pithani satyanarayana
-
శాండ్ కింగ్ గా పేరు గడించిన పితాని సత్యనారాయణ
-
పితాని మాజీ పీఎస్ సస్పెన్షన్..
సాక్షి, అమరావతి: ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టయిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (మాజీమంత్రి పితాని పాత్రపైనా ఆరా) టీడీపీ హయాంలో జరిగిన ఈఎస్ఐ భారీ స్కామ్‌లో అప్పటి కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పాత్ర ఎంత అనే దానిపైనా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆరా తీస్తోంది. కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు తర్వాత పితాని ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ పాలనలో ఈఎస్ఐలో 988.77కోట్ల నిధులు ఖర్చుపెట్టారు. వీటిలో టెలీ హెల్త్ సర్వీసెస్, మందులు, ఫర్నీచర్, వైద్య సామాగ్రి కొనుగోళ్లతోపాటు అనేక లావాదేవీలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. వీటిలో రూ.150 కోట్లకు పైగా అవినీతి, అక్రమాలు జరిగాయని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిగ్గు తేల్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ ఈ కుంభకోణంలో 19 మంది ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించి.. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసింది. -
మాజీమంత్రి పితాని పాత్రపైనా ఆరా
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో జరిగిన ఈఎస్ఐ భారీ స్కామ్‌లో అప్పటి కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పాత్ర ఎంత అనే దానిపైనా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆరా తీస్తోంది. కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు తర్వాత పితాని ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ పాలనలో ఈఎస్ఐలో 988.77కోట్ల నిధులు ఖర్చుపెట్టారు. వీటిలో టెలీ హెల్త్ సర్వీసెస్, మందులు, ఫర్నీచర్, వైద్య సామాగ్రి కొనుగోళ్లతోపాటు అనేక లావాదేవీలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. వీటిలో రూ.150 కోట్లకు పైగా అవినీతి, అక్రమాలు జరిగాయని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిగ్గు తేల్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ ఈ కుంభకోణంలో 19 మంది ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించి.. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసింది. పితాని హయాంలోనూ అవే అక్రమాలు ► పితాని మంత్రిగా వ్యవహరించిన కాలంలోనూ అవే అక్రమాలు, అవకతవకలు కొనసాగినట్టు ఏసీబీ గుర్తించింది. ► పితానికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన మురళీమోహన్, పితాని కుమారుడు వెంకట సురేష్లను నిందితులుగా చేర్చింది. ► హైదరాబాద్‌కు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకోవాలని ఈఎస్ఐ అధికారులకు తాను లేఖ ఇచ్చిన మాట వాస్తవమే అయినా తన హయాంలో లావాదేవీలు జరగలేదని, ఆ తర్వాతే జరిగాయని ఏసీబీ విచారణలో స్పష్టం చేసిన అచ్చెన్నాయుడు తన తర్వాత పితాని ప్రమేయాన్ని చెప్పకనే చెప్పినట్టయ్యింది. ► తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్ కాంట్రాక్టర్లతో లావాదేవీలు జరిపారని, బిల్లులు చెల్లింపులు వంటి అంశాలపై సురేష్ నేరుగా అధికారులకు ఫోన్లు చేసి మాట్లాడేవారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ► ఇందుకు సంబంధించి పితాని కుమారుడి ఫోన్ కాల్స్ డేటాను విశ్లేషిస్తున్నట్టు సమాచారం. ► పితాని వ్యక్తిగత కార్యదర్శిని ఇప్పటికే అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. ► పితాని కుమారుడు, అతడి మాజీ పీఎస్ ముందస్తు బెయిల్‌కు ప్రయత్నించగా.. హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో పితాని కుమారుడిని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ బృందాలు పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముచిక్కాల, భీమవరం, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో గాలింపు ముమ్మరం చేశాయి. అచ్చెన్న బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదా పడింది. మంగళవారం అచ్చెన్నాయుడు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ.. ఏసీబీ అధికారులు చట్టం నిర్దేశించిన విధి విధానాలను పాటించకుండానే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారని చెప్పారు. ఇలాంటప్పుడు బెయిల్ మంజూరు చేయవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందన్నారు. ఆ తీర్పు కాపీలు న్యాయమూర్తి ముందు లేకపోవడంతో విచారణ గురువారానికి వాయిదా వేస్తూ జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
మాజీ మంత్రి పితాని కుమారుడికి హైకోర్టు షాక్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్ సహా మరో ఇద్దరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే భయంతో పితాని కుమారుడు వెంకట సురేష్, పితాని మాజీ పీఎస్ మురళీమోహన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మురళీమోహన్ను శుక్రవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.. (చక్రం తిప్పిన పితాని కుమారుడు?) తెలుగుదేశం ప్రభుత్వ హయంలో అచ్చెన్నాయుడు తర్వాత పితాని సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అచ్చెన్నాయుడు హయాంలో మందుల కొనుగోలు, పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున స్కాం జరిగింది. ఆ స్కాం పితాని సత్యనారాయణ హయాంలోనూ కొనసాగింది. పితాని మంత్రిగా ఉన్న సమయంలో కార్మికశాఖలో ఏ పని జరగాలన్నా మంత్రి కుమారుడు వెంకట్ కనుసన్నల్లోనే జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఏ కాంట్రాక్టు కావాలన్నా వెంకట్‌ను కలిసి పది శాతం చెల్లిస్తేనే పనులు జరిగినట్లుగా ప్రచారం జరిగింది. తమ పనుల కోసం కాంట్రాక్టర్లు పితాని స్వగ్రామం కొమ్ముచిక్కాలకు క్యూ కట్టేవారు. పితాని వెంకట్ చీటీపై టెండర్లు ఎవరికి కేటాయించాలో రాసిచ్చేవారని, దాని ఆధారంగానే పనులు జరిగేవని తెలుస్తోంది. -
