకోవడం కన్నా పోలీసు పహారాలో మంత్రితో ఓ సభ, ముఖ్యమంత్రితో మరోసభ నిర్వహించి ‘మమ’ అనిపించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తమ సమస్యలు చెప్పుకుందామని, పథకాల ప్రయోజనం పొందుదామని గంపెడాశలు పెట్టుకున్న జనానికి నిరాశే మిగిలింది.
రెండునాళ్ల ముచ్చట
Published Tue, Nov 19 2013 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement
Advertisement