టీడీపీ నేతలకు చుక్కెదురు
కాకినాడ: పేదలకు పంచేందుకు సిద్ధం చేసిన భూములను మడ అడవులుగా చూపే ప్రయత్నంలో ఏర్పాటైన టీడీపీ నిజ నిర్థారణ కమిటీకి తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని దుమ్ములపేటలో చుక్కెదురైంది. ప్రభుత్వం సేకరించిన భూమి వద్దకు శుక్రవారం వచ్చిన టీడీపీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, పితాని సత్యనారాయణ, జవహర్‌లతో కూడిన కమిటీతో పాటు స్థానిక టీడీపీ నేతలను లబ్ధిదారులు నిలువరించారు. కాకినాడ దుమ్ములపేట స్థలం వద్దకు చేరుకున్న టీడీపీ నేతలను నిరసిస్తున్న లబ్ధిదారులు టీడీపీ హయాంలోనే ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని, వేరొక కంపెనీకి 75 ఎకరాల స్థలాన్ని కేటాయించగా లేని అభ్యంతరాలు ఇప్పుడేమిటని నిలదీయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన పోలీసులు కమిటీకి నచ్చచెప్పి పంపేయడంతో లబ్ధిదారులు కూడా వెళ్లిపోయారు. దీంతో వివాదం సద్దుమణిగి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
‘కేసీఆర్ ఎక్కడికైనా రావొచ్చు.. రమ్మనండి’
సాక్షి, అమరావతి : భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నమ్మారని, అందుకే కాంగ్రెస్ వ్యతిరేక భావాలతో పుట్టిన టీడీపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకుందని ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. బీజేపీ సంకని తాము ఎక్కితే తమ సంకని బీజేపీ వాళ్లు ఎక్కారంటూ చమత్కరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ ఎక్కడికైనా రావచ్చు.. ఎవరైనా రావొచ్చు.. రమ్మనండి’ అని అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, పోటీ చేయటం సహజమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టే అక్కడకు వెళ్లి పోటీ చేసినట్లు తెలిపారు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీతో ఉంటామని వెల్లడించారు. ఏపీకి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ కలవటం వల్లే తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయారనడం కరెక్ట్ కాదని, ఓడిపోయాక ఏదైనా మాడ్లాడతారని ఆయన మండిపడ్డారు. -
మంత్రి పితానిపై సీఎం ఆగ్రహం
సాక్షి, అమరావతి: రేషన్ కార్డులు కోరుతూ పేదలు మీ సేవాకేంద్రాల్లో ఇచ్చిన దరఖాస్తులను పట్టించుకోరా అంటూ కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ అధికారులను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో పితాని మాట్లాడుతూ ప్రజా సాధికార సర్వేను ఆధారంగా చేసుకుని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారని, దీనివల్ల గతంలోని పేదల దరఖాస్తులను పరిశీలించకపోవడంతో వారు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సీఎం కలుగజేసుకుని.. రేషన్ కార్డులు ఎవ్వరికి రాలేదు? అనవసరంగా మాట్లాడితే ప్రయోజనం ఏముంటుంది? పేదలకు కార్డులివ్వలేదని మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా.. అంటూ మంత్రిపై అసహనం వ్యక్తం చేశారు. మీ తీరు చూస్తుంటే బస్సెక్కి మా ఊరికి టికెట్టివ్వండి అన్నట్టుగా ఉందని.. ఏదైనా మాట్లాడేటప్పుడు కచ్చితమైన వివరాలు దగ్గర పెట్టుకోవాలని చంద్రబాబు సూచించారు. ఆధారాల్లేకుండా మాట్లాడను : పితాని దీంతో మంత్రి అదే తరహాలోనే స్పందిస్తూ ఆధారాల్లేకుండా నేను మాట్లాడను సర్.. మీ సే వా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని, రేషన్ కార్డులు మంజూరుకాని పేదల వివరాలిస్తాను. వారికి రేషన్ కార్డులివ్వండి.. అంటూ మంత్రి కోరారు. -
పొత్తులపై పూర్తి నిర్ణయం ఆయనదే!
సాక్షి, అమరావతి: టీడీపీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టకోబోతోందన్న ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి. అయితే కాంగ్రెస్‌తో పొత్తు ఒక్క తెలంగాణలోనేనా లేక ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొనసాగించాలా అని ఆ పార్టీ తర్జనభర్జన పడుతోందని తెలుస్తోంది. పొత్తులపై ఇప్పటికే మంత్రులు, పార్టీ సీనియర్ నాయకుల సలహాలు సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నారు. తారాస్థాయిలో జరగుతున్న పొత్తుల అంశంపై ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ మీడియా చిట్‌చాట్‌లో స్పందించారు. పొత్తుల అంశంపై గురువారం రాత్రి 11 గంటల వరకు మంత్రుల సమావేశం జరిగిందని.. నేతలందరికీ సీఎం ఒక డైరెక్షన్ ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో పూర్తి నిర్ణయాధికారం అధ్యక్షుడికే వదిలేశామని పితాని స్పష్టం చేశారు. వ్యతిరేకత పెరుగుతుండటంతోనే ‘ముందస్తు’కు: యనమల టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండటంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లినట్లు అనిపిస్తోందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగితే ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌కు పడతాయనే ఆందోళన కూడా ఒక కారణం కావచ్చన్నారు. కేంద్రం తెలంగాణపై సానకూలంగా ఉంటుందని.. కానీ ఏపీపై కపట ప్రేమ ప్రదర్శించిందని విమర్శించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విధాన నిర్ణయాలు తీసుకోవడం కుదరదని, మధ్యంతర భృతి ప్రకటన చేసినా.. అమలు చేసే పరిస్థితి ఎంత వరకు ఉంటుందో అని అనుమానం వ్యక్తం చేశారు. -
పశ్చిమ గోదావరి: టీడీపీలో ముసలం
సాక్షి, ఆచంట/పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో ముసలం పుట్టింది. ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ ఎంపీపీ సురేఖ తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. మంత్రి పితాని సత్యనారాణ వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా గురువారం అవిశ్వాసం పెడుతున్నారనీ, మంత్రి వేధింపులు తట్టుకోలేకనే రాజీనామా చేసినట్టు ఆమె మీడియాకు వెల్లడించారు. మంత్రిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎంపీ సీతారామ లక్ష్మికి ఫిర్యాదు చేశానని తెలిపారు. -
ఇప్పుడు సమ్మెలు లేవు
సాక్షి, అమరావతి: ఒకప్పుడు శ్రమ దోపిడీ వల్ల కార్మికులు రోడ్లెక్కి ధర్నాలు, సమ్మెలు చేసేవారని, మారుతున్న కాలానికి అనుగుణంగా యాజమాన్యాలు కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోవడంతో ఇప్పుడు ధర్నాలు, సమ్మెలు లేవని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మే డే సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది అసంఘటిత కార్మికులుగానే ఉన్నారని, వీరంతా భవనాల నిర్మాణం, ఫ్యాక్టరీలు, ఇళ్లల్లో పనిచేస్తున్నారని తెలిపారు. కార్మికులతో సరిగా పనిచేయించేవారే ఉత్తమ యాజమానులని, పరిశ్రమల అభివృద్ధికి పనిచేస్తూ సహకరించేవారే ఉత్తమ కార్మికులని తెలిపారు. చట్టాలు, తనిఖీలు ఆన్లైన్లోనే.. రాష్ట్రంలో 2.13 కోట్ల మంది చంద్రన్న బీమాలో అసంఘటిత కార్మికులుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. కార్మిక చట్టాలను ఆన్లైన్ చేశామని, తనిఖీలను కూడా ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పరిశ్రమలో ఎక్కువ మంది పనిచేస్తున్నారని, 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు రూ. 1,140 కోట్లను చంద్రన్న బీమా కింద ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలోని ఈఎస్ఐ ఆస్పత్రులకు రూ. 80 కోట్లతో వసతులు కల్పిస్తున్నామని, 79 ఐటీఐలను ఆధునికంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్రంలో కార్మికులు అశాంతిగా ఉండకూడదని, కార్మిక అశాంతి ఉంటే పరిశ్రమలు రావని చెప్పారు. మూడు ఈఎస్ఐ ఆస్పత్రుల ప్రారంభం.. కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కార్మికుల కోసం 25 ఈఎస్ఐ ఆస్పత్రులను ఏర్పాటుచేయగా అందులో మూడు ప్రారంభమయ్యాయని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా 2018కి సంబంధించిన శ్రమశక్తి, బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డులను బహూకరించారు. -
బాలకృష్ణ వాడిన పదజాలం తప్పే: మంత్రి
తూర్పుగోదావరి జిల్లా: సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వాడిన పదజాలం తప్పేనని ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ..రాజకీయాలలో మాట్లాడే బాష నాయకులు నేర్చుకోవాలని హితవుపలికారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై కేంద్రం రాజకీయ కుట్ర చేసే పరిస్థితి ఉందన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ రాజకీయాలు చేస్తున్నారని, ప్రజల్లోకి వచ్చి రాజకీయాలు చేయాలని సూచించారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆవేశపరులని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సోముకు తగదన్నారు. టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఎమ్మెల్యే అనిత బాధ్యతలు తీసుకోకపోవచ్చునని జోస్యం చెప్పారు. -
నీతివంతమైన పాలనే ధ్యేయం
శ్రీకాకుళం రూరల్ : రాష్ట్రంలో నీతివంతమైన పాలన అందించుటకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళంలోని బలగ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కార్యాలయ భవనాన్ని ఆయన శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శక పాలన దిశగా ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ఎక్కడా ఎటువంటి లోపాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. అవినీతిని అరికట్టేందుకు, ప్రజల సమస్యలు తెలిపేందుకు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ను తీసుకొచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అవినీతి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చూడాలన్నదే ముఖ్య మంత్రి ఉద్దేశమన్నారు. ఒకప్పుడు దేశంలో అవినీతిలో 3వ స్థానంలో ఏపీ రాష్ట్రం ఉండగా, ప్రస్తుతం 19వ స్థానానికి తగ్గిందన్నారు. భవిష్యత్తులో అవినీతిలేని రాష్ట్రాన్ని చూడాలన్నారు. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ ఆర్.పి.ఠాకూర్ మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువ కావడానికి తమ శాఖ కృషి చేస్తుందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఫిర్యాదు చేసేందుకు 1064 టోల్‌ఫీ నంబర్‌తో పాటు వాట్సాప్ నంబర్(8333995858)ను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్, జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి, జిల్లా పరిషత్ అ«ధ్యక్షులు చౌదరి ధనలక్ష్మి, శాసనసభ్యులు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, ఏసీబీ ఓఎస్డీ ఎ.అబ్రహం లింకన్, ఎస్పీ సి.ఎం.త్రివిక్రమవర్మ, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ టి.మోహనరావు, రెవెన్యూ డివిజనల్ అ«ధికారి బలివాడ దయాని««ధి, ఏసీబీ డీఎస్పీ కె.రాజేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురూ ముగ్గురే
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో పేరుకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. అందులో ఒకరు బీజేపికి చెందిన వారు కాగా ఇద్దరు టీడీపీకి చెందిన వారు. బీజేపీ నుంచి గెలిచిన పైడికొండల మాణిక్యాలరావు తనను అంటరానివారిగా టీడీపీ నాయకులు చూస్తున్నారని చెబుతున్నారు. మిగిలిన ఇద్దరు మంత్రులది వారి పంథా వారిదే. జనం గోడు పట్టించుకోవడం లేదు. జిల్లాలో సాగునీరు అందక వరిపైరు ఎండిపోతోందని రైతులు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నా.. కనీసం ఆ విషయమై సమీక్ష జరిపే ప్రయత్నం కూడా ఆ ఇద్దరు మంత్రులు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. పితాని సత్యనారాయణ నియోజకవర్గంలో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఆయన ఇప్పటి వరకూ ఆ ప్రాంతాల్లో పర్యటించిన పాపాన పోలేదు. ఇక మరోమంత్రి కేఎస్ జవహర్‌ది కూడా ఇదే తీరు. పచ్చని పొలాలతో కళకళలాడే పశ్చిమలో మునుపెన్నడూ లేనివిధంగా కరువు ఛాయలు అలముకుంటున్నాయి. మార్చి మొదటివారంలోనే పంట పొలాలు బీటలు వారిపోతున్నాయి. వెరసి అన్నదాతకు తీవ్ర సాగునీటి కష్టం వచ్చింది. ఆరుగాలం శ్రమించే రైతులు ఇప్పుడు రబీ గట్టెక్కేదెలాగా అని మధనపడుతున్నారు. వంతుల వారీ విధానంతో సాగునీరు అందిస్తామన్న పాలకుల హామీలు గాలిలో కలిసిపోవడంతో చుక్క నీరు అందక రైతన్నలు రబీపై ఆశలు వదిలేసుకుంటున్నారు. జిల్లాలో నరసాపురం, యలమంచిలి, మొగల్తూరు, ఆచంట, పెనుమంట్ర, అత్తిలి, భీమవరం, వీరవాసరం, పాలకోడేరు, పాలకొల్లు, పెంటపాడు, దెందులూరు, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాల్లో ఎప్పుడూ లేని విధంగా సాగునీటి ఎద్దడి నెలకొంది. గోదావరి డెల్టాలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో శివారు పొలాలకు నీరు అందే పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా పచ్చని పంట పొలాలకు నెర్రలు వచ్చాయి. పాలకులు ఏం చేస్తున్నట్టు? సాగునీటి సమస్యపై రైతులు అల్లాడుతున్నా, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి అండగా నిలవాల్సిన పాలకులు కనీసం స్పందించడం లేదని రైతు సంఘాల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కనీసం జిల్లాలోని ఇరిగేషన్ అధికారులను కూర్చోబెట్టి ఏం జరుగుతోంది, ఏం చేస్తే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కుతామన్న ఆలోచన కూడా చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మూడు నెలల క్రితం జరిగిన నీటిపారుదల సలహామండలి సమావేశంలో పట్టిసీమ నుంచి నీరు తరలించడం ద్వారా గోదావరి డెల్టా నష్టపోతోందన్న విషయాన్ని మంత్రి పితాని సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు. గోదావరి నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని వెంటనే పట్టిసీమ నుంచి నీటి సరఫరా నిలిపివేయాలని కోరారు. అయితే తర్వాత దానిపై దృష్టి పెట్టలేదు. ఒకవైపు గోదావరిలో నీరు అడుగంటినా రికార్డుల కోసం 105 టీఎంసీలను తరలించేశారు. పట్టిసీమ కట్టేసే సమయానికే గోదావరిలో నీటి లభ్యత చాలా తక్కువ ఉందని తేలింది. అయినా డెల్టాను కాపాడే దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో ప్రస్తుత సాగునీటి సంక్షోభం తీవ్రస్థాయిలో ముందుకు వచ్చింది. మంత్రులు కేవలం తమ స్వప్రయోజనాలు, సొంత నియోజకవర్గాలకే పరిమితం అయిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బీసీ రిజర్వేషన్‌పై స్పందించిన మంత్రి పితాని
సాక్షి, అమరావతి : కాపుల రిజర్వేషన్ అంశంపై ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ స్పందించారు. వెనుకబడిన వర్గాలకు నష్టం కలిగించే ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఎన్నికల హామీని నెరవేర్చే క్రమంలోనే కాపులకు రిజర్వేషన్ కల్పించారని, బీసీల మనోభావాలు, ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో వ్యక్తిగతంగా చర్చిస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుతం పితాని సత్యనారాయణ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా పితాని మంగళవారం మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వెనుకబడిన వర్గాల్లో నెలకొన్న ఆందోళన నెలకొందని, తాను అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అవసరమైతే బీసీ సంఘ ప్రతినిధులతో కూడా చర్చించేందుకు చొరవ తీసుకునే ప్రయత్నం చేస్తానని తెలిపారు. కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయమై ప్రభుత్వం ముందుగాని, నిర్ణయం వెల్లడించిన తరువాత గానీ వెనుకబడిన వర్గాల ప్రతినిధులతో సంప్రదింపులు చేసి ఉంటే ఇంత గందరగోళం ఉండేదికాదని బీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయని, ఈ విషయంలో తాను కూడా వారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు మంత్రి పితాని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్న బీసీలకు నష్టం కలిగే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించరని, తమకు కూడా బీసీల ప్రయోజనమే ముఖ్యమని ఆయన అన్నారు. కాపు రిజర్వేషన్ అంశంపై వెనుకబడిన వర్గాలు సంయమనంతో వ్యవహరించాలని, సమస్య జఠిలం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం తనకు ఉందన్నారు. అలాగే వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం హర్షణీయమని, దీనివల్ల వారి స్థితిగతులు మారతాయన్నారు. -
పవన్ కల్యాణ్ మనకు మిత్రుడే
సాక్షి, అమరావతి: టీడీపీ రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం వాడీవేడిగా జరిగింది. అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసిన మంత్రి పితాని సత్యనారాయణను చంద్రబాబు మందలించినట్టు తెలిసింది. పవన్‌పై అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని పితానిని సీఎం చంద్రబాబు హెచ్చరించినట్టు సమాచారం. ఇటీవల పవన్ కల్యాణ్‌తో టీడీపీ మైత్రీ కొనసాగుతుందా? అంటూ మంత్రి పితానిని విలేకరులు ప్రశ్నించగా.. పవన్ కల్యాణ్‌కు ఏపీలో పార్టీ జెండానే లేదు.. ఆయన గురించి ఆలోచించే ఓపిక, టైమ్ రెండూ లేవంటూ పితాని ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ టీడీపీకి మిత్రపక్షమని, కాబట్టి ఆయన గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, అనవసర వ్యాఖ్యలు చేయకూడదని చంద్రబాబు టీడీపీ నేతలకు హితబోధ చేసినట్టు సమాచారం. విజయవాడలో ఇటీవల ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపైనా సమావేశంలో చర్చ జరిగింది. విజయవాడలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుచేయకపోవడంపై మంత్రి దేవినేని ఉమాపై చంద్రబాబు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. చంద్రబాబు ఆగ్రహంతో స్పందించిన దేవినేని ఉమా.. 'మీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం' అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, 'అన్నీ నీకు నచ్చినట్టు చేసి.. పార్టీ కార్యాలయం ఏర్పాటులో మాత్రం నా అనుమతి కావాలంటావా?' అని చంద్రబాబు ఉమాపై మండిపడినట్టు తెలుస్తోంది. త్వరలోనే విజయవాడలో టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కేసీఆర్ వచ్చినప్పుడు తెలుగు తమ్ముళ్ల అతి..! మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ పెళ్లి గురించి సమన్వయ కమిటీ భేటీలో చర్చ జరిగింది. శ్రీరామ్ పెళ్లికి తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చిన తెలుగు తమ్ముళ్ల నుంచి విశేషమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లికి కేసీఆర్ వచ్చినప్పుడు మనవాళ్లు అతిగా ప్రవర్తించారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. తన కన్నా కేసీఆర్‌కే తెలుగు తమ్ముళ్లు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని చంద్రబాబు నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. పయ్యావుల కేశవ్‌తో సీఎం కేసీఆర్ రహస్య చర్చలు జరిపారంటూ గందరగోళం సృష్టించారని, ఇలాంటి విషయాల్లో పరిమితంగా ప్రవర్తిస్తే మంచిదని నేతలకు చంద్రబాబు హితబోధ చేశారు. -
టీడీపీ నేతలపై పవన్ కల్యాణ్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్రమంగా అధికార టీడీపీతో దూరం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. 'అశోక్ గజపతి రాజుగారికి పవన్ కల్యాణ్ ఎవరో తెలియదు. మంత్రి పితానిగారికి పవన్ కల్యాణ్ ఎవరో తెలియదు. సంతోషం' అని పవన్ ట్వీట్ చేశారు. తాజాగా పవన్ కల్యాణ్‌తో టీడీపీ మైత్రీ కొనసాగుతుందా? అని మంత్రి పితాని సత్యనారాయణను విలేకరులు ప్రశ్నించగా.. పవన్ కల్యాణ్‌కు ఏపీలో పార్టీ జెండానే లేదు.. పవన్ గురించి ఆలోచించే ఓపిక,టైమ్ రెండూ లేవని ఆయన వ్యాఖ్యానించారు. అశోక్ గజపతిరాజు కూడా గతంలో ఇదేవిధంగా స్పందించారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ ట్వీట్ చేసినట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీ-బీజేపీ కూటమికి అనుకూలంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన అధికార టీడీపీకి దూరం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. Ashok Gajapathi Raju Gariki Pawan kalyan evaro telliyudu Manthri Pithani gariki Pawan Kalyan ento telyudu.. SANTHOSHAM... — Pawan Kalyan (@PawanKalyan) 6 October 2017 -
అక్టోబర్ 2 నుంచి ప్రధానమంత్రి చంద్రన్న బీమా
సాక్షి, అమరావతి: అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత చంద్రన్న బీమా పథకానికి ‘ప్రధానమంత్రి చంద్రన్న బీమా’గా పేరు మార్చినట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. 02–10–2017 నుంచి 31–05–2018 వరకు రెండో విడత పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పథకంలో భాగంగా 2.20 కోట్ల అసంఘటిత కార్మికుల తరఫున 8 నెలల ప్రీమియంకు గాను రూ.235 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. 70 ఏళ్లు దాటిన పాలసీదారులను చంద్రన్న బీమా పథకం నుంచి తొలగించి, కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతను అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వివరాలకు కాల్‌సెంటర్‌కు (నంబర్ 155214) ఫోన్ చేసి తెలుసుకోవచ్చని చెప్పారు. -
ఈ వ్యాజ్యం దాఖలుకు మీరెలా అర్హులు?
* ఎమ్మెల్యే పితానికి హైకోర్టు ప్రశ్న.. విచారణ 11కు వాయిదా సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 1956 నవంబర్ 1 నాటికి స్థిరపడిన కుటుంబాల విద్యార్థులకే ఆర్థిక సాయం అందించేందుకు ‘ఫాస్ట్’ పేరుతో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 36ను సవాలు చేస్తూ మాజీ మంత్రి, టీడీపీ ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. అసలు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసేందుకు మీకున్న అర్హతలు (లోకస్ స్టాండీ) ఏమిటో వివరించాలని పితాని సత్యనారాయణను ఆదేశించింది. ఈ జీవోపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ‘పిటిషనర్ ఓ రాజకీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. అతనేమీ బాధితుడు కాదు. ఈ జీవో వల్ల నష్టపోతున్న విద్యార్థుల తండ్రి కాదు. సంరక్షకుడూ కాదు. ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసేందుకు ఆయనకున్న అర్హతలేమిటి’ అని ధర్మాసనం ప్రశ్నించింది. -
ఊహించని విధంగా పితానిని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్: మాజీ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా ఆచంగ టిడిపి శాసనసభ్యుడు పితాని సత్యనారాయణకు హైకోర్టులో ఊహించని ప్రశ్న ఎదురైంది. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం(ఫాస్ట్) పథకానికి వ్యతిరేకంగా పితాని దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఫాస్ట్ పథకంతో మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా మీరేమైనా స్థానిక ఎమ్మెల్యేనా అని కూడా కోర్టు పిటిషనర్ పితానిని ప్రశ్నించింది. ఈ విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోర్టు వివరణ కోరింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయిబర్స్మెంట్కు సంబంధించి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తూ ఫాస్ట్ పథకాన్ని ప్రకటించింది. ఈ జీవో వివాదస్పాదమైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పథకం ద్వారా విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరమవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఏపీ విద్యార్థులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పేదవిద్యార్థులు అనేకమంది ఉన్నారు. స్థానికత సమస్య తీసుకువచ్చి ఒక్క తెలంగాణ విద్యార్థులకే ఫీ రియింబర్స్‌మెంట్ అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడాన్ని సవాల్ చేస్తూ పితాని సత్యనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యాం దాఖలు చేశారు. -
'నా మౌనం చేతకాని తనంగా తీసుకోకండి'
ఆచంట : ‘నేను అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాను... నేను రూ 500 కోట్లు సంపాదించానంటూ నాపై లేనిపోని దుష్ర్పచారం చేస్తున్నారు.. నా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు.. తప్పుడు రాజకీయాలు చేస్తూ ఆచంటలో అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. నా మౌనాన్ని చేతకానితనంగా చూస్తున్నారు.. అడ్డగోలుగా దోచుకోవడానికి నేను సిద్ధంగా లేను.. ఇటువంటి దుష్ర్పచారం చేస్తున్న వారికి అడ్డుకట్ట వేస్తాను’ అని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు. పితాని ప్రసంగంతో ఆచంట నియోజకవర్గ టీడీపీలోని వర్గ విభేదాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. బుధవారం ఆయన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఉద్వేగంగా ప్రసంగించారు. ఆచంటలో కొంతమంది స్వార్థ రాజకీయాలు చేస్తూ అమాయకులైన ప్రజలను రెచ్చగొడుతున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు. రహదారుల విస్తరణకు అడ్డుతగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆచంటలో ఇళ్ల స్థలాలు కావాలంటూ చేస్తున్న ఆందోళనకారులలో చాలా మందికి పట్టాలు పంపిణీ చేశామని, కొందరు వారికి డబ్బులిచ్చి తనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఏ తప్పుడు ప్రచారం చేసినా ఎన్నికలలో తన విజయాన్ని అడ్డుకోలేకపోయారని అన్నారు. -
పితాని ఎక్కడ?
- ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో కానరాని సీనియర్ నేత - మంత్రి పదవి ఆశించి భంగపాటు - వ్యూహాత్మక మౌనమా.. అసంతృప్త రాగమా! - టీడీపీ శ్రేణుల్లో ఎడతెగని చర్చ సాక్షి ప్రతినిధి, ఏలూరు : పితాని సత్యనారాయణ.. గడచిన దశాబ్ద కాలంలో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి. ఇప్పుడు కూడా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే. కాంగ్రెస్ హయాంలో ఐదేళ్లపాటు మంత్రిగా జిల్లా రాజకీయాలను కనుసైగలతో శాసించిన పితాని టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. గడచిన 50 రోజుల కాలంలో ఎక్కడా ప్రజలకు.. కనీసం నాయకులకు కూడా కానరావడం లేదు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తప్పించి మరే ఇతర ప్రభుత్వ, పార్టీపరమైన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్న దాఖలాలే లేవు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సందర్భంలోను, ఎంపీపీ ఎన్నికల వేళ కూడా ఆయన జాడే లేదు. బీసీ కోటాలో ప్రస్తుత టీడీపీ హయాంలోనూ మంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడిన ఆయన వ్యూహాత్మకంగా మౌనముద్ర వహిస్తున్నారా.. అసంతృప్తితో దూరంగా ఉంటున్నారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయమైంది. సుజాతకు మంత్రి పదవి రావడంతో... 2004లో పెనుగొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పితాని తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పెనుగొండ నియోజకవర్గం రద్దయి ఆచంటలో కలిసింది. అప్పటి ఎన్నికల్లో పితానికి ఆచంట నుంచి పోటీచేసే అవకాశాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కల్పించారు. ఆరోగ్యశ్రీ శాఖ మంత్రి పదవిని సైతం కట్టబెట్టారు. ఆ తర్వాత రోశయ్య కేబినెట్లోనూ పితాని కొనసాగారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో సాంఘిక సంక్షేమ శాఖ, ఆర్ అండ్ బీ వంటి కీలక శాఖలు చేపట్టి జిల్లా రాజకీయాలను శాసించారు. అప్పట్లో మంత్రి హోదాలో వట్టి వసంతకుమార్ ఉన్నప్పటికీ పితాని హవా సాగించారు. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేసిన తర్వాత ఆయన వెంటే ఉండి జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఎన్నికల వేళ చివరి నిమిషంలో టీడీపీలోకి వెళ్లి ఆచంట నుంచి పోటీచేసి అతి తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. వరుసగా మూడుసార్లు గెలవడంతోపాటు బీసీ వర్గానికి చెందిన సీని యర్ నేతగా ఉన్న తనకు మంత్రివర్గంలో అవకాశం వస్తుందని ఆశించారు. కానీ చంద్రబాబు అనూహ్యంగా పీతల సుజాతకు మంత్రి పదవిని కట్టబెట్టడంతో పితాని ఆశలు తల్లకిందులయ్యాయి. దీనివల్ల పితానికి రాజకీయంగానూ ఒకింత ఇబ్బందికర పరిస్థితి ఎదురుకానుందని అంటున్నారు. సుజాత వైపు ఆచంట టీడీపీ శ్రేణులు 2004లో ఆచంట ఎమ్మెల్యేగా పీతల సుజాత గెలుపొందారు. అప్పట్లో ఎస్సీ రిజర్వుడు స్థానమైన ఈ నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా 2009లో జనరల్ కావడంతో ఆమెకు ఆ ఎన్నికల్లో చంద్రబాబు సీటు ఇవ్వలేదు. 2014 ఎన్నికల్లో ఆమె చింతలపూడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందిన విష యం తెలిసిందే. ఆచంట పూర్వ ఎమ్మెల్యేగా ఉన్న విస్తృత పరిచయాల నేపథ్యంలో ఇప్పుడు ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు మం త్రి సుజాతనే ఆశ్రయిస్తున్నారు. టీడీపీలోకి పితాని రాకను మొదటినుంచీ వ్యతి రేకిస్తున్న ఓ వర్గం పూర్తిగా సుజాత వెంటే ఉంటోంది. ఈ పరిణామాలు పితానికి ఇబ్బందిగా మారాయంటున్నారు. ఈ దృష్ట్యా కొన్నాళ్లపాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందుకే విదేశంలో బంధువుల ఇంట సేదతీరుతున్నట్టు తెలు స్తోంది. ఈనెల 16, 17తేదీల్లో చంద్ర బాబు జిల్లా పర్యటనకు రానున్నారు. అప్పుడైనా పితాని మొహం చూపిస్తారా, చాటేస్తారా అనేది తేలాల్సి ఉంది. -
కులాల మధ్య పితాని చిచ్చు
సాక్షి, ఏలూరు :పదేళ్లు పదవిని అనుభవించి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి మళ్లీ పదవి కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. నైతికంగా దిగజారి కుటిల రాజకీయాలు చేస్తూ కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఆయనే మాజీ మంత్రి, ఆచంట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ. 2004లో పెనుగొండ నుంచి, 2009లో ఆచంట నియోజకవర్గం నుంచి గెలుపొందిన పితాని అంతకుముందు వరుసగా రెండుసార్లు ఓడిపోయారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలోనూ పనిచేసిన ఆయన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గానీ కాంగ్రెస్ పార్టీని వీడలేదు. అనంతరం కిరణ్ స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో భాగమయ్యారు. ఆ పార్టీ రాష్ర్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించిన ఆయన కొద్దిరోజులకే టీడీపీలో చేరారు. సొంత బావ, ఆచంట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గుబ్బల తమ్మయ్యకు వెన్నుపోటు పొడిచి ఆ సీటును తన్నుకుపోయారు. ఇంతచేసినా వైఎస్సార్ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజును ఎదుర్కోలేకపోతున్నారు. వైఎస్సార్ సీపీని ఎదుర్కొనేందుకు పితాని అధర్మ యుద్ధానికి దిగారు. పదవిలో ఉండి వెనకేసుకున్న అక్రమ సొమ్మును ఎన్నికల కోసం ఆయన వెదజల్లుతూ కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. రహస్య మంతనాలు జరుపుతూ మాట వినని వారి సామాజిక వర్గాల మధ్య చీలికలు తెస్తున్నారు. వైఎస్సార్ సీపీని ఓడించేందుకు ఆయన చేస్తున్న అత్యంత నీచమైన ప్రయత్నాలను జనం అసహ్యించుకుంటున్నారు. తెలుగుతల్లిని ముక్కలు చేస్తుంటే కళ్లు మూసుకుని, చివరి వరకూ పదవిని పట్టుకుని వేలాడిన ఆయనకు ఓటు వేసేదే లేదంటూ తెగేసిచెబుతున్నారు. అయితే పితాని మాత్రం వెయ్యి రూపాయలు ఇచ్చి ఓటు కొనాలని చూస్తున్నారు. దాని కోసం సొత్తు ఇప్పటికే సిద్ధం చేశారు. బూత్ స్థాయికి ఆ సొమ్మును తరలించారు. అన్నేళ్లు పదవిలో ఉండి కూడా నియోజకవర్గ ప్రజల బాగోగులు పట్టించుకోని పితాని కుటిల పన్నాగాలకు ఓటుతో బుద్ధి చెప్పడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు. -
పితాని ఎదురీత
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మొన్నటివరకూ రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైన వ్యక్తిగా చక్రం తిప్పిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఈ ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి మద్దతు లేకపోవడం.. స్వల్ప వ్యవధిలోనే కాంగ్రెస్ నుంచి జై సమైక్యాంధ్ర పార్టీకి.. తరువాత తెలుగుదేశం పార్టీకి మారడంతో జనంలో చులకనయ్యారు. మరోవైపు ఐదేళ్లపాటు మంత్రిగా.. ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డికి సన్నిహితుడిగా ఉన్నా నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా సొంత లాభం కోసమే పనిచేయడం ఆయనపై వ్యతిరేకతను పెంచాయి. దీంతో తాజా ఎన్నికలు ఆయనకు అగ్నిపరీక్షగా మారాయి. రాష్ట్రం విడిపోతున్నా లెక్కచేయకుండా మంత్రి పదవిలో కొనసాగిన పితాని రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెంట నడిచిన విషయం తెలిసిందే. కిరణ్ స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి కొద్దిరోజుల కీలకంగా వ్యవహరిం చారు. ఆ పార్టీకి ఆదరణ లేదని తేల డంతో వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో ఆయన పదవి కోసం ఎన్ని పార్టీలైనా మారతారని.. ఏమైనా చేస్తారనే విమర్శలు వెల్లువెత్తాయి. అధికారం ఎక్కడుంటే అక్కడ అతుక్కుపో యే ఆయన నైజంపై తొలినుంచీ నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అందని టీడీపీ నేతల సహకారం టీడీపీలో చేరిన పితానికి ఆ పార్టీ నేతలు మనస్ఫూర్తిగా సహకరించ డం లేదు. దీంతో ఆయన అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. ఇంతకాలం తమను తిట్టి, వేధించిన వ్యక్తి కోసం ఎలా పనిచేస్తామని ప్రతి గ్రామంలో ప్రశ్నిస్తున్నారు. తనకు ఇవ్వాల్సిన సీటును ధనబలం ఉన్న పితానికి ఇవ్వడంతో అప్పటివరకూ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరించిన గుబ్బల తమ్మయ్య పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది పితా నిని కోలుకోలేని దెబ్బతీసింది. అప్పటివరకూ బీసీల ఓట్లు తనకే అని ఆయన భావించినా.. తమ్మయ్య దెబ్బకు ఆ నమ్మకం పోయింది. మరోవైపు ఏ గ్రామంలోనూ టీడీపీ నేతలు ఆయన్ను దరికి చేరనీయడంలేదు. ఆచంట వేమవరంలో పితాని కోసం పనిచేసేది లేదని ఆయన ఎదు టే చెప్పిన గ్రామస్తులు, టీడీపీ నేతలు ఆయనను అక్కడినుంచి వెనక్కి పంపించారు. చాలా గ్రామాల్లో మంత్రి అనుచరులు టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న నేతలను మొన్నటివరకూ ఇబ్బందులకు గురిచేశారు. దీంతో పితా ని అనుచరులు, టీడీపీ నేతల మధ్య పొసగడం లేదు. పితాని తన అనుచరులకు ప్రాధాన్యత ఇస్తూ తమపై పెత్త నం చేసేందుకు వారిని రంగంలోకి దిం పుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల టీడీపీ నేతలు తప్పక ఆయన వెనుక మొక్కుబడిగా నడుస్తున్నా ఎన్నికల్లో మాత్రం వ్యతిరేకంగానే పనిచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నా చేసింది సున్నా మరోవైపు ఐదేళ్లు మంత్రి పదవిలో ఉన్న పితాని నియోజకవర్గాన్ని ఏవి ధంగా అభివృద్ధి చేయలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాం ఘిక సంక్షేమంతోపాటు ఆర్ అండ్ బీ శాఖకు మంత్రిగా ఉన్నా ప్రజలు చెప్పుకునే స్థారుులో ఒక్క పనికూడా ఆయన చేసిన పాపానపోలేదు. మంత్రిగా ఉన్న సమయంలో సొంత లాభం కోసమే ఆయన పనిచేసినట్లు ఆరోపణలున్నాయి. గోదావరి ఇసుక ర్యాంపులు ఆయనకు కామధేనువుగా మారాయనే విమర్శలున్నాయి. ఆ ర్యాంపుల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్లు టీడీపీ నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. డెల్టా ఆధునికీకరణ పనులకు సంబంధించిన కాంట్రాక్టుల్లోనూ పర్సంటేజీలు తీసుకుని ఇష్టానుసారం వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. పనులు జరక్కపోయినా కాంట్రాక్టర్లను ఏమీ అనకుండా వదిలేసి అధికారులను బాధ్యుల్ని చేసి పితాని చేతులు దులిపేసుకునేవారు. ఇవన్నీ ఆయన ని జస్వరూపాన్ని బయటపెడుతున్నాయి. అధికారం ఉన్నప్పుడు అత్యంత బల వంతునిగా కనిపించిన పితాని అది కాస్తాపోయి టీడీపీలో చేరిన తర్వాత అత్యంత బలహీనంగా కనిపిస్తున్నారు. అందుకే ఎన్నికల ప్రచారానికి కూడా ఆయన సరిగా తిరగడం లేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. సహాయ నిరాకరణ చేస్తున్న క్యాడర్‌ను బతిమాలుకోవడానికి, పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేతలను బుజ్జగించడానికే ఆయన సమయం సరిపోతోంది. -
కిరణ్‌కుమార్‌రెడ్డితో ఒరిగేదేమీ లేదు: పితాని
హైదరాబాద్: మాజీ మంత్రి, జైసమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షుడు పితాని సత్యనారాయణ శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ముప్పలనేని శేషగిరిరావు కుమారుడు శ్రీనివాసరావు కూడా పార్టీలో చేరారు. వీరిద్దరికి చంద్రబాబు పచ్చకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజాగా వెల్లడైన వివిధ సర్వేల ఫలితాల్లో టీడీపీ పుంజుకుంటోందని వెల్లైడెందన్నారు. వైఎస్సార్సీపీ బలం తగ్గిపోతోందన్నారు. సీమాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే శక్తి తనకే ఉందని భావించి పలువురు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. దేశ వ్యాపితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. పితాని మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డితో ఒరిగేదేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేయటంతోనే తాము బైటకు వచ్చామన్నారు. -
బావకు ఎసరుపెట్టిన బావమరిది
ఎక్కడైనా బావమరిది బాగు కోరతాడు అంటారు. కానీ, బావగారి సీటు లాగేసుకునే బావమరిదిని ఎక్కడైనా చూశారా? పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో సరిగ్గా ఇదే జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టడానికి ప్రధానంగా ప్రోత్సహించిన వ్యక్తి, కిరణ్‌ను ముందునుంచి వెనకేసుకొచ్చి, ఆయనపై ఈగ కూడా వాలకుండా చూసిన వారిలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఒకరు. మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్‌లో కిరణ్ కొంతమంది విద్యార్థులతో సమావేశం ఏర్పాటుచేసినప్పుడు.. ఆ సమావేశంలో కిరణ్‌తో పాటు పాల్గొన్న ఆయన ఏకైక సహచరుడు కూడా పితానే. అలాంటి పితాని సత్యనారాయణ.. కిరణ్ పార్టీని వదిలిపెట్టి చంద్రబాబు పంచన చేరారు. కిరణ్ పెట్టిన పార్టీ వల్ల ఏమాత్రం ఉపయోగం లేదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల పార్టీయే కావాలి కాబట్టి తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని చెప్పారు. ఇక్కడివరకు బాగానే ఉంది గానీ, ఎన్నికల్లో పోటీ విషయానికి వచ్చేసరికే అసలు సమస్యంతా వచ్చింది. ఆచంట టీడీపీ టికెట్ దాదాపుగా తనదేనన్న నమ్మకంతో పెనుగొండ కాలేజి మాజీ ప్రిన్సిపల్ గుబ్బల తమ్మయ్య ఇప్పటికే కాళ్లకు బలపాలు కట్టుకుని నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఆయన స్వయానా పితాని సత్యనారాయణ అక్కకు భర్త. అంటే, పితానికి తమ్మయ్య బావగారు అవుతారు. ఇప్పుడు ఆచంట టీడీపీ టికెట్ పితానికి దక్కొచ్చని చెబుతున్నారు. అంటే, సొంత బావగారి నోటిదాకా వచ్చిన ముద్దను బావమరిదే లాగేసుకుంటున్నారన్న మాట. ఇదెక్కడి చోద్యమని ఆ జిల్లా వాసులు నోళ్లు నొక్కుకుంటున్నారు.